ప్రైవేట్‌ పెట్టుబడులు వెల్లువెత్తాలి | Invest, innovate, make use of post-Budget announcements says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ పెట్టుబడులు వెల్లువెత్తాలి

Feb 28 2026 4:59 AM | Updated on Feb 28 2026 4:59 AM

Invest, innovate, make use of post-Budget announcements says PM Narendra Modi

నవీన ఆవిష్కరణలకు నడుం బిగించాలి 

పారిశ్రామిక వర్గాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచన 

న్యూఢిల్లీ: దేశంలో మరిన్ని పెట్టుబడులు, నవీన ఆవిష్కరణలకు భారత పారిశ్రామిక వర్గాలు తక్షణమే నడుం బిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో ప్రైవేట్‌ రంగం సైతం కీలక పాత్ర పోషించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వరుస బడ్జెట్‌ల ద్వారా పెట్టుబ డులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సైతం పెట్టుబడి వ్యయాన్ని భారీగా పెంచుతోందని గుర్తుచేశారు. 

శుక్రవారం ‘టెక్నాలజీ, రిఫామ్స్, ఫైనాన్స్‌ ఫర్‌ వికసిత్‌ భారత్‌’పై మొదటి పోస్ట్‌–బడ్జెట్‌ వెబినార్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. 11 ఏళ్ల క్రితం ప్రభుత్వ పెట్టుబడి వ్యయం రూ.2 లక్షల కోట్లుగా ఉండేదని, ఇప్పుడు అది రూ.12 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రైవేట్‌ పెట్టుబడులు వెల్లువెత్తేలా 2026–27 బడ్జెట్‌లో పలు ప్రకటనలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు, నైపుణ్యాలు కలిగిన భాగస్వాములు కలిసి కట్టుగా పనిచేస్తే సంస్కరణలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయన్నారు. 

కాగితంపై ప్రకటించినవి క్షేత్రస్థాయిలో విజయాలుగా నమోదు అవుతాయన్నారు. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ ప్రాధాన్య రంగాల గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రహదారులు, రైల్వేలు, ఓడ రేవులు, విమానా శ్రయాలు, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, ఇంధన వ్యవస్థల్లో ప్రభుత్వం రికార్డు స్థాయిలో పెట్టుబడి వ్యయం చేస్తున్నట్లు తెలియజేశారు. ఆయా రంగాల్లో ప్రైవేట్‌ పెట్టుబడులకు చక్కటి అవకాశాలు ఉన్నాయన్నారు. ‘2047 నాటికి వికసిత్‌ భారత్‌’ ఆశయాన్ని సాకారం చేసుకోవడానికి ‘సంస్కరణల భాగస్వామ్య చార్టర్‌’ రూపొందించుకుందామని మోదీ ప్రతిపాదించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement