దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి రానున్న కాలానికి ఆశావాదాన్ని సూచిస్తోందని ఆర్‌బీఐ బులెటిన్ పేర్కొంది. పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధానపరమైన అనిశ్చితులు నెలకొన్నప్పటికీ.. ఇక ముందూ భారత్ వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని తెలిపింది.
‘‘భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య 2026 సంవత్సరం ఆరంభమైంది. వెనెజువెలాలో యూఎస్ జోక్యం చేసుకోవడం, మధ్య ప్రాచ్యంలో ఘర్షణలు పెరగడం, రష్యా–ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై అస్పష్టత నెలకొనడం, గ్రీన్‌లాండ్‌పై వివాదం ఇవన్నీ భౌగోళిక ఆర్థిక సమస్యలను, విధానపరమైన అనిశ్చితిని పెంచేవే. ఇలాంటి తరుణంలో ఆర్థిక మూలాలు బలంగా ఉండడం రానున్న కాలానికి ఆశావాదాన్ని సూచిస్తున్నాయి. 2025–26 సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలు ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని సూచిస్తున్నాయి’’అని పేర్కొంది. అనిశ్చితుల మధ్య కూడా అంతర్జాతీయ వృద్ధి 2025లో స్థిరంగానే ఉన్నట్టు తెలిపింది.
డిమాండ్ బలంగా..
డిసెంబర్ నెలకు సంబంధించి ముఖ్యమైన సూచికలు డిమాండ్ బలంగా ఉన్నట్టు సూచిస్తున్నాయని, ఇది వృద్ధికి ప్రేరణనిస్తుందని ఆర్‌బీఐ బులెటిన్ పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో కొంత పెరిగినప్పటికీ, ఆర్‌బీఐ కనిష్ట లక్ష్యానికి దిగువనే ఉన్నట్టు గుర్తు చేసింది. వాణిజ్య రంగానికి బ్యాంక్‌లు, బ్యాంకింగేతర మార్గాల (కార్పొరేట్ బాండ్లు, ఎఫ్‌డీఐ తదితర) ద్వారా గడిచిన ఏడాది కాలంలో రుణ వితరణ పెరిగినట్టు తెలిపింది. ఏడాది క్రితం ఉన్న రూ.21.3 లక్షల కోట్ల నుంచి రూ.30.8 లక్షల కోట్లకు చేరినట్టు పేర్కొంది.
ఎగుమతుల వైవిధ్యానికి, బలోపేతానికి గాను భారత్ గణనీయమైన కృషి చేసినట్టు పేర్కొంది. ప్రస్తుతం పలు దేశాలు, సమాఖ్యలతో (మొత్తం 50 దేశాలకు ప్రాతినిధ్యం వహించే) వాణిజ్య చర్చలు కొనసాగిస్తోందని గుర్తు చేసింది. న్యూజిలాండ్, ఒమన్‌తో చర్చలు ముగిసిపోగా, ఐరోపా సమాఖ్యతోనూ త్వరలో ముగింపునకు రానుండడం గమనార్హం. 2025లో జీఎస్‌టీ శ్లాబులను క్రమబద్దీకరించడం, ఆదాయపన్ను మినహాయింపులు, కార్మిక చట్టాల్లో మార్పులు వంటివి వృద్ధి అవకాశాలను బలోపేతం చేస్తాయని ఆర్‌బీఐ బులెటిన్ అభిప్రాయపడింది.
రూపాయి క్షీణతకు ఎన్నో కారణాలు..
ఇక నుంచి ఆవిష్కరణలు – స్థిరత్వం, వినియోగదారుల రక్షణ మధ్య సమతుల్యంపై విధాపరమైన దృష్టి ఉండాలని ఆర్‌బీఐ బులెటిన్ సూచించింది. నియంత్రణలు, పర్యవేక్షణ పట్ల వివేకవంతమైన విధానం ఉత్పాదకత పెంపునకు, దీర్ఘకాల ఆర్థిక వృద్ధికి సాయపడుతుందని పేర్కొంది. తన ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల కంటే భారత్‌లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం డిసెంబర్‌లో రూపాయి విలువ క్షీణతకు దారితీసినట్టు వివరించింది.
అలాగే, భారత్–యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొనడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం కూడా రూపాయి క్షీణతకు కారణమైనట్టు తెలిపింది. రూపాయిలో ఆటుపోట్లన్నవి.. ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చితే తక్కువే ఉన్నట్టు పేర్కొంది. 2025 ఏప్రిల్–నవంబర్ మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని ఎఫ్‌డీఐ కంటే అధికంగా ఉన్నట్టు వెల్లడించింది. నవంబర్‌లో నికర ఎఫ్‌డీఐ వరుసగా మూడో నెలలోనూ ప్రతికూలంగా ఉందని, స్వదేశాలకు పెద్ద మొత్తంలో నిధులు వెళ్లడమే కారణమని తెలిపింది.


