నారా వారి నిర్వాకానికి 'నారీ విలాపం'! | Chandrababu government cheated womens in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నారా వారి నిర్వాకానికి 'నారీ విలాపం'!

Mar 9 2026 4:55 AM | Updated on Mar 9 2026 11:28 AM

Chandrababu government cheated womens in Andhra Pradesh
  • మహిళలను వంచించిన చంద్రబాబు సర్కార్‌ 

  • అటకెక్కిన ఆడబిడ్డ నిధి.. బాబు ఎగ్గొట్టింది దాదాపు రూ.లక్ష కోట్లు

  • సున్నా వడ్డీకి మంగళం.. పొదుపు మహిళలకు బాబు బాకీ రూ.15 వేల కోట్లు  

  • పత్తాలేని 50 ఏళ్లకే పింఛన్‌ హామీ.. 

  • మూడేళ్లలో మోసం రూ.28,800 కోట్లు.. 

  • మహిళా దినోత్సవంలోనూ హామీల ఊసెత్తని బాబు.. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని మహిళల ఆక్రోశం

  • జగన్‌ పాలన స్వర్ణయుగమని గుర్తు చేసుకుంటున్న అక్క చెల్లెమ్మలు 

  • వైఎస్సార్‌ ఆసరా, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ పథకాలతో పాటు మహిళల పేరిటే.. 31 లక్షల ఇళ్ల పట్టాలు.. గృహ నిర్మాణాలు

  • పొదుపు మహిళలు వ్యాపారాల్లో రాణించేలా ప్రముఖ సంస్థలతో ఉత్పత్తుల అనుసంధానం, రుణాలు అందచేసి తోడ్పాటు

  • డీబీటీ, నాన్‌ డీబీటీతో మహిళలకు రూ.2,83,866.34 కోట్ల మేర లబ్ధి 

  • నామినేటెడ్‌ పోస్టులు, పనుల్లోనూ చట్టం చేసి మరీ 50 శాతం మహిళలకే 

  • ‘దిశ’తో అక్కచెల్లెమ్మలకు రక్షణ కవచం 

  • మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్నలా తోడుండి నడిపించిన వైఎస్‌ జగన్‌

నాడు: 
మహిళలకు స్వర్ణయుగం. అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే కుటుంబంతో పాటు రాష్ట్రం ప్రగతి బాట పడుతుందని వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా పథకాలు అందించారు. ఆర్థిక సాధికారతతోపాటు రాజకీయంగానూ ఎదిగేలా ప్రోత్సాహం అందించారు. నామినేటెడ్‌ పనులు, పదవుల్లో 50 శాతం మహిళలకే దక్కేలా చట్టం చేసి మరీ అమలు చేశారు. వైఎస్సార్‌ ఆసరా, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ పథకాలతో పాటు మహిళల పేరిటే ఇళ్ల పట్టాలు అందించి పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను సైతం చేపట్టారు. పొదుపు మహిళలకు అండగా నిలిచారు. ‘చేయూత’ ద్వారా మహిళా సాధికారతకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం బాటలు వేసింది. మహిళలు వివిధ వ్యాపారాల్లో రాణించి తమ కాళ్లపై తాము నిలదొక్కుకునేలా వారి ఉత్పత్తులను అమూల్, రిలయన్స్, ఐటీసీ ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్,  హిందుస్థాన్‌ లీవర్‌ లాంటి ప్రముఖ సంస్థలతో అనుసంధానించి, రుణాలు అందచేసి తోడ్పాటునిచ్చారు. తద్వారా మహిళలను అన్ని రంగాల్లో అగ్రపథాన నిలిపారు.

నేడు: 
2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు వరాల వల విసిరారు. జగన్‌ ఇచ్చిన వాటి కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని నమ్మబలికారు. మహిళల ఓట్లు కొల్లగొట్టారు. అధికారం చేపట్టాక వారిని విస్మరించారు. ఒక్కటంటే ఒక్క హామీని అమలు చేయకుండా మహిళలకు మొండి చేయిచూపారు. ఒక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎగ్గొట్టడం ద్వారానే మహిళలకు దాదాపు రూ.లక్ష కోట్ల మేర బకాయి పడ్డారు. గతంలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన పథకాలను చంద్రబాబు ఇవ్వకపోగా, తాను ఇస్తానన్న వాటిని సైతం ఎగ్గొట్టారు. దీంతో చంద్రబాబును నమ్మి మోసపోయామని, 20 నెలలుగా ప్రతి అడుగులోనూ మోసమేనని, దేశంలో ఏ రాజకీయ నాయకుడూ ఇలా మోసాలు చేసి, హామీలను నెరవేర్చానని నిస్సిగ్గుగా బుకాయించరని మహిళలు మండిపడుతున్నారు. వైఎస్‌ జగన్‌ పాలన స్వర్ణ యుగమని, మహిళలను మహరాణులుగా చేశారని గుర్తు చేసుకుంటున్నారు.

సాక్షి, అమరావతి: నారా వారి నిర్వాకానికి నారీలోకం విలపిస్తోంది! చంద్రబాబు ఎన్నికల మోసాలు.. సూపర్‌ సిక్స్‌ హామీల ఎగవేత.. ఓటు బ్యాంకు రాజకీయాలు.. మహిళా దినోత్సవం సాక్షిగా మరోసారి బట్టబయలయ్యాయి. ప్రధానంగా మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు మూడు బడ్జెట్లలోనూ కేటాయింపులు జరపని చంద్రబాబు అమరావతిలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో సైతం ఆడబిడ్డ నిధి, డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ, 50 ఏళ్లకే పెన్షన్, పెళ్లి కానుక.. తదితర పథకాల ఊసెత్తకపోవడం గమనార్హం. 2024 ఎన్నికల ముందు మేనిఫెస్టో పేరుతో ఇంటింటికి బాండ్లు, కరపత్రాలు పంచి పెట్టిన చంద్రబాబు ఇప్పుడు మహిళలను నయవంచన చేశారని ఆక్రోశిస్తున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అటకెక్కించడంతోపాటు చంద్రబాబు కనీసం తానిచ్చిన హామీలను సైతం నెరవేర్చకుండా దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ఆడబిడ్డ నిధి బకాయిలు రూ.97,200 కోట్లు 
ప్రతి అక్క చెల్లెమ్మకు మూడేళ్లలో రూ.54,000 ఎగవేత..! 
సూపర్‌ సిక్స్‌లో అతిముఖ్యమైన హామీ.. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున చంద్రబాబు ఏటా రూ.18 వేలు చొప్పున ఇస్తానన్నారు. ఎన్నికల కమిషన్‌ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు మహిళలు 1.80 కోట్ల మంది ఉన్నారు. హామీ ప్రకారం ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.18 వేల చొప్పున ఏటా మొత్తం రూ.32,400 కోట్లు చెల్లించాలి. కానీ ఈ పథకానికి మూడు బడ్జెట్లలో కేటాయించింది సున్నా. మూడేళ్లకు కలిపి అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు బకాయి పడ్డ సొమ్ము అక్షరాలా రూ.97,200 కోట్లు. ప్రతి అక్కచెల్లెమ్మకు ఈ స్కీమ్‌ కింద మూడేళ్లలో రూ.54 వేలు ఎగరగొట్టారు! 

సున్నా వడ్డీకి శూన్యం.. 
మహిళలకు రూ.15 వేల కోట్లు బాకీ 
పొదుపు మహిళల సున్నా వడ్డీకి మూడు బడ్జెట్లలోనూ అతీగతి లేదు. స్వయం సహాయ సంఘాలకు వడ్డీలేని రుణాలను రూ.3 లక్షల నుంచి ఏకంగా రూ.10 లక్షలకు పెంచుతామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చకపోగా గత ప్రభుత్వంలో అమ­లు చేసిన దాన్ని కూడా నిలిపివేశారు. గత ప్రభుత్వంలో కోటి మందికిపైగా పొదుపు మహిళలు సున్నా వడ్డీ ద్వారా దాదాపు రూ.ఐదు వేల కోట్ల మేర లబ్ధి పొందారు. మూడు బడ్జెట్లలోనూ నిధులు కేటాయించకుండా సున్నా వడ్డీ కింద పొదుపు మహిళలకు చంద్రబాబు ఏకంగా రూ.15 వేల కోట్లు మేర ఎగ్గొట్టా­రు! ఇక చంద్రబాబు ప్రభుత్వంలో పొదుపు సంఘా­ల పరపతి గణనీయంగా క్షీణించింది. నాబార్డ్‌ డేటా ప్రకారం 2023–24లో మహిళల పొదుపు రుణాలు రూ.49,626 కోట్లు కాగా చంద్రబాబు హయాంలో 2025–26 (డిసెంబర్‌ వరకు) రూ.30,698 కోట్లకు పడిపోయింది. మహిళలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పరపతి తగ్గిపోతోంది.  

50 ఏళ్లకే పింఛన్‌.. వంచన 
ఒక్కొక్కరికీ రూ.1.44 లక్షలు బకాయి 
సూపర్‌ సిక్స్‌లో ఇచ్చిన మరో హామీ 50 ఏళ్లకే పింఛన్‌. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దాదాపు 20 లక్షల మందికి పైగానే ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.4 వేల చొప్పున సంవత్సరానికి రూ.48 వేలు ఇవ్వాలి. ఈ లెక్కన ఏడాదికి మొత్తం రూ.9,600 కోట్లు అవుతుంది. దీని ప్రకారం మూడేళ్లలో మొత్తం రూ.28,800 కోట్లు కేటాయించాల్సి ఉండగా మూడు బడ్జెట్‌లలో ఇచ్చింది సున్నా. ఒక్కొక్కరికీ రూ.1.44 లక్షలు మేర చంద్రబాబు బాకీ పడ్డారు. అసలు కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్నవాటికే కోత పెడుతున్నారు. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య 66,34,372 కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 60,96,108 మందికే ఫించన్లు ఇచ్చారు. అంటే ఏకంగా 5,38,264 పింఛన్లు కట్‌ చేశారు. మరోవైపు 2014లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 39 లక్షల పింఛన్లు మాత్రమే ఉండగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ సంతృప్త స్థాయిలో అందచేస్తూ 66 లక్షలకుపైగా పింఛన్లు ఇచ్చింది. మళ్లీ చంద్రబాబు వచ్చిన రెండేళ్లకే పింఛన్లు 66 లక్షల నుంచి 60 లక్షలకు తగ్గిపోవడం గమనార్హం. 

తల్లులకు బాబు దగా.. 
మూడేళ్లలో రూ.24,504 కోట్లు ఎగవేత  
తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. యూడైస్‌ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. ఈ పథకానికి ఒక్కొక్కరికీ ఏటా రూ.15 వేల వంతున ఏడాదికి మొత్తం రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–­26లో కేవలం 67.27 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. రెండేళ్లలో తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా బకాయిపడ్డారు. ఇక తాజా బడ్జెట్‌లో రూ.8457.07 కోట్లు మాత్రమే ప్రతిపాదించి ఏకంగా రూ.4,655.75 కోట్ల మేర కోతలు పెట్టారు. తద్వారా మూడేళ్లలో పిల్లలకు రూ.24,504 కోట్ల మేర చంద్రబాబు ఎగ్గొట్టారు! 


ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు 

ఉచిత బస్సు, గ్యాస్‌.. తుస్సు 
మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి. తొలి ఏడాది హామీని పూర్తిగా ఎగ్గొట్టారు. ఇక రెండో ఏడాది ఆర్నెల్ల తరువాత ఆగస్టు నుంచి అరకొరగా మొదలుపెట్టి రూ.1,040 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ఇక ఈ స్కీమ్‌ కోసం మూడో బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గానూ రూ.2,460 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే మహిళలకు ఉచిత బస్సులో ఏకంగా రూ.7,140 కో­ట్లు బాకీ పడ్డారు. అంతేకాదు.. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉండగా ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు. ఇక ఉచిత గ్యాస్‌ కూ­డా మోసమే. రాష్ట్రంలో యాక్టివ్‌ గ్యాస్‌ కనెక్షన్ల సంఖ్య 1.59 కోట్లు కాగా ఏటా మూడు సిలెండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలిండర్‌ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.3,990 కోట్లకుపైగా ఇవ్వాలి. ఇలా మూడేళ్లకు మొత్తం లబ్ధిదారులకు రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు.


అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల హామీ ఏమైంది..? 
చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇళ్ల స్థలాల కోసం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు  ఇస్తామని చెప్పి మూడు బడ్జెట్లలోనూ పైసా కేటాయించలేదు. ఒక్కరికి కూడా సెంటు భూమి పట్టా ఇవ్వలేదు. పైగా వైఎస్సార్‌సీపీ హయాంలో 10 లక్షల ఇళ్లు పూర్తి కాగా వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న మిగతా వాటిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారు. వైఎస్సా­ర్‌సీపీ హయాంలో అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 21 లక్షల ఇళ్లు మంజూరు చే­యించి 10 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేశారు.   

ఆడబిడ్డలకు రక్షణ కరువు.. 
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైంది. గంజాయి, బ్లేడ్‌­బ్యాచ్‌లు చెలరేగిపోవడంతో రాష్ట్రంలో రోజుకి నలుగురు, ఐదుగురు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రోజు­కు 50 నుంచి 60 మందిపై లైంగిక వేధింపుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్ర­బాబు సొంత జిల్లాలో మహిళలపై నేరాలు 10 శా­తం పెరగగా.. హోంమంత్రి అనిత ఇన్‌చార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలోనూ నేరాలు పెరిగాయ­ని, లోకేశ్‌ నియోజకవర్గంలోనూ మహిళలపై నేరాలు పెరిగాయని పోలీస్‌ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. 

మదనపల్లెలో గంజాయి మత్తులో ఓ క్రూరమృగం ఏడేళ్ల బాలికపై హత్యాచారానికి తెగబడి డ్రమ్ములో పడేయడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. అరవ శ్రీధర్‌ అనే కూటమి ఎమ్మెల్యే తనను ఐదుసార్లు గర్భవతిని చేసి అబార్షన్లు చేయించినట్లు బాధితురాలు మొర పెట్టుకున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరించింది. పలువురు టీడీపీ, జనసేన ప్రజా ప్రతినిధులు మహిళలకు లైంగిక వేధింపులకు దిగడం రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులకు, సర్కారు వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

జగన్‌ పాలనలో మహిళలకు స్వర్ణయుగం
వైఎస్‌ జగన్‌ నవరత్నాల పాలన మహిళలకు స్వర్ణయుగంగా సాగింది. అమ్మ కడుపులోని బిడ్డ నుంచి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ వరకు ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి వైఎస్‌ జగన్‌ పథకాలను అమలు చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మహిళలకు పలు పథకాల ద్వారా డీబీటీ, నాన్‌ డీబీటీతో ఏకంగా రూ.2,83,866.34 కోట్లు అందించారు.  

చట్టం చేసి మరీ 50 శాతం పదవులు.. 
నామినేటెడ్‌ పోస్టుల నుంచి కేబినెట్‌ వరకు మహిళలకు వైఎస్‌ జగన్‌ పెద్ద పీట వేశారు. రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్, హోం, వైద్య ఆరోగ్య, పర్యాటక శాఖల మంత్రులుగా మహిళలకు పట్టం కట్టారు. నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చే కాంట్రాక్ట్‌ పనుల్లో కూడా మహిళలకు 50 శాతం కేటాయిస్తూ చట్టం చేసి మరీ అమలు చేశారు.  

అక్క చెల్లెమ్మల పేరిటే ఇళ్లు.. స్థలాలు  
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంతగూడు ఉండాలన్న సంకల్పంతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇంటి స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు చేశారు. అక్క చెల్లెమ్మల పేరిట స్థిరాస్తిని సమకూర్చడం దేశంలోనే సరికొత్త చరిత్ర. సొంత ఇళ్లు లేని అక్కచెల్లెమ్మలకు ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందజేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా భూముల కొనుగోలు కోసం రూ.11,871 కోట్లు, ఇళ్ల నిర్మాణాలకు రూ.20,338 కోట్లు ఖర్చు చేశారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.3 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.35,209 కోట్లు వెచ్చించి అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చి, ఇళ్లు కట్టించి ఇచ్చి లక్షాధికారులను చేశారు. ఇదే విషయాన్ని సాక్ష్యాత్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌లో లోక్‌సభ సమావేశాల్లో లిఖిత పూర్వకంగా వెల్లడించడం గమనార్హం.

మహిళా రక్షణకు పెద్దపీట.. 
మహిళల రక్షణ, భద్రత కోసం వైఎస్‌ జగన్‌ పలు వినూత్న చర్యలు చేపట్టారు. ప్రధానంగా దిశ బిల్లు తెచ్చి దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్లతో అక్క చెల్లెమ్మలకు రక్షణ కవచంలా నిలిచారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఒక మహిళా పోలీస్‌ను నియమించారు. ఏ మహిళకు ఆపద వచ్చినా సమాచారం అందుకున్న నిమిషాల వ్యవధిలోనే పోలీసులు రంగంలోకి దిగి అండగా నిలిచేలా దిశ యాప్‌ ద్వారా చర్యలు చేపట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement