అంతర్జాతీయంగా మహిళలకు ఒక ప్రత్యేకమైన రోజు ఉన్నట్లుగానే పురుషులకూ ఒక రోజు ఉందనే సంగతి మీకు తెలుసా? సమాజంలో మహిళలతో సమానంగా పురుషులకున్న ప్రాధాన్యతను గుర్తిస్తూ, ఈ రోజును జరుపుకుంటారు. మరి.. ఆ దినోత్సవం ఎప్పుడనే వివరాల్లోకి వెళితే.. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (International Men's Day) ప్రతి సంవత్సరం నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజును 1999లో డాక్టర్ జెరోమ్ తిలక్‌సింగ్ ప్రారంభించారు. కుటుంబంలో, సమాజ నిర్మాణంలో పురుషులు, బాలుర సానుకూల సహకారాన్ని గుర్తించడం, వారి శ్రేయస్సుకు ప్రాధాన్యతనివ్వడమే ఈ దినోత్సవ లక్ష్యం. ప్రతి ఏటా ఒక నిర్దిష్ట థీమ్‌ను ఎంచుకుని పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రపంచం ముందు ఉంచుతారు.
పురుషుల సమస్యలపై చర్చ
2025 అంతర్జాతీయ పురుషుల దినోత్సవ ఇతివృత్తం ‘పురుషులు, బాలుర శ్రేయస్సును ప్రోత్సహించడం’(Celebrating Men and Boys). ఈ రోజున కేవలం పురుషుల విజయాలను మాత్రమే కాకుండా, వారి మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణ, లింగ సమానత్వం తదితర అంశాలపై కూడా దృష్టి సారిస్తారు. తద్వారా వారికి అవసరమైన చోట సహాయం అందించడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఈ దినోత్సవం.. పురుషులు, బాలురు ఎదుర్కొంటున్న వివక్ష, సాంఘిక ఒత్తిళ్లు, సవాళ్లను బహిరంగంగా చర్చించడానికి అవకాశం కల్పిస్తుంది. డాక్టర్ తిలక్‌సింగ్ అభిప్రాయం ప్రకారం.. లింగ సమానత్వాన్ని గుర్తించి, మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడానికి ఈరోజు తోడ్పడుతుంది. నవంబర్ 19న ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లోని పురుష రోల్ మోడల్స్‌ను గౌరవించాలని, పురుషుల శ్రేయస్సు కోసం ఆరోగ్యకరమైన సమాజాలను నిర్మించడానికి కృషి చేయాలని తిలక్‌సింగ్ కోరారు.
స్ఫూర్తిదాయక పురుషులను గుర్తుచేసుకుంటూ..
డాక్టర్ జెరోమ్ తిలక్‌సింగ్ ట్రినిడాడ్, టొబాగోకు చెందిన చరిత్రకారుడు, విద్యావేత్త. ఆయన 1999లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని (ఐఎండీ)ప్రారంభించారు. ఆయన తన తండ్రి పుట్టినరోజును గౌరవిస్తూ, ఈ దినోత్సవాన్ని మొదలుపెట్టారు. అలాగే సమాజంలోని స్ఫూర్తిదాయక పురుషులను గుర్తుచేసుకోవడం లక్ష్యంగా ఈ దినోత్సవానికి శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సమాంతరంగా సమాజంలో పురుషుల సహకారాన్ని గుర్తించడం లక్ష్యంగా ఈ దినోత్సవం ప్రారంభమయ్యింది.
భారత్‌తో డాక్టర్ తిలక్‌సింగ్ అనుబంధం
డాక్టర్ తిలక్‌సింగ్ మూలాలు భారతదేశంతో ముడిపడి ఉన్నాయి. ఆయన ట్రినిడాడ్ అండ్ టొబాగోలో నివసిస్తున్న ఇండో-కరేబియన్ డయాస్పోరా (భారతీయ సంతతి)లో భాగంగా ఉన్నారు. ఆయన పూర్వీకులు 19వ శతాబ్దంలో ఒప్పంద కార్మికులుగా భారతదేశం నుండి కరేబియన్‌కు వలస వచ్చారు. వెస్టిండీస్ విశ్వవిద్యాలయంలో చరిత్ర లెక్చరర్‌గా సాగించిన తిలక్‌సింగ్ పరిశోధనలు ప్రధానంగా ఇండో-కరేబియన్ చరిత్రపై కేంద్రీకృతమయ్యాయి. ఆయన భారతీయ వలసలు, సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకువచ్చారు. ఆయన ప్రారంభించిన ఐఎండీ దార్శనికతను భారతదేశం స్వీకరించింది. తద్వారా తిలక్‌సింగ్ సందేశం ఆయన పూర్వీకుల దేశంలో ఒక సామాజిక ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవంతో పాటు, డాక్టర్ తిలక్‌సింగ్ ప్రపంచ బాలల దినోత్సవాన్ని కూడా ప్రారంభించారు. సమాజంలో బాలురు ఎదుర్కొంటున్న నిర్లక్ష్యం, బెదిరింపులు, మార్గదర్శకత్వ లేమి తదితర సమస్యలపై దృష్టి సారించడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం.


