న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ రాయబారి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ చేసిన తప్పుడు వ్యాఖ్యలపై భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఏడాది జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’పై పాక్ ప్రతినిధి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భారతదేశాన్ని, భారత ప్రజలను దెబ్బతీయడమే ఏకైక లక్ష్యంగా పాకిస్తాన్ పనిచేస్తోందని, అంతర్జాతీయ వేదికలపై స్వార్థపూరిత కథనాలను అల్లుతోందని హరీష్ పేర్కొన్నారు.
భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు ఇస్లామాబాద్‌కు లేదని పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు. 2025, మే 7న భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యాన్ని హరీష్ వివరిస్తూ.. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది పౌరుల మృతికి కారణమైన ఉగ్రదాడికి సమాధానంగానే ఈ చర్య తీసుకున్నట్లు హరీష్ గుర్తుచేశారు. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి, సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
#WATCH | Permanent Representative of India to the United Nations, Parvathaneni Harish, says, "I now respond to the comments of the representative of Pakistan, an elected member of the Security Council, which has a single-point agenda to harm my country and my people. He has… pic.twitter.com/I8pX4tt1zl
— ANI (@ANI) January 27, 2026
అనంతరం భారత సైనిక శక్తికి భయపడి మే 10న నేరుగా పాకిస్తాన్.. భారత్‌కు ఫోన్ చేసి, యుద్ధాన్ని ఆపాలని వేడుకుందని హరీష్ తెలిపారు. సింధు జలాల ఒప్పందం గురించి ఆయన మాట్లాడుతూ 65 ఏళ్ల క్రితం భారత్ ఈ ఒప్పందాన్ని సద్భావనతో కుదుర్చుకుందని, అయితే పాకిస్తాన్.. మూడు యుద్ధాలతో పాటు, లెక్కలేనన్ని ఉగ్రదాడులతో ఆ స్ఫూర్తిని తుంగలో తొక్కిందని హరీష్ విమర్శించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా వేలమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ తన తీరు మార్చుకునే వరకు సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత్ నిర్ణయించిందని ఆయన తెలిపారు.
ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన గురించి మాట్లాడే ముందు పాకిస్తాన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని భారత రాయబారి చురకలంటించారు. పాక్ సైన్యం రాజ్యాంగ విరుద్ధంగా 27వ సవరణ ద్వారా ఎలా తిరుగుబాటు చేసిందో, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు జీవితకాల రక్షణ ఎలా కల్పించిందో గుర్తెరగాలని హరీష్ అన్నారు. జమ్ము కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని పునరుద్ఘాటిస్తూ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితిని వేదికగా వాడుకోవద్దని ఆయన పాకిస్తాన్‌ను హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: కొండపై ‘మ్యాగీ’ అమ్మితే.. ఇంత భారీ లాభమా?


