బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మేయర్ పదవి ఎవరికి దక్కుతుందో ఇంకా తేలలేదు. ఒకవైపు మహాయుతి కూటమిలో ఏ పార్టీ తరపు ఎవరిని ఆ అదృష్టం వరిస్తుందో? అనే సస్పెన్స్ కొనసాగుతుండగా.. మరోవైపు ఏదైనా అద్భుతంగా జరిగి అనూహ్యంగా విపక్ష కూటమికి వెళ్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు అధికార కూటమిలో చర్చలు కొనసాగుతుండగానే.. ఈలోపు షిండే శివసేన హోటల్ రాజకీయాలకు తెర తీసింది.
ఏకనాథ్ శిండే నేతృత్వంలోని శివసేన ఒకవైపు తమ కార్పొరేటర్లను చేజారిపోకుండా(హార్స్ ట్రేడింగ్‌కు దూరంగా) హోటల్‌లో దాచింది. పేపర్ వర్క్ ద్వారా అఫీషియల్ ఫార్మాలిటీస్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తోంది. తద్వారా జంపింగ్‌లకు(ఫిరాయింపులకు) చెక్ పెట్టాలని చూస్తోంది. అదే సమయంలో.. 29 సీట్లతో మేయర్ పదవి కోసం మిత్రపక్షం బీజేపీతో చర్చలు జరుపుతూనే ఉంది.
మొన్నటిదాకా పవర్ షేరింగ్ ఫార్ములాను ప్రస్తావిస్తూ చెరో రెండున్నరేళ్లు మేయర్ పదవి కోసం డిమాండ్ చేసిన షిండే సేన.. ఇప్పుడు స్వరం మార్చింది. మేయర్ పదవి మొదటి సంవత్సరం మాత్రం కచ్చితంగా తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 23న బాలాసాహెబ్ థాక్రే శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని షిండే సేన భావిస్తోంది. ఈ క్రమంలో కూటమి తరఫున తొలి ఏడాది మేయర్ పదవి దక్కించుకోవడం ద్వారా థాక్రేకు ఘనంగా నివాళి సమర్పించాలని బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది.
ఇప్పటికే రేసులో యామిని జాధవ్, తృష్ణా విశ్వస్రావో, అమేయ్ ఘోలే వంటి యువ, అనుభవజ్ఞుల పేర్లను మేయర్ రేసు కోసం పరిశీలిస్తోంది. బీఎంసీలో దశాబ్దాలుగా శివసేన మేయర్ ఉన్నందున.. తమ వర్గమే అసలు శివసేన అని నిరూపించుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ అని ఏక్‌నాథ్ షిండే భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే..
ఇప్పటివరకు తమ పార్టీ తరఫున దేశ వాణిజ్య నగరానికి మేయర్ లేని కారణంగా.. రాజకీయంగా తమ ఆధిపత్యాన్ని చూపించడానికి దక్కిన అవకాశాన్ని(మేయర్ పదవి) చేజార్చుకోవాలని బీజేపీ అనుకోవడం లేదు. ఈ పాయింట్ మీద షిండే సేనపై ఒత్తిడి పెట్టాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయాలను ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో.. కార్పొరేటర్లు చేజారిపోకుండా వ్యూహాన్ని అమలు చేస్తోంది. మేయర్ ఎన్నికలు 8–10 రోజుల్లో జరిగే అవకాశం ఉండటంతో తమ కార్పొరేటర్లను నగరం వీడరాదని ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం అవసరమైతే ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచింది.
ఇక.. విపక్షం కూడా మేయర్ పదవి కోసం తన వంతు ప్రయత్నాల్ని ఉధృతం చేసింది. 277 సభ్యులున్న ముంబై కార్పొరేషన్‌లో మేయర్ పదవి కోసం కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 114. అధికార మహాయుతి కూటమిలో బీజేపీ, షిండే శివసేన కలయితోనే 118 అవుతుంది. అంటే నాలుగు సీట్లు ఎక్కువనే ఉన్నాయి. ఇక విపక్ష కూటమిలో.. ఉద్ధవ్ శివసేన, MNS, NCP (శరద్ పవార్), కాంగ్రెస్, AIMIM, SP కలయికతో మొత్తం కలిపినా 106 సీట్లు అవుతున్నాయి. అంటే మ్యాజిక్ ఫిగర్‌కు 8 తక్కువగా ఉంది. ఈ క్రమంలోనే షిండే వర్గానికి గాలం వేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
‘‘ఒకసారి పార్టీని వదిలిన వారు.. మళ్లీ హ్యాండ్ ఇవ్వొచ్చు’’ అంటూ ఉద్దవ్ శివసేన వర్గం అధినేత, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యానించడం.. ‘‘ఎంత హోటల్‌లో దాచినా చేరాల్సిన సందేశాలు చేరాల్సిన వాళ్లకు టైంకి చేరతాయి. దేవుడు తల్చుకుంటే మేయర్ మనదే అవుతుంది’’ అంటూ ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ముంబై ఎన్నికల ఫలితాలు:
బీజేపీ - 89 సీట్లు
షిండే శివసేన – 29 సీట్లు
ఉద్ధవ్ శివసేన(యూబీటీ) 65 + NCP (శరద్ పవార్)1+ఎంఎన్‌ఎస్ (MNS) 6 సీట్లు మొత్తం 72 సీట్లు
కాంగ్రెస్ – 24, ఎంఐఎం – 8, సమాజ్‌వాదీ పార్టీ – 2
మొత్తం హౌస్: 227 సభ్యులు
మెజారిటీ మార్క్: 114
బీజేపీ+షిండే సేన: 118 (మెజారిటీ కంటే 4 ఎక్కువ).. అజిత్ పవార్ NCP మద్దతు గనుక కలిపితే ముగ్గురు కార్పొరేటర్లు కలిస్తే సంఖ్య 121
అయితే.. షిండే సేన వర్గం కార్పొరేటర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడమంటూ చెబుతున్నారు. మేం ఎన్నికలు సక్రమంగా గెలిచాం. మాపై ఎవరూ ఒత్తిడి చేయకూడదు. ప్రలోభాలకు లొంగే ప్రసక్తే లేదు అంటూ రాజు వాఘ్మారే అనే కార్పొరేటర్ వ్యాఖ్యలు చేశారు. అయితే రకరకాల ఊహాగానాలు, ప్రచారాల వేళ.. మేయర్ పదవి కూటమిదేనని, అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, తాను, షిండే, ఇతరులు కూర్చుని నిర్ణయం తీసుకుంటామని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు.


