అభిప్రాయం
గతాన్ని సమీక్షించుకుంటూనే, రాబోయే కాలంలో శాస్త్ర, పరిశోధన రంగాల్లో భారత్ ఎటువంటి అద్భుతాలు సృష్టించనున్నది, ప్రపంచ యవనికపై మన దేశం ఏ ఏ మైలురాళ్లను అధిగమించబోతోంది అనే అంశాలను తరచి చూడాల్సిన సమ యమిది. శాస్త్ర – సాంకేతిక రంగంలో ఆవిష్కరణలు ఒక్కోసారి యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. ఎక్స్–రే వంటివి కనిపెట్టడాలు అనుకోకుండా జరిగినవే అయినా, భారీ ప్రాజెక్టులు మాత్రం పక్కా ప్రణాళికతోనే పట్టా లెక్కుతాయి. ఏళ్ల తరబడి సాగే కఠోర శ్రమ, వ్యూహాల ఫలితంగానే ఆ యా రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది.
1969 తర్వాత మళ్లీ ఇప్పుడు జాబిల్లిపై మనిషిని దించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ‘నాసా’ చేపట్టిన ‘ఆర్టిమిస్’ కార్యక్రమం ద్వారా వ్యోమగాములను చంద్రుడి పైకి పంపే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మరోవైపు చైనా సైతం తన ‘ఛాంగ్ ఈ–7’ ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు సిద్ధమైంది. సూర్యరశ్మి సోకని ఈ ప్రాంతంలో ఘనీభవించిన నీటి జాడలు ఉన్నట్లు తేలడంతో ప్రపంచ దేశాల్లో ఆసక్తి పెరిగింది. చైనా ఈ ఏడాదే ‘జున్టియాన్’ టెలిస్కోపును, ‘మెంగ్‌ఝౌ–1’ వ్యోమ నౌకను పరీక్షించనుంది. 2026 నాటికి ‘లాంగ్ మార్చ్–10’ ద్వారా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపాలన్నది చైనా లక్ష్యం.
అంతరిక్ష రక్షణ విషయానికొస్తే, నాసా ’డార్ట్’ తరహాలోనే ఒక సరికొత్త ప్లానెటరీ డిఫెన్స్ ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ‘2015 ఎక్స్‌ఎఫ్261’ అనే ఖగోళ శకలాన్ని నేరుగా ఢీకొట్టి దాని మార్గాన్ని మళ్లించే ప్రయత్నం చేయనున్నారు. గతంలో ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్లనే రాక్షసబల్లులు అంతరించినట్లు శాస్త్రవేత్తలు చెబుతుంటారు. భవిష్యత్తులో అటువంటి ముప్పులు రాకుండా ఉండటంతో పాటు, ఆయా గ్రహశకలాల్లో ఉండే అరుదైన ఖనిజాలను మన అవసరాలకు వాడుకోవడం ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. కిలోమీటరు పొడవుండే ఉల్కా శకలాలను ఒడిసిపట్టి ఆర్థిక ప్రయోజనాలు పొందడం ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న సవాలు.
గగన్ యాన్ పరీక్ష...
భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మానవసహిత అంత రిక్ష ప్రయోగం ‘గగన్ యాన్ ’కు 2026 సంవత్సరం చాలా కీలకం కానుంది. అసలు ప్రయోగానికి ముందు సిబ్బంది లేకుండా అనేక ప్రయోగాలు నిర్వహించనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. హ్యూమనాయిడ్ రోబో ‘వ్యోమమిత్ర’, అత్యవసర పరిస్థితుల్లో వ్యోమనౌక నుంచి సురక్షితంగా బయటపడేందుకు ఉద్దేశించిన క్రూ ఎస్కేప్ సిస్టమ్, ప్యారాచ్యూట్ వ్యవస్థ పనితీరు, గగన్ యాన్ క్యాప్సూల్‌ను కక్ష్య వరకూ తీసుకెళ్లడం వంటివన్నీ ఉన్నాయి. ‘బ్లూ ఆరిజిన్’ తన హెవీ లాంచర్‌తో జాబిల్లిపైకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తమ్మీద ఈ ఏడాది అటు ప్రభుత్వ, ఇటు వ్రైవేట్ కంపెనీల అంతరిక్ష ప్రయోగాలు, జాబిల్లి యాత్రలు చాలానే ఉన్నాయన్నమాట.
భారతదేశం దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన మూడంచెల అణు శక్తి కార్యక్రమం ఈ ఏడాది కీలకదశకు చేరనుంది. చెన్నై సమీపంలోని కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రంలోని ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పీఎఫ్‌బీఆర్) ఈ ఏడాది పని చేయడం మొదలుపెడు తుంది. ముందుగా ప్రయోగాత్మకంగా మొదలై... ఈ ఏడాది చివరి కల్లా పూర్తిస్థాయిలో పనిచేస్తుందని అంచనా. దేశంలో విస్తృతంగా లభ్యమయ్యే థోరియంను ఇంధనంగా ఉపయోగిస్తుందీ రియాక్టర్. విజయవంతమైతే దేశ ఇంధన భద్రత మరింత పటిష్ఠమవుతుంది.
దేశం మూడు దిక్కులా ఆవరించిన విశాల సముద్రాన్ని మానవ ప్రయోజనాలకు సద్వినియోగం చేసుకోవాలన్న భారతదేశ ఆశయం ఈ ఏడాది కార్యాచరణ దిశగా అడుగులు వేయనుంది. సముద్రయాన్‌లో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో నిర్మించిన ‘మత్స్య– 6000’ జలాంతర్గామి ముగ్గురు శాస్త్రవేత్తలను ఆరువేల మీటర్ల లోతు వరకూ తీసుకెళ్లనుంది. సముద్ర మట్టంతో పోలిస్తే 600 రెట్లు ఎక్కువ పీడనం ఉండే ఈ ప్రాంతాల్లో జలాంతర్గామి తొడుగులోని ప్రతి చదరపు సెంటీమీటర్ 600 కిలోల బరువును తట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే దీన్ని అత్యంత దృఢమైన ప్రత్యేకమైన టైటానియం మిశ్రమ లోహంతో తయారు చేశారు.
వాతావరణ అంచనాలు
అతి సంక్లిష్టమైన భారత దేశ వాతావరణ అంచనాల కోసం ఈ ఏడాది నుంచి కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్‌ల వినియోగం మొదలు కానుంది. ఏడాది చివరికల్లా ఇది సిద్ధమవుతుందని అంచనా. ‘మిహిర్’ వంటి సూపర్ కంప్యూటర్ల సాయంతో ఆరు కిలో మీటర్ల పరిధికి సంబంధించిన వాతావరణ అంచనాలను పది రోజుల ముందే ఇవ్వవచ్చునని భారత వాతావరణ విభాగం చెబుతోంది. వరదల్లాంటి విపత్తుల నుంచి మెరుగైన సన్నద్ధత కలిగి ఉండేందుకు, వ్యవసాయానికీ, పర్యాటక రంగానికీ ఎంతో ఉపయోగపడనుంది ఇది.
శిలాజ ఇంధన వినియోగాన్ని వేగంగా తగ్గించాలన్న లక్ష్యం వైపు భారత్ అడుగులేస్తోంది. ఇందుకు తగ్గట్టే సంప్రదాయేతర ఇంధన వనరుల సామర్థ్యంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. పవన విద్యుత్తులో నాలుగో స్థానంలో ఉంటే... సౌరశక్తి సామర్థ్యంలో మనది మూడో స్థానం. అయితే భారతదేశ స్థాపిత విద్యుదుత్పత్తి 482.82 గిగావాట్లలో ఇది సగం కంటే కొంచెం ఎక్కువ. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం మనం నాలుగేళ్ల ముందుగానే ఈ స్థాయికి చేరుకున్నాం. ‘ఒన్ సన్ ఒన్ వరల్డ్, ఒన్ గ్రిడ్’ కార్యక్రమం కారణంగా సౌరశక్తి రంగంలో మన పురోగతి ఇకపై కూడా కొనసాగనుంది.
కృత్రిమ మేధ
ఏఐ వాడకంతో ఈ ఏడాది టిక్కెట్ల బుకింగ్ మొదలుకొని వాహ నాల రవాణా వరకూ అనేక విషయాలు మరింత సౌకర్యవంతం కానున్నాయి. అతి తక్కువ బడ్జెట్‌తో చైనా సంస్థ అభివృద్ధి చేసిన ‘డీప్‌సీక్’ వంటివి ఏఐని మరింత వైవిధ్యభరిత అవసరాల కోసం వాడుకునే అవకాశం కల్పించనున్నాయి. స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ వినియోగం కూడా ఈ ఏడాది మొదలయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా... ఇంగ్లీషులో కాకుండా కొరియన్ భాషలోనూ ఏఐ అందుబాటులోకి రావచ్చు.
బయో టెక్నాలజీ
జన్యుపరమైన తప్పులను వెతకడం కంటే... వాటిని సరిచేయ డంపై ఇటీవలి కాలంలో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. మన డీఎన్‌ఏలో జరిగే అతి చిన్న మార్పు కూడా వ్యాధులకు కారణ మవుతుందన్నది తెలిసిందే. ఈ మార్పులను సరిచేసేందుకు ‘క్రిస్పర్–క్యాస్9’ వంటి ఆధునిక జన్యు ఎడిటింగ్ టూల్స్ అందు బాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ టెక్నాలజీలు ఒకే ఒక్క జన్యువులోని మార్పులను సరి చేసేందుకు ఉపయోగించవచ్చు.
అంతేకాదు క్రిస్పర్ టెక్నాలజీతో అననుకూల వాతావరణాలను కూడా తట్టుకుని పండే పంటలను అభివృద్ధి చేసేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టు కోవడంలో, ఆహార భద్రత కోసం ఇది ఎంతో కీలకం. ఇలా ఈ ఏడాది సైన్స్–టెక్సాలజీ రంగంలో అనేక కీలక పరిణామాలు చోటుచేసు కుని మానవ చరిత్రలో మైలురాళ్లు కానున్నాయి.
టి.వి.వెంకటేశ్వరన్
వ్యాసకర్త విజిటింగ్ ప్రొఫెసర్, ఐసర్ మొహాలీ


