కనిపించకుండాపోయి.. టెన్షన్ పెట్టిన మహిళా కార్పొరేటర్ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ఆమె, ఆమె భర్త పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరగడంతో ముంబైలో నిన్నంతా హైడ్రామా నడిచింది. అయితే చివరకు ఆమె ఆచూకీ లభించడం.. స్పష్టమైన ప్రకటన చేయడంతో.. థాక్రే శివసేన ఊపిరి పీల్చుకుంది.
ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన తరఫున నెగ్గిన కార్పొరేటర్ సరితా మాస్కే హఠాత్తుగా కనిపించకుండా పోయారు. ఆమెతో పాటు ఆమె భర్త ఫోన్లు స్విచ్ఛాప్ రావడంతో ఏం జరగబోతోందా? అనే చర్చ నడిచింది. సరితకు షిండే వర్గంలోని ఎమ్మెల్యే దిలీప్ లాండేతో మంచి సంబధాలు ఉన్నాయి. దీంతో ఆమె షిండే గూటికి జంప్ అయ్యారనే భావించారంతా. ఈ తరుణంలో..
ఉద్దవ్ థాక్రే అనుచరుడు ఎమ్మెల్సీ మిలింద్ నర్వేకర్ రంగంలోకి దిగాడు. అర్ధరాత్రి ఆ జంట కోసం స్పెషల్ ఆపరేషన్ చేపట్టాడు. చివరకు వాళ్ల ఆచూకీ గుర్తించి.. తీసుకొచ్చి తన నివాసంలోనే రాత్రంతా ఆశ్రయం కల్పించారు. శుక్రవారం ఉదయం ఈ జంట మాత్రోశ్రీ(థాక్రే నివాసం)కి వెళ్లి ఉద్దవ్‌తో భేటీ కానున్నారు. ఆపై.. బేలాపూర్‌లోని కోంకణ్ భవన్‌లో మిగతా కార్పొరేటర్లను కలిసి అధికారిక నమోదు ప్రక్రియ(రికార్డుల్లోకి ఎక్కించడం.. దీని ద్వారా పార్టీ ఫిరాయించడానికి అవకాశం ఉండదు) పూర్తి చేయనున్నారు. అయితే..
సరితా మాస్కే చాందివాలి ప్రాంతం (వార్డు 157) నుంచి గెలిచారు. ఆమె BJP అభ్యర్థి ఆశా తాయడేను 14,749 ఓట్ల తేడాతో ఓడించారు. తాను పార్టీ మారతాననే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని.. ఎప్పుడూ ఉద్దవ్ థాక్రే వెంట ఉంటామని సరిత ఓ జాతీయ మీడియా వద్ద ప్రస్తావించారు. కనిపించకుండా పోయిన సరిత, ఆమె భర్త ఎక్కడ ఉన్నారన్నదానిపై మాత్రం మిస్టరీ కొనసాగుతోంది.

కార్పొరేటర్‌గా నెగ్గిన తర్వాత ఉద్దవ్ కలిసిన సరిత, ఆమె భర్త
దేశంలోనే రిచ్చెస్ట్ కార్పొరేషన్‌గా బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) పేరుంది. జనవరి 15న జరిగిన ఎన్నికల్లో.. బీజేపీ-షిండే శివసేన కూటమి (మహాయుతి) 227 స్థానాల్లో 118 కైవసం చేసుకుంది. తద్వారా.. 30 ఏళ్లుగా కొనసాగుతున్న థాక్రే కుటుంబ ఆధిపత్యానికి శుభం కార్డు వేసింది. ఇందులో బీజేపీ 89, షిండే శివసేన 29 స్థానాలు నెగ్గాయి. ఇక ఉద్ధవ్ శివసేన 65, రాజ్ ఠాక్రే ఎంఎన్‌ఎస్ 6 స్థానాలు గెలిచాయి.
అయితే.. మేయర్ ఎంపిక విషయంలో ఇంకా హైడ్రామానే కొనసాగుతోంది. షరతుల మీద మేయర్ పదవి తమకు అవకాశం ఇవ్వాలని షిండే సేన డిమాండ్ చేస్తుండడం.. ముంబై మేయర్ పదవి తమకూ దక్కే అవకాశాలు ఉన్నాయంటూ ఉద్దవ్ థాక్రే ప్రకటించడం అక్కడి రాజకీయాలను హీటెక్కింది. ఈ క్రమంలో ఏక్‌నాథ్ షిండే అప్రమత్తం అయ్యారు. తమ కార్పొరేటర్లు చేజారిపోకుండా.. బాంద్రాలోని ఓ హోటల్‌లో ఉంచారు. సాధారణంగా.. మేయర్ పదవి రోటేషన్ విధానంలో SC, ST, OBC, ఓపెన్ మరియు మహిళా వర్గాలకు కేటాయిస్తారు. అయితే 2026లో లాటరీ డ్రా ప్రకారం, ముంబై మేయర్ పదవి ఓపెన్ మహిళా వర్గానికి కేటాయించబడింది. దీంతో ఉత్కంఠ నెలకొంది.


