India industry
-
ప్రైవేట్ పెట్టుబడులు వెల్లువెత్తాలి
న్యూఢిల్లీ: దేశంలో మరిన్ని పెట్టుబడులు, నవీన ఆవిష్కరణలకు భారత పారిశ్రామిక వర్గాలు తక్షణమే నడుం బిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో ప్రైవేట్ రంగం సైతం కీలక పాత్ర పోషించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వరుస బడ్జెట్ల ద్వారా పెట్టుబ డులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సైతం పెట్టుబడి వ్యయాన్ని భారీగా పెంచుతోందని గుర్తుచేశారు. శుక్రవారం ‘టెక్నాలజీ, రిఫామ్స్, ఫైనాన్స్ ఫర్ వికసిత్ భారత్’పై మొదటి పోస్ట్–బడ్జెట్ వెబినార్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. 11 ఏళ్ల క్రితం ప్రభుత్వ పెట్టుబడి వ్యయం రూ.2 లక్షల కోట్లుగా ఉండేదని, ఇప్పుడు అది రూ.12 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రైవేట్ పెట్టుబడులు వెల్లువెత్తేలా 2026–27 బడ్జెట్లో పలు ప్రకటనలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు, నైపుణ్యాలు కలిగిన భాగస్వాములు కలిసి కట్టుగా పనిచేస్తే సంస్కరణలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయన్నారు. కాగితంపై ప్రకటించినవి క్షేత్రస్థాయిలో విజయాలుగా నమోదు అవుతాయన్నారు. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ ప్రాధాన్య రంగాల గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రహదారులు, రైల్వేలు, ఓడ రేవులు, విమానా శ్రయాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఇంధన వ్యవస్థల్లో ప్రభుత్వం రికార్డు స్థాయిలో పెట్టుబడి వ్యయం చేస్తున్నట్లు తెలియజేశారు. ఆయా రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులకు చక్కటి అవకాశాలు ఉన్నాయన్నారు. ‘2047 నాటికి వికసిత్ భారత్’ ఆశయాన్ని సాకారం చేసుకోవడానికి ‘సంస్కరణల భాగస్వామ్య చార్టర్’ రూపొందించుకుందామని మోదీ ప్రతిపాదించారు. -
జనవరిలో ‘తయారీ’కి కొత్త ఆర్డర్ల బూస్ట్
న్యూఢిల్లీ: భారత్ మొత్తం పారిశ్రామికరంగంలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం జనవరిలో సానుకూల ఫలితాన్ని నమోదుచేసుకుంది. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జనవరిలో 56.5కి ఎగసింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. డిసెంబర్లో ఈ సూచీ 54.9గా (18 నెలల కనిష్టం) నమోదయ్యింది. ద్రవ్యోల్బణం భయాల ఉపశమనం, డిమాండ్ బాగుండడం, కొత్త ఆర్డర్లలో పురోగతి ఇందుకు ప్రధాన కారణంగా నిలిచినట్లు నెలవారీ సర్వే పేర్కొంది. కాగా, ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే పేర్కొంటారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. -
ప్రోత్సాహకాలు, మినహాయింపులకు ఇక చెల్లు
భారత్ పరిశ్రమకు ఆర్థికమంత్రి స్పష్టీకరణ న్యూఢిల్లీ: భారత పరిశ్రమకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కీలక సూచనలు చేశారు. ప్రోత్సాహకాలు, మినహాయింపులకు కాలం తీరిపోతోందని పేర్కొన్న ఆయన వ్యాపార నమూనాల్ని పటిష్టతను మెరుగుపరచుకోవాలని, తద్వారా పోటీ తత్వాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఆర్థికమంత్రి బుధవారం నాడు ఇక్కడ ‘ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ఇన్వెస్టర్స్ 2016 సదస్సు’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాపార విధానాల్లో సమర్థవంతమైన మార్పుల ద్వారా అందివస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని పరిశ్రమకు సూచించారు.


