ఓ ప్రఖ్యాత కవి అంటారు... ‘‘ఇచ్చుటలో ఉన్న హాయీ వేరెచ్చటనూ లేనే లేదనీ’’!. అంటే మీరు ఇలా ఇవ్వడం మొదలుపెట్టగానే దాన్ని కొనసాగించడం కోసమైనా ప్రకృతి మీకూ ఇవ్వడం ప్రారంభిస్తుంది. దాంతో మీకు ఇచ్చే సామర్థ్యం ఎప్పుడూ ఉండనే ఉంటుంది.
మహిళ విషయంలో కూడా ఎప్పుడూ ఇంతే. ‘మీ ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ ప్రతిసారీ ఆమె తన తల్లిదండ్రులకో, భర్తకో, పిల్లలకో, కుటుంబసభ్యులకో చెబుతూనే ఉంటుంది. ఇక భర్త విషయంలోనైతే ‘మీ యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోండి’ అంటూ పోరుతూ ఉంటుంది. వాళ్ల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం... వాళ్లు వేళకు మందులు తీసుకుంటున్నారా అంటూ చెక్ చేస్తూ ఉంటుంది.
ఇక హాస్పిటల్ విషయానికి వస్తే... ఆ పని చేసేది కూడా ‘నర్స్’ రూపంలోని మహిళే. ఇక లేడీ డాక్టర్, లేడీ టెక్నీషియన్ రూపంలో మరిన్ని సేవలు అందిస్తూనే ఉంటుంది. భారతీయ ఆరోగ్య
సంరక్షణ వ్యవస్థలో మహిళ ఎప్పుడూ ఓ భాగమే. కాని, ఇంతటి కీలకమైన ఆ మహిళ తన ఆరోగ్యం విషయానికి వచ్చేప్పటికీ ‘ఆ... రేపు చూసుకుందాం లే’ అనుకుంటుంది. తన ఆరోగ్య సంరక్షణను ఎప్పుడూ వాయిదా వేసుకుంటూ ఉంటుంది. దీనికి చెల్లించాల్సిన మూల్యం ఒక్కోసారి గణనీయంగానే ఉండవచ్చు.
ప్రస్తుతం మన దేశంలో జీవనశైలి జబ్బులైన ‘నాన్ కమ్యూనికబుల్’ వ్యాధులు దాదాపు 65 శాతం మరణాలకు కారణమవుతున్నాయి. వీటిల్లోనూ ప్రతి నాలుగు మరణాల్లో ఒకదానికి గుండెజబ్బులే కారణంగా మారుతున్నాయి. ఇక క్యాన్సర్ విషయానికి వస్తే ప్రతి ఏటా 1,70,000 కొత్త కేసులు జాబితాకు జతవుతున్నాయి. సర్వైకల్ క్యాన్సర్ ఏటా వేలాది మహిళల ప్రాణాలను బలి తీసుకుంటోంది.
సమయానికి చిన్న స్క్రీనింగ్ పరీక్ష చేయిస్తే, ఆ మరణాలను దాదాపుగా పూర్తిగా నివారించడం సాధ్యం. ఇక దేశంలోని మొత్తం మహిళల్లో సగం మందికి రక్తహీనత ఉంది. అది వారిని నిస్సత్తువగా, నీరసంగా మార్చేస్తోంది. దీర్ఘకాలంలో వాళ్ల వ్యాధినిరోధకతను బలహీనంగా మార్చేస్తోంది. మహిళల్లో రొమ్ముక్యాన్సర్ కేసులు గంటగంటకూ డజన్ల సంఖ్యలో పెరుగుతున్నాయి. దురదృష్టం ఏమిటంటే... వీటిల్లో చాలా వాటి నివారణ పూర్తిగా సాధ్యం. టైముకు కనుక్కుంటే మరికొన్నింటికి పూర్తి చికిత్సగాని, లేదా మేనేజ్‌మెంట్‌గాని సాధ్యమే.
అయినప్పటికీ మహిళలు తమ ఇంటిపనుల్లో, కుటుంబాన్ని చూసుకునే పనుల్లో పడిపోయి తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. ముందునుంచే నివారించుకోవడం గాని, లేదా ముందే కనుగొనడంగాని చేస్తే, మహిళల ముప్పయిలు లేదా నలభైల వయసులోనే మహిళల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. కుటుంబం మొత్తం ఆరోగ్యాన్ని చూసుకునే అత్యంత విలువైన మహిళల ఆరోగ్యాన్ని సమర్థంగా కాపాడవచ్చు.
ఇక ఇప్పుడు అందివచ్చిన కృత్రిమ మేధ (ఏఐ) సహాయంతో ఇంకాస్త కచ్చితంగా మహిళల ఆరోగ్యాన్ని అంచనావేసి, రానున్న ముప్పును తప్పించవచ్చు. అందుకే ఆమె కోసం సగౌరవంగా వైద్యపరీక్షల స్లాట్ బుక్ చేసి హైబీపీ, చక్కెర, కొలెస్ట్రాల్ పరీక్షల వంటివి చేయించాలి. లేదంటే మహిళల ఆరోగ్యం చెడిపోయే ముప్పు నిశ్శబ్దంగా పెరుగుతూనే ఉంటుంది.
ఈ ఏడాది మహిళా దినోత్సవ థీమ్ ఏమిటంటే... ‘గివ్ టు గెయిన్’! మహిళ తన కుటుంబానికీ, ఈ సమాజానికీ ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. అందుకే ఈ నేపథ్యంలో ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ద్వారా ఆమెకు దక్కాల్సింది దక్కేలా చేయడమే ఇప్పుడు మనముందూ సమాజం ముందూ ఉన్న బాధ్యత. అప్పుడే మన భారత్‌లోని కుటుంబాల్లో ఆరోగ్యం నిండుతుంది. కార్యాలయాల్లో ఉత్పాదకత పెరుగుతుంది. దేశం ముందుకు పురోగమిస్తుంది.
మహిళలు తమ ఇంటిపనుల్లో, కుటుంబాన్ని చూసుకునే పనుల్లో పడిపోయి తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. ముందునుంచే నివారించుకోవడం గాని, లేదా ముందే కనుగొనడంగాని చేస్తే... మహిళల ముప్పయిలు లేదా నలభైల వయసులోనే మహిళల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. కుటుంబం మొత్తం ఆరోగ్యాన్ని చూసుకునే అత్యంత విలువైన మహిళల ఆరోగ్యాన్ని సమర్థంగా కాపాడవచ్చు.
డాక్టర్ సంగీతారెడ్డి
జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్స్
యాసీన్
(చదవండి: ఆత్మవిశ్వాసమే అసలు బలం)


