suruchi
-
ఆటపై అభి‘రుచి’
సాక్షి క్రీడా విభాగం : పెరూ రాజధాని లిమా నగరంలో ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీ... భారత స్టార్ షూటర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో బరిలో నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత మొదటిసారి బరిలోకి దిగిన మనూ స్వర్ణం గెలవడం ఖాయం అన్నట్లుగా అంచనాలు ఆమెపైనే ఉన్నాయి. కానీ చివరకు అనూహ్య ఫలితం వచ్చింది. భారత్‌కే చెందిన మరో యువ షూటర్, 18 ఏళ్ల సురుచి సింగ్ దూసుకొచ్చింది. మనూ భాకర్‌ను వెనక్కి నెట్టి ఆమె స్వర్ణపతకం సొంతం చేసుకుంది. ఒలింపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ రజతానికి పరిమితం కావాల్సి వచ్చింది. దాంతో ఒక్కసారిగా అందరి దృష్టీ ఆమెపై పడింది. మనూ భాకర్‌పై గెలిచిన రెండో రోజు సురుచి పిస్టల్ మళ్లీ మెరిసింది. ఈసారి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్‌కే చెందిన సౌరభ్ చౌధరీతో కలిసి సురుచి మరో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు వారమే అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన తొలి ప్రపంచ కప్‌లో స్వర్ణం నెగ్గిన ఆమెకు ఓవరాల్‌గా ఇది మూడో స్వర్ణం. అయితే మొదటి స్వర్ణంతో పోలిస్తే మనూ భాకర్‌ను ఓడించి సాధించిన పసిడి పతకం విలువ పెద్దదిగా మారిపోయింది. బాక్సింగ్, రెజ్లింగ్‌ను కాదని... సురుచి స్వస్థలం హరియాణాలోని జఝర్. దేశంలోనే బాక్సింగ్‌కు అడ్డాగా ఒలింపిక్ మెడలిస్ట్ విజేందర్ సింగ్ సహా ఎంతో మంది బాక్సర్లు ఓనమాలు నేర్చుకొని అగ్రస్థాయికి చేరిన భివానికి సమీపంలో ఇది ఉంటుంది. జఝర్కు చెందిన ఇందర్ సింగ్ ఆర్మీలో హవల్దార్‌గా పని చేశాడు. ఒకప్పుడు గొప్ప రెజ్లర్‌గా గుర్తింపు తెచ్చుకున్న గూంగా (మూగ) పహిల్వాన్ (వీరేందర్ సింగ్) ఇతనికి సోదరుని వరుస (కజిన్) అవుతాడు. తన కజిన్ తరహాలోనే తన కూతురు సురుచిని కూడా రెజ్లర్‌ను చేయాలని ఇందర్ సింగ్ ఆశించాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం మరోవైపు ఆసక్తిని చూపించింది. అటు బాక్సింగ్, ఇటు రెజ్లింగ్ కాకుండా షూటింగ్‌ను ఎంచుకుంది. అందులో టాప్ ప్లేయర్ కావడమే లక్ష్యంగా పెట్టుకుంది. కూతురి ఇష్టాన్ని గుర్తించిన ఇందర్ సింగ్ ఆమెను భివానిలోని గురు ద్రోణాచార్య షూటింగ్ అకాడమీలో చేర్పించాడు. ఆపై తన ఆర్మీ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో కూతురును షూటర్‌ను చేసేందుకు తన సమయం వెచ్చించాడు. 13 ఏళ్ల సురుచి కోచ్ సురేశ్ సింగ్ మార్గనిర్దేశనంలో షూటింగ్‌ను నేర్చుకొని అందులో పట్టు సంపాదించింది. ఇక మున్ముందు టోర్నీల్లో విజయాలే లక్ష్యంగా ఆమె సిద్ధమవుతూ వచ్చింది. అప్పుడే కోవిడ్ మహమ్మారి వచ్చేసింది. ప్రపంచంలో ఎంతో మంది ప్లేయర్లకు వచ్చిన కష్టమే సురుచికి కూడా వచ్చింది. సొంత ఊర్లో సాధన... కోవిడ్ సమయంలో భివానికి వెళ్లి ప్రాక్టీస్ చేయడం అసాధ్యంగా మారింది. అప్పటికే సురుచి కొన్ని జూనియర్ టోర్నమెంట్లలో పాల్గొంటూ వచ్చింది. ఆ సమయంలో మరో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న ఇందర్ సింగ్‌కు తమ స్వగ్రామంలోనే కొత్తగా ఏర్పాటైన కార్గిల్ షూటింగ్ అకాడమీ కలిసొచ్చింది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న అనిల్ జాఖడ్ ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన అకాడమీ ఇది. దాంతో ఇక్కడే సురుచి సాధన మళ్లీ మొదలైంది. ఆమె తన ఆటపైనే పూర్తిగా దృష్టి పెట్టి సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ శిక్షణ కోవిడ్ తర్వాత మంచి ప్రభావం చూపించింది. 2022 జాతీయ చాంపియన్‌షిప్‌లో ఆమె తొలి సారి పతకం గెలుచుకొని తన విజయ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత 2023 జాతీయ చాంపియన్‌షిప్‌లో కూడా పతకాలు సాధించింది. అయితే 2024లో జరిగిన పోటీలు ఆమె స్థాయిని షూటింగ్ ప్రపంచానికి తెలియజేశాయి. ఈసారి ఏకంగా 7 పతకాలతో మెరిసిన సురుచికి భారత భవిష్యత్తు స్టార్‌గా గుర్తింపు వచ్చింది. స్టార్ షూటర్ శిక్షణలో... ప్రఖ్యాత పిస్టల్ షూటర్ జీతూ రాయ్ భారత జట్టు కోచింగ్ బృందంలోకి వచ్చాక సురుచి ఆట మరింత పదునెక్కింది. షూట్ చేసే సమయంలో ఆమె నిలిచే తీరులో ఉన్న స్వల్ప లోపాన్ని సవరించడంతో పాటు కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకునే విషయంలో జీతూ రాయ్ ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. సురుచి ఇటీవలి వరుస విజయాల్లో రాయ్ పాత్ర కూడా చాలా ఉంది. ముఖ్యంగా వరల్డ్ కప్‌కు ముందు కర్ణీ సింగ్ షూటింగ్ రేంజ్లో జీతూ రాయ్ మార్గనిర్దేశనంలో జరిగిన 15 రోజుల ప్రత్యేక శిక్షణా శిబిరం సురుచికి ఎంతో మేలు చేసింది. వరల్డ్ కప్‌లో 2 వ్యక్తిగత స్వర్ణాలతో పాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సౌరభ్ చౌదరితో కలిసి మరో పసిడిని కూడా ఆమె సొంతం చేసుకొని తన స్వర్ణాల సంఖ్యను మూడుకు పెంచుకుంది. ఓపికకు చిరునామావంటి షూటింగ్ క్రీడలో కెరీర్ ఆరంభంలో ఆమె త్వరగా ప్రాక్టీస్ ముగించే ప్రయత్నంలో కాస్త అసహనం ప్రదర్శించేది. కానీ కోచ్‌లు దీనిని గుర్తించి ఆమెకు సరైన దిశానిర్దేశం చేశారు. ఆటలో ఎదగాలంటే సాంకేతిక అంశాలే కాదు వ్యక్తిగత లోపాలు కూడా దిద్దుకోవాలని వారు చేసిన సూచనలను ఆమె అర్థం చేసుకుంది. ఇప్పుడు ప్రాక్టీస్‌లో కూడా తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి పర్ఫెక్షన్ వచ్చే వరకు సురుచి అక్కడినుంచి కదలదు. అలాంటి పట్టుదల అలవాటు చేసుకొని పెద్ద లక్ష్యాలతో ఆమె ముందుకు సాగుతోంది. తొలి కోచ్ సురేశ్ సింగ్ నుంచి జీతూ రాయ్ వరకు ఇప్పుడు కష్టపడే తత్వం గురించే చెబుతుండటం విశేషం. వరల్డ్ కప్ తరహా ప్రదర్శనలు పునరావృతం చేస్తూ నిలకడగా సాగితే భవిష్యత్తులో సురుచి నుంచి కూడా ఒలింపిక్ పతకం ఆశించవచ్చు. -
సురుచి ధమాకా
లిమా (పెరూ): గతవారం అర్జెంటీనాలో అదరగొట్టిన భారత టీనేజ్ పిస్టల్ షూటర్ సురుచి ఇందర్ సింగ్ అదే జోరును పెరూలో పునరావృతం చేసింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ రెండో టోర్నమెంట్లో హరియాణాకు చెందిన 18 ఏళ్ల సురుచి 24 గంటల వ్యవధిలో రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో సురుచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురుచి 243.6 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని దక్కించుకుంది. సురుచి ధాటికి గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు నెగ్గిన భారత స్టార్ మనూ భాకర్ రజత పతకంతో సంతృప్తి పడింది. మనూ భాకర్ 242.3 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. 34 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో సురుచి 582 పాయింట్లతో రెండో స్థానంలో, మనూ భాకర్ 578 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లోనూ సురుచి గరి అదిరింది. ఈ ఈవెంట్ ఫైనల్లో సురుచి–సౌరభ్ చౌధరీ (భారత్) ద్వయం విజేతగా నిలిచి పసిడి పతకాన్ని సాధించింది. ఫైనల్లో సురుచి–సౌరభ్ జోడీ 17–9తో కియాన్జున్ యావో–కాయ్ హు (చైనా) జంటను ఓడించింది. కాంస్య పతక మ్యాచ్‌లో మనూ భాకర్–రవీందర్ సింగ్ (భారత్) జోడీ 6–16తో కియాన్కె మా–యిఫాన్ జాంగ్ (చైనా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
Suruchi- Vijayveer: డబుల్ ధమాకా
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో మంగళవారం భారత షూటర్లు అదరగొట్టారు. రెండు స్వర్ణ పతకాలతో సత్తా చాటుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 18 ఏళ్ల సురుచి ఇందర్ సింగ్... పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో విజయ్‌వీర్ సిద్ధూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురుచి 244.6 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సురుచి ధాటికి చైనా ద్వయం కియాన్ వె 241.9 పాయింట్లతో రజతం దక్కించుకోగా... డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ జియాంగ్ రాన్‌జిన్ 221 పాయింట్లతో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. 41 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లోనూ సురుచి తన ఆధిపత్యం చాటుకుంది. సురుచి 583 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. భారత స్టార్ షూటర్, పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు నెగ్గిన మనూ భాకర్ నిరాశపరిచింది. మనూ 574 పాయింట్లు స్కోరు చేసి 13వ స్థానంతో సంతృప్తి పడి ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. భారత్‌కే చెందిన మరో షూటర్ సయం 572 పాయింట్లతో 17వ స్థానంలో నిలిచింది. ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో విజయ్‌వీర్ సిద్ధూ 29 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ప్రపంచకప్ చరిత్రలో 22 ఏళ్ల విజయ్‌వీర్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం గెలవడం ఇదే తొలిసారి. రికియార్డో మజెట్టి (ఇటలీ; 28 పాయింట్లు) రజతం నెగ్గగా... యాంగ్ యుహావో (చైనా; 23 పాయింట్లు) కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. 24 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్ ఈవెంట్లో విజయ్‌వీర్ 579 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. భారత్‌కే చెందిన గుర్ప్రీత్ సింగ్ 575 పాయింట్లతో 10వ స్థానంలో, అనీశ్ 570 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యంతో కలిపి మొత్తం 6 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. -
షూటింగ్లో ‘స్వర్ణ’ సురుచి
న్యూఢిల్లీ: హరియానా టీనేజ్ షూటర్ సురుచి జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాల్ని అవలీలగా సాధిస్తోంది. ఈ టోర్నీలో ఆమె నాలుగో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఆంధ్ర షూటింగ్ జోడీ నేలవల్లి ముకేశ్– ద్వారం ప్రణవి 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజత పతకం సాధించింది. శుక్రవారం మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ ఈవెంట్లో మూడు స్వర్ణాల్ని క్లీన్‌స్వీప్ చేసిన సురుచి శనివారం 10 మీటర్ల యూత్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పసిడి పతకాన్ని గెలుచుకుంది. సామ్రాట్ రాణాతో జోడీ కట్టిన ఆమె ఫైనల్లో 16–2తో ఉత్తరాఖండ్‌కు చెందిన అభినవ్ దేశ్వాల్–యశస్వీ జోషి జోడీపై ఏకపక్ష విజయం సాధించింది. ప్రత్యర్థి ద్వయం కనీసం ఖాతా తెరువకముందే సురుచి–సామ్రాట్ జంట 14–0తో స్పష్టమైన ఆధిపత్యాన్ని చలాయించింది. కాంస్య పతక పోరులో కర్నాటకకు చెందిన జొనాథన్ గెవిన్ ఆంథోని–అవంతిక మధు 17–13తో జస్వీర్ సింగ్ సాహ్ని–సైనా భర్వాణిలపై గెలిచింది. 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో ముకేశ్–ప్రణవి జోడీ 12–16తో ఆర్మీ షూటర్లు రవీందర్ సింగ్–సేజల్ కాంబ్లి జంట చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. రవీందర్, సేజల్లకు స్వర్ణ పతకం లభించింది. -
నాణ్యతలో ‘సురుచి’కి ఐఎస్ఓ అవార్డు
తాపేశ్వరం (మండపేట) : అతిపెద్ద లడ్డూ తయారీతో సరికొత్త గిన్నీస్ రికార్డు నెలకొల్పిన తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్ సంస్థ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడం ద్వారా ఐండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) సర్టిఫికెట్‌ను దక్కించుకుంది. నాణ్యత కలిగిన పిండి వంటల తయారీ ద్వారా రెండేళ్ల క్రితమే సురుచి సంస్థకు ఈ సర్టిఫికెట్ దక్కించుకుంది. తాజాగా విజయవాడలో శనివారం రాత్రి ఐఎస్ఓ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా రెండవసారి సురుచి సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు ఐఎస్ఓ సంస్థకు సంబం«ధించిన ప్రతిష్టాత్మకమైన హెచ్ఐఎం అవార్డును అందుకున్నారు. డిప్యూటీ సీఎంలు నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాధరెడ్డి చేతులమీదుగా మల్లిబాబు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మల్లిబాబు మాట్లాడుతూ తమ సంస్థకు నాణ్యతలో ప్రతిష్టాత్మమైన హెచ్ఐఎం సర్టిఫికెట్ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఐఎస్ఓ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.