
2027 నాటికి రూ. 3,232 కోట్ల పెట్టుబడులు
భారత్, జపాన్‌లో రెట్టింపు
ఉత్పత్తి సామర్థ్యంపై దృష్టి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా విద్యుత్‌కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారత్, జపాన్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంపై తోషిబా ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 3,232 కోట్లు (55 బిలియన్ యెన్‌లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. దీనితో 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2030 నాటికి ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపవుతుందని సంస్థ వివరించింది. ప్రాథమిక అంచనాలకు మించి విద్యుత్‌కి డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్న నేపథ్యంలో జపాన్‌లోని హమాకవాసాకి కార్యకలాపాలపై, హైదరాబాద్‌లోని తోషిబా ట్రాన్స్‌మిషన్ అండ్ డి్రస్టిబ్యూషన్ సిస్టమ్స్ (ఇండియా)పై గణనీయంగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
‘గ్లోబల్‌గా విద్యుత్‌కి డిమాండ్ పెరుగుతుండటంతో సరఫరా పరికరాల (టీఅండ్‌డీ) లభ్యత మరింత కీలకంగా మారింది. ప్రస్తుత మౌలిక సదుపాయాలు పాతబడిపోతుండటం, పునరుత్పాదక విద్యుత్ పెరుగుతుండటం, కొత్త డేటా సెంటర్ల నిర్మాణం మొదలైన అంశాల దన్నుతో 2030 నాటికి జపాన్‌లో టీఅండ్‌డీ పరికరాలకు డిమాండ్ భారీగా పెరగనుంది. అలాగే, భారత్‌లో కూడా పట్టణ ప్రాంత జనాభా, పునరుత్పాదక విద్యుత్ వినియోగం వేగంగా పెరుగుతుండటంతో విద్యుత్‌కి డిమాండ్ గణనీయంగా పెరగనుంది‘ అని తోషిబా వైస్ ప్రెసిడెంట్ హిరోషి కనెటా తెలిపారు. ఈ నేపథ్యంలో హై–వోల్టేజ్ టీఅండ్‌డీ పరికరాల సరఫరాను పెంచే దిశగా, తాము ప్రస్తుత ప్లాంట్లను ఆధునీకరించుకుంటూ, కొత్త ప్లాంట్లను నిర్మిస్తూ, ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటున్నట్లు వివరించారు.