
చెప్పిన పనితోపాటు చెప్పని పనినీ బేషుగ్గా చేసిన జపనీస్ శాటిలైట్లు
శుక్రుని మేఘావృత విశేషాలను వెల్లడించిన హిమవరీ ఉపగ్రహాలు
అప్పగించిన పనిచేయకుండా ఆవారాగా తిరిగితే ఎవరైనా తిడతారు. కానీ చెప్పిన పని చేస్తూనే మరో కొత్త విషయాన్ని కనిపెట్టినందుకు ప్రశంసలను అందుకున్నాయి రెండు జపాన్ ఉపగ్రహాలు. భూవాతావరణ విశేషాలను రాబట్టేందుకు ప్రయోగించిన హిమవరీ–8, హిమవరి–9 కృత్రిమ ఉపగ్రహాలు చివరకు శుక్ర గ్రహ మేఘావృత ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలను వెల్లడించి ఇప్పుడు శెభాష్ అనిపించుకున్నాయి. శుక్రగ్రహం మీది వాతావరణ తరంగాల్లో మార్పులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇవి సేకరించాయి.
దశాబ్దకాల డేటా..
బిర్లాటెంపుల్ ముందు ఒక పేద్ద కుటుంబం ఒకరి తర్వాత ఒకరు ఫొటోలు దిగుతుందనుకుందాం. అప్పుడు సమీపంలో గుర్తు తెలియని పిల్లాడు ఉంటే అతను ఈ ఫొటోలన్నింటిలోనూ పడతాడు. అతని హావభావాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. అచ్చం అలాగే భూ స్థిర కక్ష్యలో తిరుగుతూ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి భూ వాతావరణ ఫొటోలు తీసేందుకు జపాన్ హిమవరి–8 ఉపగ్రహాన్ని 2014లో, హిమవరి–9 అనే ఉపగ్రహాన్ని 2016లో నింగిలోకి పంపింది. ఇవి 2015 నుంచి ఇప్పటిదాకా వేలాది ఫొటోలను తీశాయి. అయితే వీటిని గమనించగా అన్ని ఫొటోల్లోనూ ఒక మూలగా శుక్రుడు సైతం కనిపించాడు.
దీంతో ఈ పదేళ్లకాలంలో శుక్రుని వాతావరణ మార్పుల వివరాలను సేకరించేందుకు సువర్ణావకాశం లభించింది. ఇది సువర్ణావకాశం ఎందుకంటే భూమి నుంచి టెలిస్కోప్ ద్వారా శుక్రుడిని గమనించాలంటే భూవాతావరణం అంతగా అనుకూలించదు. పైగా అదే సమయంలో సూర్యుడి దేదీప్యమానమైన కాంతి ప్రభావం శుక్రునిపై ఉంటుంది. దాంతో భూమి నుంచి శుక్రుడిని గమనించడం కష్టం. ఇప్పటికే శుక్రుడి సంబంధింత వర్ణ తరంగధైర్ఘ్య సమాచారం సైతం పెద్దగా ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో అనుకోకుండా రెండు వాతావరణ ఉపగ్రహాల డేటాలో చిక్కిన శుక్రుని వివరాలు ఇప్పుడు ఆ గ్రహ వాతావరణంపై పరిశోధనకు అక్కరకొస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్
సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు
శుక్రునిపై మందపాటి కార్భన్‌డయాక్సైడ్ వాతావరణం పరుచుకుని ఉంటుంది. పైగా ఆకాశం సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలలతో కప్పబడి ఉంటుంది. గత పదేళ్లుగా హిమవరి 8, 9 ఉపగ్రహాలు పంపిన సమాచారాన్ని యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధకులు విశ్లేíÙంచారు. మల్టీస్పెక్ట్రల్ హిమవరి ఇమేజర్స్ సాయంతో రోజువారీగా, సంవత్సరాలవారీగా వాతావరణ మార్పులను సరిపోల్చిచూశారు. ‘‘గతంలో ఏ ఉపగ్రహాన్ని ఇలా పదేళ్లపాటు నిరాటంకంగా పరిశీలించలేదు. భూమి కోసం ఉద్దేశించిన ఉపగ్రహాలు అనుకోకుండా ఇలా శుక్రుని డేటాను ఒడిసిపట్టాయి. శుక్రుని వాతావరణంలో సూర్యకాంతి పరావర్తనం, గాలి వేగం, ఉష్ణోగ్రతల్లో మార్పుల వివరాలు తెల్సుకునేందుక ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతోంది.
ఉష్ణ తరంగాల్లో మార్పులనూ తెల్సుకోవచ్చు’’అని పరిశోధనలో కీలక రచయిత అయిన గక నిషయమ చెప్పారు. ‘‘విభిన్న తరంగధైర్యాలతో విస్తరించే పరారుణ కాంతిని ఒడిసిపట్టేందుకు హిమవరి శాటిలైట్లలోని సెన్సార్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. మరో నాలుగేళ్లపాటు ఇవి సేవలందిస్తాయి. 2030దాకా ఏ దేశం కూడా శుక్రుని వాతావరణ పరిశోధన కోసం ప్రత్యేక ప్రాజెక్ట్‌చేపట్లేదు. ఈ నేపథ్యంలో హిమవరి శాటిలైట్ల తదుపరి డేటా సైతం కీలకంగా మారనుంది’’అని నిషయమ చెప్పారు. పరిశోధకులు 437 భిన్న వాతావరణ పరిస్థితుల్లో శుక్రునిపై మేఘాల పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. శుక్రుడు, భూమి వేర్వేరు కోణాల్లో సమీపానికి వచి్చనప్పుడు శుక్రుని వాతావరణంలో జరిగే మార్పులను తెల్సుకునేందుకు ఇప్పుడు అవకాశం చిక్కింది. హిమవరి అంటే జపాన్ భాషలో పొద్దుతిరుగుడు పువ్వు అని అర్థం. నిరంతరంగా భూమిని పరిశీలిస్తూ భూ స్థిర కక్ష్యలో తిరుగుతాయని, అందుకు గుర్తుగా ఈ పేరు ఎంపికచేసినట్లు ఆనాడు జపాన్ ప్రకటించింది.