‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్‌ సేఫ్టీ’ నియామకం తప్పనిసరి | Key Directives from DGCA regarding Chief of Flight Safety | Sakshi
Sakshi News home page

‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్‌ సేఫ్టీ’ నియామకం తప్పనిసరి

Jan 21 2026 11:11 AM | Updated on Jan 21 2026 11:18 AM

Key Directives from DGCA regarding Chief of Flight Safety

దేశీయ విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరిచే దిశగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణాల్లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక లోపాలు, పునరావృతమవుతున్న భద్రతా పరమైన ఇబ్బందులను అరికట్టేందుకు అన్ని ఎయిర్‌లైన్ ఆపరేటర్లు ఇకపై తప్పనిసరిగా ‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ’ని నియమించాలని ఆదేశించింది.

ప్రత్యేక భద్రతా విభాగం ఏర్పాటు

ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం (రియాక్టివ్) కంటే, అవి జరగకముందే నివారించే (ప్రోఆక్టివ్) వ్యూహాన్ని అనుసరించాలని డీజీసీఏ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా నిపుణులైన సిబ్బందితో కూడిన ప్రత్యేక ‘విమాన భద్రతా విభాగం’ను ప్రతి ఆపరేటర్ ఏర్పాటు చేయాలని చెప్పింది. ప్రమాదాల నివారణ కార్యక్రమాలను ఈ విభాగం నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.

కీలక బాధ్యతల్లో నిపుణులు

భద్రతా పర్యవేక్షణ కోసం డీజీసీఏ ఒక నిబంధనను విధించింది. దీని ప్రకారం ‘డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ’ నియామకం కూడా తప్పనిసరి చేసింది. ఒకవేళ చీఫ్ హోదాలో ఉన్న వ్యక్తి పైలట్ అయితే డిప్యూటీ చీఫ్ హోదాలో తప్పనిసరిగా ఇంజినీర్ ఉండాలని తెలిపింది. ఒకవేళ చీఫ్ స్థానంలో ఇంజినీర్ ఉంటే, డిప్యూటీ చీఫ్ హోదాలో పైలట్ ఉండాలని పేర్కొంది. ఈ విధానం వల్ల విమాన నిర్వహణ (Maintenance), ఆపరేషన్స్ (Operations) మధ్య సమన్వయం పెరుగుతుందని డీజీసీఏ భావిస్తోంది.

లోపాలపై ఆందోళన

విమాన ప్రమాదాలపై జరుగుతున్న పరిశోధనల్లో ప్రతిసారీ కొన్ని లోపాలు (Systemic flaws) బయటపడుతున్నాయని డీజీసీఏ ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం వల్ల శాశ్వత పరిష్కారం లభించదని, సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (SMS)ను పటిష్టం చేయడం ద్వారానే అత్యున్నత భద్రత సాధ్యమని పేర్కొంది. ఈ కొత్త ఆదేశాలు కేవలం ప్యాసింజర్ విమానాలకే పరిమితం కాకుండా కింది విభాగాలన్నింటికీ వర్తిస్తాయని తేల్చి చెప్పింది.

1. షెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసులు.

2. కార్గో (సరుకు రవాణా) సర్వీసులు.

3. నాన్-షెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు.

సిబ్బంది సంక్షేమం - భద్రతా ఆడిట్లు

విమానయానంలో మానవ తప్పిదాలను తగ్గించేందుకు సిబ్బంది అలసట (Fatigue)పై దృష్టి సారించాలని డీజీసీఏ ఆదేశించింది. పైలట్లు, ఇతర సిబ్బంది విమాన ప్రయాణ సమయాలు మించకుండా చూడాలని స్పష్టం చేసింది. గ్రౌండ్ సపోర్ట్, నిర్వహణ విభాగాల్లో ఎప్పటికప్పుడు అంతర్గత భద్రతా ఆడిట్లు నిర్వహించి నివేదికలు సిద్ధం చేయాలని సూచించింది.

ఇదీ చదవండి: ఒకేరోజు ఊహించనంత పెరిగిన ధరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement