ఉత్తర భారత దేశంలోని ప్రజలు చలికాలపు రోజుల్లో వేడి వేడి మ్యాగీని ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇదే సమయంలో అక్కడికి వెళ్లే పర్యాటకులు కూడా రకరకాల మ్యాగీలను ఆరగిస్తుంటారు. ఇక ట్రెక్కింగ్ చేసేవారికి మ్యాగీ తప్పనిసరి ఆహారం. మన దేశంలో పర్వత ప్రాంతాల్లో రోడ్డు పక్కన ఉండే దాబాల్లో మ్యాగీ అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారంగా మారిపోయిందనడంలో ఆశ్చర్యం లేదు. తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో సులభంగా తయారు చేయగలగడమే దీనికి గల ప్రధాన కారణం.
తాజాగా రెండు నిముషాల్లో తయారయ్యే ఈ మ్యాగీ వ్యాపారంతో ఎంత ఆదాయం వస్తుందనే దానిపై కంటెంట్ క్రియేటర్ బాదల్ ఠాకూర్ ఇటీవల ఒక వీడియోను రూపొందించి, సోషల్ మీడియాలో దీనిపై మరింత ఆసక్తిని రేకెత్తించారు. బాదల్ ఠాకూర్ ఒక పర్వత ప్రాంతంలోని ఒక ప్రదేశంలో ఒక చిన్న టేబుల్ పెట్టుకుని, ఒక ఎల్పీజీ సిలిండర్‌తో తాత్కాలిక మ్యాగీ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. అక్కడకు వస్తున్న పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో బాదల్ ఠాకూర్ వ్యాపారం ఊపందుకుంది. సాధారణ మ్యాగీ ప్లేట్‌ను రూ.70 కి, చీజ్ మ్యాగీని రూ100కి ఆయన విక్రయించారు. కేవలం ఐదు గంటల వ్యవధిలో 200 ప్లేట్లు అమ్ముడయ్యాయి. రోజంతా సుమారు 300 నుండి 350 ప్లేట్ల వరకు విక్రయాలు జరిగాయి. దీని ద్వారా రోజుకు సుమారు రూ. 21,000 వరకు ఆదాయం లభించిందని బాదల్ ఠాకూర్ వెల్లడించారు.
ఖర్చులు పోను.. లాభమెంతంటే..
రోజుకు రూ. 21,000 ఆదాయం వచ్చినప్పటికీ, ఇందులో ముడిసరుకు ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో 75 గ్రాముల మ్యాగీ ప్యాకెట్ ధర రూ. 15 ఉండగా, గ్యాస్ సిలిండర్, డిస్పోజబుల్ ప్లేట్ల ఖర్చులు పోను నికర లాభం బాగానే ఉంటుంది. కాగా ఒక రోజులో ఇంత పెద్ద మొత్తంలో నగదు బాదల్ ఠాకూర్ చేతికి అందడం చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒకవేళ ఇదే స్థాయిలో నెలంతా వ్యాపారం సాగితే, నెలకు సుమారు రూ. ఆరు లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని సామాజిక మాధ్యమాల్లో లెక్కలు వేస్తూ చర్చిస్తున్నారు.
బాదల్ ఠాకూర్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆదాయ వివరాలను చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ‘నేను కూడా నా ఉద్యోగం మానేసి మ్యాగీ అమ్మడం మొదలు పెడతాను’ అని కొందరు అంటుండగా, మరికొందరు ఇప్పటికే తాము ఇటువంటి వ్యాపారంలోకి దిగామని కామెంట్స్ చేస్తున్నారు. పర్వత ప్రాంతాల్లో మ్యాగీకి ఉన్న క్రేజ్ మరోసారి నిరూపితమయ్యిదని పలువురు అంటున్నారు.
ఇది కూడా చదవండి: రెగ్యులర్‌గా కాఫీ... వయసు పెరిగిపోతుంది జాగ్రత్త!


