
మహిళల్లో గుండెపోటు అవకాశాలు ఎక్కువ
రక్తపోటు కూడా పెరుగుతున్నట్టు వెల్లడి
ఊపిరితిత్తులు, నాడీ వ్యవస్థపైనా ప్రభావం
‘శక్తిమంతమైన సౌర తుపాను భూమిని తాకింది.. ఫలితంగా భూ అయస్కాంత క్షేత్రంలో తీవ్ర అవరోధాలు ఏర్పడ్డాయి. దీనివల్ల శాటి లైట్లు, పవర్‌గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ప్రభా వితం అయ్యే అవకాశం ఉంది’ ఇలాంటి వార్తలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వింటున్నాం.
ఔను, నిజమే. సూర్యుడి నుంచి ఉత్పన్న మయ్యే సౌర తుపాన్లు అంత ప్రభావవంతమైనవే, ప్రమాదకరమైనవే. అది ఆయా వ్యవస్థలనేకాదు.. మానవుల ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. తాజా అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. సౌర తుపాన్ల వంటి వాటివల్ల ప్రభావితమయ్యే భూ అయస్కాంత క్షేత్రం.. మనుషుల్లో గుండెపోటుకు కారణమవుతోందట.
బ్రెజిల్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఐఎన్‌పీఈ), యూనివ ర్సిటీ ఆఫ్ సావో పాలో సంయుక్తంగా ఒక అధ్యయనం నిర్వ హించాయి. గుండెపోటు సమస్య ఉన్న 1,340 మంది.. ఇందులో 871 మంది పురుషులు, 469 మంది స్త్రీల ఆసుపత్రి వివరాలను పరిశీలించారు. భూ అయస్కాంత క్షేత్రం తీవ్రతను... సాధారణం, ఒక మోస్తరు, తీవ్రస్థాయి అనే 3 రకాలుగా విభజించారు. పేషంట్లను కూడా వయసుల వారీగా.. 30 అంతకంటే తక్కువ వయసున్నవారు, 31–60 ఏళ్లవారు, 60 ఏళ్లకు పైబడినవారు.. ఇలా మూడు వర్గాలుగా విభజించారు.
మూడు రెట్లు ఎక్కువ..
సౌర తుపాను వల్ల భూ అయస్కాంత క్షేత్రంలో వచ్చిన మార్పులు గుండెపోటును ప్రభావితం చేశాయని అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా సౌర తుపాను సమయంలో గుండెపోటు అవకాశాలు మహిళల్లో ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. భూ అయస్కాంత క్షేత్రం తీవ్రత ‘సాధారణం’తో పోలిస్తే ‘తీవ్రస్థాయి’లో ఉన్నప్పుడు గుండెపోట్లు మూడు రెట్లు ఎక్కువగా వచ్చాయట.
రక్తపోటు పెరుగుతోంది..: పరిశోధనలో భాగంగా మధ్యస్థాయి అయస్కాంతావరణం ఉండే చైనాలోని రెండు నగరాలను ఎంచుకున్నారు. అక్కడి 5 లక్షలకుపైగా ప్రజల రక్తపోటు స్థాయిల రికార్డులను సౌరతుపాన్ల కాలంతో పోల్చిచూశారు. జీఎంఏలో మార్పులకు తగ్గట్లు అక్కడి ప్రజల బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా బీపీలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయట. ఇప్పటికే రక్తపోటుతో బాధపడుతున్న వారికి సౌర తుపాను వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఊపిరితిత్తులు.. నాడీ వ్యవస్థ..: 2022లో సైన్స్ డైరెక్ట్‌లో ప్రచురితమైన మరో అధ్యయనంలో.. సౌర తుపాన్ల వల్ల భూ అయస్కాంత ఆవరణలో వచ్చే మార్పులు ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేస్తాయని తేలింది. ఆ సమయంలో ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అలాగే ఆ సమయంలో నాడీ వ్యవస్థ పనితీరు కూడా ప్రభావితమైందట.
సూర్య – ఏఐ..: సౌర తుపాన్లను, వాటి తీవ్రతను అంచనా వేయ డానికి అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా, ఐబీఎమ్ కంపెనీ సహకారంతో సూర్య అనే ఏఐ వ్యవస్థను రూపొందించింది. శాటిలైట్లు, పవర్‌గ్రిడ్లు, కమ్యూ నికేషన్ వ్యవస్థలకు ప్రమాదకరమైన సౌర తుపాన్లు వచ్చినప్పుడు ఇది అప్రమత్తం చేస్తుంది.
5 లక్షల మందిపై..
సౌరతుపాన్ల కారణంగా భూమి మీదకు దూసుకొచ్చే వేడి గాలులు భూ అయస్కాంత ఆవరణాన్ని ప్రభావితం చేసి.. మన రక్తపోటు పెంచుతాయని చైనాలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఆరు సంవత్సరాలపాటు చైనాలోని 5,00,000 మంది ప్రజల రక్తపోటు స్థాయిలను పర్యవేక్షించి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. సౌరతుపాన్ల వల్ల భూ అయాస్కాంతావరణంలో (జీఎంఏ) సంభవించే మార్పులు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయనే దానిపై అధ్యయనం సాగింది.
–సాక్షి, స్పెషల్ డెస్క్