
ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. పుతిన్‌కు 73వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారత్-రష్యా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్‌ను స్వాగతించడానికి ఎదురు చూస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి తాజా పరిణామాలను మోదీకి పుతిన్ వివరించారు. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం కావాలన్న భారత స్థిరమైన వైఖరిని మోదీ గుర్తు చేశారు.
పుతిన్ ఈ ఏడాది డిసెంబర్ ఐదారు తేదీలలో భారత్‌కు వచ్చి.. ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునే అవకాశం ఉందని సమాచారం. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా న్యూఢిల్లీపై శిక్షాత్మక సుంకాలను విధించిన దరిమిలా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్న తరుణంలో పుతిన్, ప్రధాని మోదీల భేటీ కీలకంగా మారనుంది. రష్యా అధ్యక్షుడు ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీని కలుసుకున్న సంగతి తెలిసిందే.
మరోవైపు, భారత్‌తో వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు అధినేత పుతిన్ ఇటీవల స్పష్టమైన సంకేతాలిచ్చారు. భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల దిగుమతులను భారీగా పెంచుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక విధానం రూపొందించాలని రష్యా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. రష్యా నుంచి భారత ప్రభుత్వం భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు తగ్గిపోయి, వాణిజ్యంలో సమతూకం ఏర్పడేలా చర్యలు తీసుకోవడానికి పుతిన్ సిద్ధమయ్యారు. అందులో భాగంగానే భారత్ నుంచి దిగుమతులు పెంచాలని నిర్ణయించారు. గురువారం(అక్టోబర్ 2) వాల్డాయ్ ప్లీనరీలో పుతిన్ ప్రసంగించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఇండియాలో పర్యటించబోతున్నానని, ఇందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. తనకు మంచి మిత్రుడు, విశ్వసనీయ భాగస్వామి నరేంద్ర మోదీతో సమావేశం కాబోతున్నానని వెల్లడించారు.
ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన సమతూకం కలిగిన, తెలివైన నాయకుడు అని కొనియాడారు. భారతదేశ ప్రయోజనాల కోసం మోదీ నిరంతరం శ్రమిస్తుంటారని వ్యాఖ్యానించారు. మోదీ నేతృత్వంలో జాతీయవాద ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందన్నారు. మోదీతో సమావేశమైనప్పుడు తాను ఎంతో సౌకర్యవంతంగా ఉన్నట్లు భావిస్తానని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు సహకరించడం మానుకోవాలని అమెరికాను పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులు సరఫరా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చిచెప్పారు.