జైసల్మేర్: రాజస్థాన్ సరిహద్దు జిల్లా జైసల్మేర్‌లో పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ తరపున పనిచేస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. జనవరి 25 అర్థరాత్రి సమయంలో నెహదాన్ గ్రామంలోని నిందితుడి నివాసానికి చేరుకున్న భద్రతా బృందం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
అదుపులోకి తీసుకున్న వ్యక్తిని జబరరామ్ మేఘవాల్‌గా అధికారులు గుర్తించారు. నిందితుడు గత నాలుగేళ్లుగా సరిహద్దు ప్రాంతంలో ‘ఈ-మిత్ర’ (ఆన్‌లైన్ సర్వీస్) కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ ముసుగులో అతను పాకిస్తాన్‌కు చెందిన ఒక మహిళా హ్యాండ్లర్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. అతనికి వ్యాపార రీత్యా ప్రభుత్వ పథకాలు, కీలక పత్రాలకు సంబంధించిన వివరాలు ఉండటంతో, అతను ఈ సమాచారాన్ని పొరుగు దేశానికి చేరవేసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
సీఐడీ (ఇంటెలిజెన్స్) బృందాలు మేఘవాల్‌ను తదుపరి విచారణ కోసం జైపూర్‌కు తరలించాయి. నిందితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్, కంప్యూటర్ సిస్టమ్‌లను అధికారులు స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. మేఘవాల్ గత నాలుగేళ్లుగా ఆ గ్రామంలో ‘ఈ-మిత్ర’ కేంద్రం నడుపుతున్నాడని, ఈ నేపధ్యంలో ఏయే డేటాను విదేశీ శక్తులకు చేరవేశాడనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
సోషల్ మీడియా సాయంతో పాక్ హ్యాండ్లర్‌తో పరిచయం ఏర్పడిన నిందితుడు ‘హనీట్రాప్’కు గురై ఉండవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. మేఘవాల్ కేవలం డబ్బు కోసమే ఈ పనిచేశాడా లేక ఎవరి ఒత్తిడికైనా లొంగి గూఢచర్యానికి పాల్పడ్డాడా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా ఈ ఉదంతంపై భద్రతా సంస్థల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: ‘పాక్’ కట్టుకథలపై ‘సమితి’లో ఉరిమిన భారత్


