కర్ణాటకలో పవర్ పాలిటిక్స్‌కు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ భేటీలతో హైకమాండ్ పుల్‌స్టాప్ పెట్టిందని భావిస్తున్న వేళ.. ఈసారి కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. సీఎం సిద్ధరామయ్య సన్నిహితులతో డిప్యూటీ సీఎం శివకుమార్ వరస భేటీలు జరపుతుండడం.. వాటిపై అధిష్టానం సీరియస్‌గా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఆ ప్రచారంపై డీకే శివకుమార్ ఓపెన్ అయ్యారు.
కర్ణాటక కాంగ్రెస్ రాజకీయలపై జరుగుతున్న తాజా ప్రచారాలను సోమవారం మీడియా సాక్షిగా డీకే శివకుమార్ తోసిపుచ్చారు. సిద్ధరామయ్య, తాను అన్నదమ్ముల్లా పని చేస్తుంటే ఇంక కాంగ్రెస్‌లో చీలిక ఎందుకు ఉంటుందని అన్నారాయన. ‘‘సిద్ధరామయ్యతో నాకు 16 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఆ బంధం ఇక మీదట కూడా కొనసాగుతుంది. అన్నదమ్ముల్లా మేం మా పని చేసుకుంటూ పోతున్నాం. అలాంటప్పుడు పార్టీలో అంతర్గత విబేధాలు.. చీలికలు ఎందుకు వస్తాయి?. అధిష్టానం ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేస్తుంది??.. ఇది కేవలం.. మీడియా, బీజేపీ సృష్టిస్తున్న ఊహాగానాలే’’ అని అన్నారాయన.
సీఎం సిద్ధరామయ్యకు అత్యంత ఆప్తుడిగా పేరున్న మాజీ మంత్రి కేఎన్ రాజన్నతో ప్రత్యేకంగా భేటీ కావడంపై డీకే శివకుమార్ స్పష్టత ఇచ్చారు. ‘‘ఇందులో రాజకీయ కోణం ఏం లేదు. రాజన్న నాకు కూడా ఆప్తుడే. గతంలో ఎస్‌ఎం కృష్ణ హయాంలో ఆయనకు ఓ కీలక పదవి ఇప్పించా. నేను ఆయన్ని కలిసింది మర్యాదపూర్వకంగానే‘‘‘ అని అన్నారాయన. అలాగే.. కాంగ్రెస్‌లో ఏ నేతతోనూ తనకు విబేధాల్లేవని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
పవర్ షేరింగ్.. సీఎం సీటు కోసం ఢిల్లీలో చేసిన ప్రయత్నాలు.. ఈ ప్రయత్నాలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందన్న కథనాలపైనా డీకే రియాక్ట్ అయ్యారు. ‘‘నా ఢిల్లీ పర్యటనలేవీ రాజకీయ పరమైనవి కావు. ఉన్నత స్థాయి సమావేశాల్లో భాగంగానే జరిగాయి. బెంగళూరు మెట్రో ప్రాజెక్టు నిధుల కోసం, ఇతర అభివృద్ధి కోసమే నేను హస్తినకు వెళ్లా’’ అని అన్నారు. అయితే..
కర్ణాటక అధికార కాంగ్రెస్‌లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని పార్టీ సీనియర్ నేత వీఆర్ సుదర్శన్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఓ లేఖ రాశారు. ఈ విషయాన్నే డీకే వద్ద స్పందించగా.. ఆ లేఖ సారాంశం వేరని.. కాంగ్రెస్‌లో లుకలుకలు నెలకొన్నాయని బీజేపీ సృష్టించిన ప్రయత్నమే ఆ ప్రచారమని కొట్టిపారేశారాయన.


