
ఉగ్రవాదంపై పోరాటం మానవత్వం పట్ల మన బాధ్యత
ప్రాంతీయ అభివృద్ధికి అనుసంధానం అత్యంత కీలకం
ఎస్సీఓ సదస్సులో మోదీ ఉద్ఘాటన
తియాంజిన్: షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) పట్ల భారత్ వైఖరి, విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఎస్ అంటే సెక్యూరిటీ(భద్రత), సీ అంటే కనెక్టివిటీ(అనుసంధానం), ఓ అంటే అపర్చునిటీ(అవకాశం) అని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశ అభివృద్ధికైనా భద్రత, శాంతి, స్థిరత్వమే పునాది అని వెల్లడించారు. ప్రపంచ దేశాల పురోగతికి ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం ఎన్నో సవాళ్లు విసురుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ఉగ్రవాదంపై పోరాటం చేయడం మానత్వం పట్ల మన బాధ్యత అని సూచించారు. చైనాలోని తియాంజిన్‌లో ఎస్సీఓ సదస్సులో రెండో రోజు సోమవారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రాంతీయ అభివృద్ధికి అనుసంధానం అత్యంత కీలకమని చెప్పారు. అనుసంధానం దిశగా జరిగే ప్రతి ప్రయత్నమూ ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించేలా ఉండాలని సూచించారు. ఎస్సీఓ చార్టర్‌లోని మూలసూత్రాల్లో ఇది కూడా ఒక భాగమేనని గుర్తుచేశారు.
కాలం చెల్లిన విధానాలు వద్దు
ఎస్సీఓ కింద ‘సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్’ ఏర్పాటు చేసుకుందామని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. ఘనమైన మన ప్రాచీన నాగరికతలు, కళలు, సాహిత్యం, సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపై పరస్పరం పంచుకోవడానికి ఈ ఫోరమ్ తోడ్పడతుందని అన్నారు. దక్షిణార్ధ గోళ దేశాలు(గ్లోబల్ సౌత్) మరింత వేగంగా ప్రగతి సాధించాలని పిలుపునిచ్చారు. కాలం చెల్లిన విధానాలతో అనుకున్న లక్ష్యం సాధించలేమని చెప్పారు. ఇంకా వాటినే నమ్ముకొని ఉండడం భవిష్యతు తరాలకు అన్యాయం చేయడమే అవుతుందని అభిప్రాయపడ్డారు.
గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని విధానాలు రూపొందించుకోవాలని సూచించారు. భారతదేశ ప్రగతి ప్రయాణాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంస్కరణ, పనితీరు, మార్పు అనే మంత్రంతో తమదేశం ముందుకు సాగుతోందన్నారు. విస్తృత స్థాయిలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, దీనివల్ల జాతీయ అభివృద్ధికి, అంతర్జాతీయ సహకారానికి నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. భారత్ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామిగా మారాలంటూ ఎస్సీఓ సభ్య దేశాలను మోదీ ఆహా్వనించారు.
ముష్కరులను పోషించడం మానుకోవాలి
ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం కొన్ని దేశాలు ఇకనైనా మానుకోవాలని ప్రధాని మోదీ పరోక్షంగా పాకిస్తాన్‌కు హితవు పలికారు. ముష్కర మూకలను పెంచిపోíÙస్తే మొత్తం మానవళికి ముప్పు తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదం అనేది ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదని అన్నారు. తాము క్షేమంగా ఉన్నామని ఏ ఒక్కరూ అనుకోవడానికి వీల్లేదన్నారు. కలిసికట్టుగా పోరాడితేనే ఉగ్రవాదం అంతమవుతుందని ఉద్ఘాటించారు.
అల్‌ఖైదా, అని అనుబంధ గ్రూప్‌లపై యుద్ధం ప్రారంభించామని చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడిని కూడా ప్రధాని ప్రస్తావించారు. ఇది కేవలం భారత్‌పై జరిగిన దాడి కాదని, మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్క దేశానికీ, ప్రతి పౌరుడీకి ఒక సవాల్ అని పేర్కొన్నారు. పహల్గాం దాడి సమయంలో భారత్‌కు అండగా నిలిచిన దేశాలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.