టోక్యో: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. శనివారం ఉదయం సంభవించిన భారీ భూకంపం ఆ దేశవ్యాప్తంగా భయాందోళనకు కారణమైంది. రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం తూర్పు తీర ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. జపాన్ వాతావరణ శాఖ (JMA) ప్రకారం, భూకంప కేంద్రం హోక్కైడో ప్రాంతానికి సమీపంలో సముద్ర మట్టానికి దిగువన నమోదైంది.
భూకంపం అనంతరం జపాన్ వాతావరణ శాఖ తూర్పు తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికను జారీ చేసింది. ప్రజలను తక్షణమే లతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
భూకంపం ప్రభావంతో హోక్కైడో, టోహోకు, మియాగి వంటి ప్రాంతాల్లో భవనాలు కంపించాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయినట్లు సమాచారం. ఇప్పటివరకు ప్రాణ నష్టం, ఆస్తినష్టంపై అధికార సమాచారం లేదు. అయితే, పలు రైలు సేవలు నిలిచిపోయాయి. విమానయాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భూకంపం తీవ్రతతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బందిని రంగంలోకి దించింది. ప్రజలకు అవసరమైన సహాయం అందించింది.
జపాన్ వాతావరణ శాఖ ప్రకారం.. సముద్ర మట్టానికి దగ్గరగా భూకంప కేంద్రం ఉండటంతో సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో 1 మీటరు వరకు అలలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. ఈ భూకంపంపై యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) కూడా స్పందించింది. భూకంప తీవ్రతను ధృవీకరించిన యూఎస్‌జీఎస్, భవిష్యత్తులో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది.
ఈ ఘటనపై మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని కోరుతున్నారు. జపాన్ వంటి భూకంప ప్రభావిత దేశాల్లో ఇటువంటి ప్రకృతి విపత్తులకు ముందస్తు చర్యలు తీసుకోవడం సాధారణమే అయినా, ఈ స్థాయి తీవ్రతతో వచ్చిన భూకంపం ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది.


