వచ్చే ఐపీఎల్ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఆడనున్న భారత స్టార్ ఆల్‌రౌండర్
రూ. 14 కోట్లకు రాజస్తాన్ రాయల్స్‌కు బదిలీ చేసిన చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులోకి సంజూ సామ్సన్
రసెల్, వెంకటేశ్ అయ్యర్‌లను వదులుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్
ముంబై: ఐపీఎల్ ‘ఫైవ్ స్టార్’ చాంపియన్‌లలో ఒకటైన చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే) పెనుమార్పే చేసింది. గత రెండు సీజన్లుగా చెత్త ప్రదర్శనతో చతికిలబడిన ఈ జట్టు వచ్చే సీజన్‌కు ముందు పతాక శీర్షికలకెక్కే నిర్ణయం తీసుకుంది. అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను అనూహ్యంగా బదిలీ చేసేసింది. సీఎస్‌కే దిగ్గజ కెప్టెన్ ధోని స్వయంగా ‘సర్ రవీంద్ర జడేజా’ అంటూ నెత్తిన పెట్టుకున్న సహచరుణ్ని... టాపార్డర్ డాషింగ్ బ్యాటర్ సంజూ సామ్సన్ కోసం రాజస్తాన్ రాయల్స్‌కు ట్రేడ్ ట్రాన్స్‌ఫర్ చేసింది.
రాయల్స్ జడేజాను తీసుకోగా, సామ్సన్ చెన్నై చెంత చేరాడు. మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) తమ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌ను విడుదల చేసింది. రెండుసార్లు రిటెయిన్ చేసుకున్న ఫ్రాంచైజీ ఎట్టకేలకు కరీబియన్ ఆల్‌రౌండర్‌తో 11 ఏళ్ల బంధాన్ని తెంచుకుంది. రూ.23.75 కోట్లు వేలంలో పాడి మరీ కొనుక్కొన్న వెంకటేశ్ అయ్యర్‌ను వెంటనే ఒక సీజన్‌కే సాగనంపింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) వెటరన్ సీమర్ మొహహ్మద్ షమీని లక్నో సూపర్ జెయంట్స్ ట్రేడ్‌లో తీసుకుంది. మొత్తం పది ఫ్రాంచైజీల్లో అత్యధిక పర్స్ మొత్తం కోల్‌కతా వద్దే ఉంది. కేకేఆర్ పర్స్‌లో రూ. 64.30 కోట్లుండగా, 6 విదేశీ ఆటగాళ్లు సహా 13 మందిని వేలంలో కొనాలి. అత్యల్ప పర్స్ ముంబై జట్టులో ఉంది. ముంబై ఇండియన్స్ వద్ద కనీసం మూడు కోట్లయినా లేవు. చేతిలో ఉన్న రూ.2.75 కోట్లతో ఒక విదేశీ ప్లేయర్ సహా ఐదు మందిని కొనుగోలు చేయాలి.
చెప్పుకోదగ్గ మార్పులు
చెన్నై ఒక్క జడేజాతో సరిపెట్టలేదు. విదేశీ స్టార్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, స్యామ్ కరన్‌లాంటి హిట్టర్‌లతో పాటు ‘యార్కర్ స్పెషలిస్ట్’ పతిరణను వదులుకుంది. కేకేఆర్ రసెల్, అయ్యర్, డికాక్, మొయిన్ అలీలాంటి బ్యాటర్లతో పాటు సఫారీ పేసర్ నోర్జేని సాగనంపింది. పంజాబ్ కింగ్స్ మేటి విదేశీ హిట్టర్లను విడుదల చేసింది. మ్యాక్స్‌వెల్, ఇన్‌గ్లిస్‌లను వదిలేసుకుంది.
తొలి సీజన్ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ తమ తురుపుముక్క, నాలుగు సీజన్లు జట్టును నడిపించిన సంజూ సామ్సన్‌నే కాదు హసరంగ, తీక్షణ, నితీశ్ రాణాలను వద్దనుకుంది. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను వేలంలో ఏ జట్టు కన్నెత్తి చూడకపోయినా ప్రాథమిక ధరకే కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ ఈసారి అర్జున్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడింగ్‌లో కొనేందుకు సమ్మతించింది.
పాత గూటికి...
సీఎస్‌కేతో జడేజా బంధం సుదీర్ఘమైందే కానీ... మొదలైంది మాత్రం రాజస్తాన్ రాయల్స్‌తోనే! లీగ్ మొదలైన ఏడాదే (2008) తొలి చాంపియన్‌గా నిలిచిన రాయల్స్ జట్టు సభ్యుడు జడేజా ఆ మరుసటి ఏడాది కూడా రాజస్తాన్‌తోనే ఉన్నాడు. కానీ కాంట్రాక్టు ఒప్పందం ఉల్లంఘన కారణంతో 2010లో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతనిపై ఏడాది నిషేధం విధించింది.
2011లో కొత్తగా వచ్చిన ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్ కేరళ (ఇప్పుడు లేదు)కు ఆడాడు. 2012 నుంచి ఈ సీజన్ వరకు మధ్యలో రెండేళ్లు (2016, 2017లో సీఎస్‌కేపై నిషేధం కారణంగా గుజరాత్ లయన్స్) తప్ప సూపర్‌కింగ్స్‌లో విజయవంతమైన ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు.
ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా
చెన్నై: రవీంద్ర జడేజా, ఆండ్రీ సిద్ధార్‌్థ, దీపక్ హుడా, కాన్వే, రచిన్ రవీంద్ర, పతిరణ, స్యామ్ కరన్, కమలేశ్ నాగర్‌కోటి, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, వంశ్ బేడీ, విజయ్ శంకర్.
ఢిల్లీ: డొనోవాన్ ఫెరీరా, దర్శన్, డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్, మన్వంత్, మోహిత్ శర్మ, సిద్దీఖుల్లా.
గుజరాత్: రూథర్‌ఫర్డ్, షనక, కొయెట్జీ, కరీమ్, కుల్వంత్, మహిపాల్ లామ్రోర్.
కోల్‌కతా: రసెల్, వెంకటేశ్ అయ్యర్, నోర్జే, చేతన్ సకారియా, సిసోడియా, మొయిన్ అలీ, డికాక్, గుర్బాజ్, జాన్సన్.
లక్నో: శార్దుల్ ఠాకూర్, డేవిడ్ మిల్లర్, రవి బిష్ణోయ్, ఆకాశ్‌దీప్, షామర్ జోసెఫ్, ఆర్యన్, యువరాజ్, రాజ్యవర్ధన్.
ముంబై: అర్జున్ టెండూల్కర్, జాకబ్స్, కరణ్ శర్మ, లిజాద్, ముజీబుర్ రహ్మాన్, టోప్లీ, శ్రీజిత్, సత్యనారాయణ రాజు, విఘ్నేశ్.
పంజాబ్: మ్యాక్స్‌వెల్, ఇన్‌గ్లిస్, ఆరోన్, జేమీసన్, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దూబే.
రాజస్తాన్: సామ్సన్, నితీశ్ రాణా, ఆకాశ్, అశోక్, ఫజల్‌హక్, కార్తీకేయ, కునాల్ రాథోడ్, తీక్షణ, హసరంగ.
బెంగళూరు: లివింగ్‌స్టోన్, ఇన్‌గిడి, మయాంక్ అగర్వాల్, మనోజ్, స్వస్తిక్ చికారా, మోహిత్ రాఠి.
హైదరాబాద్: షమీ, అథర్వ, సచిన్ బేబీ, అభినవ్ మనోహర్, ముల్డర్, ఆడమ్ జంపా, సిమర్‌జీత్, రాహుల్ చహర్.


