
వయసు వంద దాటాక కుర్చీలో కూర్చోవడం బోరుగా అనిపించిందట! జపాన్‌కు చెందిన కోకిచీ అకుజావాకు. దీంతో, వెంటనే హైకింగ్ స్టిక్ పట్టుకుని, మొత్తం ఫ్యామిలీతో ట్రెక్కింగ్ పార్టీ స్టార్ట్ చేసి, రికార్డు సృష్టించాడు.
నిజానికి వందేళ్ల వయసు వరకు బతికి ఉండటమే గగనం అనుకుంటే, అప్పటికీ సజీవంగా ఉండేవారిలో చాలామంది కుర్చీలో కూర్చుని టీవీ రిమోట్ కంట్రోల్ పట్టుకోవడం తప్ప వేరేమీ చేయలేరు. కాని, 102 ఏళ్ల వయసు నిండిన ఈ బాబాయి మాత్రం రిమోట్‌కి బదులు హైకింగ్ స్టిక్ పట్టుకుని నేరుగా 12,000 అడుగుల ఫుజీ శిఖరాన్ని అధిరోహించాడు. అంతే కాదు, తన 70 ఏళ్ల కూతుర్ని కూడా ‘హే, లెట్స్ గో!’ అంటూ వెంట తీసుకెళ్లాడు.
అలా మొత్తం ఫ్యామిలీతో కలిసి ఒక పెద్ద పిక్నిక్‌లా ట్రెక్కింగ్ పూర్తి చేశారు. మధ్యలో కొంచెం అలసటగా అనిపించినా, స్నేహితులు, కూతురు, మనవరాలు ఇచ్చిన మోటివేషన్ ఆయనను మళ్లీ కదిలించింది. మొత్తం రెండు రాత్రులు పర్వత మార్గంలో టెంట్ వేసి గడిపి, చివరికి శిఖరాన్ని చేరి, ఆ అపురూప క్షణాలను ఫేస్‌బుక్ లైవ్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విజయంతో, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా వెంటనే సర్టిఫికెట్ ఇచ్చేసింది.
ఇదేం.. మొదటి రికార్డ్ కాదు.
నిజానికి, అకుజావా 96 ఏళ్ల వయసులోనూ ఇదే పర్వతాన్ని అధిరోహించాడు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా కొంచెం విరామం తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ నూటారెండేళ్ల వయసులో ఫుజీ వైపు అడుగులు వేశాడు.
‘పర్వతం ముందు అందరూ సమానులే. ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళడమే అసలు ఆ గేమ్’ అంటాడాయన. ప్రస్తుతం ఆయన ఒక వృద్ధాశ్రమంలో వాలంటీర్‌గా గడుపుతూ, ఇంట్లో పెయింటింగ్స్ వేస్తూ, ఫ్యామిలీకి కొత్త కొత్త ఆర్ట్ రిక్వెస్టులు నెరవేర్చుతూ బిజీగా ఉంటున్నాడు.
(చదవండి: ఎలాన్ మస్క్ 'బేకరీ'.. కానీ ఇక్కడ కేక్‌లు, పేస్ట్రీలు ఉండవు..)