తీవ్ర నిరసనలు, అ శాంతితో భగ్గుమంటున్న బంగ్లాదేశ్‌లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నేషనల్ సిటిజన్ పార్టీకి చెందిన నేతపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆయనను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.
బంగ్లాదేశ్ ప్రస్తుతం నిరసనలతో అట్టుడుకుతుంది. కొద్దిరోజుల క్రితం ఆదేశానికి చెందిన రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మరణం ఆ దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ఉస్మాన్ మృతితో ఆయన మద్దతుదారులు చెలరేగిపోయారు. ఢాకాలో మీడియా హౌజ్‌లపై దాడి చేస్తూ విధ్వంసం సృష్టించారు. అంతే కాకుండా దైవదూషణ చేశారనే నెపంతో ఓ హిందూ యువకుడిని అత్యంత దారుణంగా కొట్టిచంపారు. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం ఆదేశంలో నేషనల్ సిటిజన్ పార్టీకి చెందిన మహమ్మద్ మోతేలాబ్ సికిదార్ అనే నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
దీంతో ఆయనను హుటాహుటీన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అక్కడి పోలీస్ అధికారి మాట్లాడుతూ " మహమ్మద్ మోతేలాబ్ సికిదార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు ఈ రోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బుల్లెట్లు ఆయన చెవిని చీల్చుకుంటూ వెళ్లాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎటువంటి ప్రమాదం లేదు" అని తెలిపారు.
మహమ్మద్ మోతేలాబ్ సికిదార్ నేషనల్ సిటిజన్ పార్టీకి చెందిన నాయకుడు. శ్రామిక్ శక్తి విభాగంలో ఈయన సెంట్రల్ ఆర్గనైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఖులానా మెట్రోపాలిటన్ యూనిట్‌లో ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయ నాయకులపై కాల్పులు ఆ దేశంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.


