
ప్రపంచకప్‌లో మూడోసారి పసిడి పతకం గెలిచిన భారత యువ షూటర్
మ్యూనిక్: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) మూడో ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టుకు తొలి స్వర్ణ పతకం లభించింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 19 ఏళ్ల సురుచి సింగ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో సురుచి పోటీపడ్డ మూడు ప్రపంచకప్ టోర్నీల్లోనూ బంగారు పతకాలు గెలవడం విశేషం. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురుచి 241.9 పాయింట్లు స్కోరు చేసి విజేతగా అవతరించింది.
కామిలీ జెద్రెజెవ్‌స్కీ (ఫ్రాన్స్; 241.7 పాయింట్లు) రజతం నెగ్గగా... కియాన్‌జున్ యావో (చైనా; 221.7 పాయింట్లు) కాంస్య పతకాన్ని సంపాదించింది. ఈ ఏడాది జాతీయ సీనియర్ జట్టులోకి వచ్చిన సురుచి ఏప్రిల్‌లో బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన తొలి ప్రపంచకప్ టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్యం సాధించింది. ఏప్రిల్‌లోనే పెరూ రాజధాని లిమాలో జరిగిన రెండో ప్రపంచకప్ టోర్నీలో సురుచి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో, మిక్స్‌డ్ టీమ్ విభాగంలో బంగారు పతకాలు గెలిచింది.