ప్రజల సొమ్మును ప్రైవేట్‌కు ఇస్తే ఊరుకోం
● ఢిల్లీలో ధర్నా చేస్తాం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్‌రెడ్డి
ఆదోని టౌన్: ప్రజల సొమ్మును అప్పనంగా ప్రైవేట్ వారికి కట్టబెడతామంటే చూస్తూ ఉండే ప్రసక్తే లేదని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ఆదోని పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కొనసాగుతోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేయడంతో ప్రభుత్వమే రెండు సంవత్సరాల పాటు డాక్టర్లకు, సిబ్బందికి వేతనాలు చెల్లించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. పేద విద్యార్థులకు డాక్టర్ల విద్య దూరం చేయడంతో పాటు ప్రైవేట్ వారు ఆపరేషన్లు, ఓపీలు, వివిధ రకాలైన పరీక్షలకు ఫీజులు వసూలు చేస్తారన్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగభృతి, ప్రతి మహిళకు రూ.1500, అన్నదాత సుఖీభవ, బీసీ ఎస్సీ, మైనార్టీలకు 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ ఇస్తామన్న హామీలు తుంగలో తొక్కారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణలో కూటమి నేతలు మినహా మిగతా వారంతా భాగస్వాములయ్యారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా సేకరించిన 4.2 లక్షల సంతకాల ప్రతులతో ఈనెల 15న కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. వీటిని ఈనెల 18న రాష్ట్ర గవర్నర్‌కు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమర్పిస్తారన్నారు.ప్రైవేటీకరణను గవర్నర్ అడ్డుకోకపోతే సుప్రీంకోర్టులో పిల్ వేసి అవసరమైతే ఢిల్లీలో జాతీయ స్థాయిలో ధర్నా చేస్తామన్నారు. లేనిపక్షంలో కూటమి ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజలు నిలదీసే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు!
ఎన్నికల సమయంలో సాధ్యం కాని హామీలను గుప్పించి, అధికారంలోకి వచ్చాక మోసం చేసిన సీఎం చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్‌రెడ్డి, కౌన్సిలర్ రామలింగేశ్వరయాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ దేవదాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


