కాలుష్యమే పెద్ద సవాల్‌! | Pollution poses a greater economic threat to India | Sakshi
Sakshi News home page

కాలుష్యమే పెద్ద సవాల్‌!

Jan 24 2026 5:08 AM | Updated on Jan 24 2026 5:08 AM

Pollution poses a greater economic threat to India

దావోస్‌ వేదికగా ఇండియాలో పొల్యూషన్‌పై మరోసారి చర్చ

భారత్‌లో తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తున్న గాలి కాలుష్యం  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన కార్యాచరణ చేపట్టాలి 

పకడ్బందీ నియంత్రణతోనే నగరాలు, పట్టణాలకు సుస్థిరత 

కాలుష్యంపై అభిప్రాయాలను వెల్లడించిన పర్యావరణ నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం జాతీయ స్థాయిలో, రాష్ట్రాల్లోనూ కాలుష్యమే అతిపెద్ద సవాల్‌గా పరిణమించింది. తాజాగా దావోస్‌లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) వేదికగానూ భారత్‌లో కాలుష్య వ్యాప్తి తీవ్ర చర్చనీయాంశమైంది. ఇండియాలో పీల్చే గాలి కాలుష్యభరితంగా మారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితులు ఏర్పడడంపై ఆందోళన సైతం వ్యక్తమైంది. ఇదిలా ఉంటే...ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆర్థికవేత్త వెలిబుచ్చిన అభిప్రాయాలను సీరియస్‌గా తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగిన కార్యాచరణను చేపట్టాల్సిన అవసరముందని పర్యావరణ వేత్తలు, నిపుణులు చెబుతున్నారు.

ఇండియాలో గాలి, నీరు, ఇతర రూపాల్లో వ్యాపిస్తున్న కాలుష్యాలను పకడ్బందీ నియంత్రణతోనే దేశంలోని నగరాలు, పట్టణాలు సుస్థిరమైనవిగా మారతాయని సూచిస్తున్నారు. భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలు మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణిస్తున్నందున... దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ అదే దుస్థితి తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. నగరాలు, పట్టణాలను అన్ని విధాలుగా సుస్థిరమైనవిగా మార్చే దిశలో ప్రణాళికలు రూపొందించాలని అంటున్నారు. ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలపై ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.  

కాలుష్యంతోనే భారత్‌కు ఆర్థిక భారం 
అమెరికా లేదా ఐరోపా దేశాలు పెద్ద మొత్తంలో విధించబోయే వాణిజ్య పరమైన సుంకాల కంటే కూడా కాలుష్యంతోనే భారత్‌కు అధిక ఆర్థిక భారంతో పాటు పెనుసవాళ్లను ఎదుర్కోబోతోంది. భారత్‌లో ఏడాదికి 17 లక్షల మంది కాలుష్యం కారణంగా చనిపోతున్నారు.విషపూరితమైన లేదా కాలుష్యభరితమైన వాయువుల ఉత్పాదకత, పెట్టుబడులపై శాశ్వత పన్నులుగా పనిచేస్తాయన్నారు. అందువల్ల భారత్‌ సురక్షితమైన, స్వచ్ఛమైన గాలిని ‘టాప్‌ నేషన్‌ మిషన్‌’చేయాలి. –గీతా గోపీనాథ్, ప్రముఖ ఆర్థికవేత్త.  

ఈపీఎ తీసుకురాకపోవడం బాధాకరం 
భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లోని నగరాలతో సహా, తెలంగాణలో హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాలకు ఢిల్లీ వంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండేలా వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం ఢిల్లీ నుంచి పాట్నా వరకు తలెత్తిన కాలుష్య పరిస్థితులు, దక్షిణాదికి మరీ ముఖ్యంగా తెలంగాణకు హైదరాబాద్‌కు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇటీవల హైదరాబాద్‌లోనూ గాలి నాణ్యతాస్థాయులు ప్రమాదకరంగా మారాయంటే పరిస్థితి తీవ్రత అర్థమౌతోంది. స్థానిక ప్రభుత్వాలకు (మున్సిపాలిటీలు, స్థానికసంస్థలు) రవాణా, వ్యర్థాల నిర్వహణ, కాలుష్యాలపై చర్య తీసుకునే అధికారం కూడా లేదు.

ఇన్ని ప్రభుత్వాలు మారినా ఎని్వరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ (ఈపీఏ)వంటివి ఇప్పటికీ తీసుకురాకపోవడం బాధాకరం. గాలి, నీరు వంటి ప్రకృతి జీవన వనరులు కాలుష్యం బారిన పడడాన్ని పౌరులు ఎక్కడికక్కడ గట్టిగా నిలదీయాల్సి ఉంది. ప్రస్తుతం అభివృద్ధి జరుగుతున్న తీరు వల్ల పర్యావరణ వ్యవస్థలపై పడుతున్న దు్రష్పభావాలపై ప్రజలు గొంతు ఎత్తాల్సిన అవసరముంది. సుస్థిర అభివృద్ధి (సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌)సాధన దిశలో అనేక అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వంటి నగరపాలక సంస్థలు సొంతంగా పనిచేసేలా అన్ని అధికారాలు కలి్పంచాలి. 
– ప్రొ.కె. పురుషోత్తం రెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త. 

మోడలింగ్‌ స్టడీస్‌ చేయాలి 
నగరాలు, పట్టణాలను సమతుల్యమైన, సుస్థిరమైన అభివృద్ధి పథంలో నడిపించడం సవాళ్లతో కూడుకున్నదిగా మారింది. రాబోయే రోజుల్లో నగరాల్లో భూ వినియోగం విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముంది. ప్రస్తుతం దేశంలోని ప్రతీ నగరం వాయు కాలుష్య ప్రమాద తీవ్రతను ఎదుర్కొంటోంది. విపరీతమైన నగరీకరణతో వేడిగాలులు కూడా పైకి వెళ్లే పరిస్థితులు లేకుండా పోయాయి. వాయు కాలుష్యం, నీరు తదితరాలపై పూర్తి స్థాయి మోడలింగ్‌ స్టడీస్‌ చేయాల్సిన అవసరం ఉంది.

పర్యావరణంపై పడే ప్రభావం గురించి ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అనాలిసిస్‌ జరగడం లేదు. భూవినియోగం సరైన పద్ధతుల్లో జరగపోవడం కూడా వాయుకాలుష్యం పెంపుదల, వ్యాప్తికి కారణమౌతోంది. పారిశ్రామిక ప్రాంతాల్లో ‘వ్యర్థాల నిర్వహణ’సరైన పద్ధతుల్లో జరగకపోవడం కూడా వాయు, నీటి కాలుష్యానికి దారితీస్తోంది. కాలుష్యాల నియంత్రణ, నాణ్యతా ప్రమాణాలను పాటించడంపై కఠినచర్యలు తీసుకుంటేనే పరిస్థితి అదుపులోకి వస్తుంది.  – బీవీ సుబ్బారావు, వాటర్‌ ఎక్స్‌పర్ట్, పర్యావరణ నిపుణుడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement