టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill). భారత జట్టు టెస్టు సారథిగా అరంగేట్రంలోనే ఇంగ్లండ్ గడ్డపై అదరగొట్టిన ఈ పంజాబీ బ్యాటర్.. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వన్డే కెప్టెన్‌గానూ పగ్గాలు చేపట్టాడు. ఇక అంతకంటే ముందే ఆసియా కప్-2025 సందర్భంగా టీమిండియా టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు.
విరామం లేని షెడ్యూల్
ఇలా వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో విరామం లేకుండా ఆడుతున్న గిల్.. స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా గాయపడ్డాడు. మెడ నొప్పి కారణంగా ఆట మధ్యలోనే నిష్క్రమించి.. మళ్లీ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేకపోయాడు. ఐసీయూలో చికిత్స పొందిన ఈ కెప్టెన్ సాబ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఫలితంగా గువాహటిలో సఫారీలతో జరిగే రెండో టెస్టుకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు.
కాగా నిద్రలేమి, అవిశ్రాంతంగా ఆడటం వల్లే గిల్ మెడ నొప్పి తీవ్రమైందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా.. బీసీసీఐ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే.. పేస్‌దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సైతం పనిభారం తగ్గించుకునే క్రమంలో ఇంగ్లండ్‌లో ఐదింటికి కేవలం రెండే టెస్టులు ఆడిన విషయం తెలిసిందే.
వారికి విశ్రాంతి
అంతేకాదు.. సౌతాఫ్రికాతో టీ20లకు కూడా బుమ్రా దూరంగా ఉండనున్నాడని.. అతడితో పాటు హార్దిక్ పాండ్యా (Hardik Pandya)కు కూడా సెలక్టర్లు విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ గురించి మరోసారి చర్చ మొదలైంది.
ఈ విషయంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) వైఖరి ఏమిటన్న ప్రశ్నలు మొదలుకాగా.. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. తాను ఈ విషయం గురించి గంభీర్‌తో చర్చించినపుడు ఆటగాళ్లను ఉద్దేశించి అతడు ఓ కీలక సూచన చేశాడని తాజాగా వెల్లడించాడు.
ఐపీఎల్ ఆడకపోతే సరి
జియోస్టార్‌తో మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. ‘‘వెస్టిండీస్‌తో టీమిండియా టెస్టు మ్యాచ్ సందర్భంగా నేను గౌతమ్‌ను ఓ ప్రశ్న అడిగాను. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌కు ఏం చేయాలంటారు? అని అడిగాను. అందుకు అతడు.. ‘ఐపీఎల్ ఆడకపోతే సరి’ అని సమాధానం ఇచ్చాడు.
‘ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఉంటే.. అదనపు ఒత్తిడిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటపుడు సారథిగా ఉండకుండా పగ్గాలు వదిలేయడం ఇంకా మంచిది. ఒకవేళ టీమిండియా కోసం ఆడాలనుకుంటే.. ఫిట్‌గా ఉండటంతో పాటు మానసికంగా కూడా సంసిద్ధంగా ఉండాలి.
అలా జరగాలంటే ఐపీఎల్ వంటి టోర్నీలను వదిలేస్తే సరి’ అని గంభీర్ అభిప్రాయపడ్డాడు’’ అని తెలిపాడు. ఏదేమైనా టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కీలకంగా ఉన్న ఆటగాళ్లు అదనపు ఒత్తిడిని తగ్గించుకుంటే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా వరుస సిరీస్‌లు ఆడగలరని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. మానసికంగా బలంగా ఉంటే.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు విరామం ఇవ్వాల్సిన అవసరం రాదని అభిప్రాయపడ్డాడు.


