డేంజరస్‌ చైనాతో.. దోస్తీయా? | Donald Trump comments on India and Russia and China | Sakshi
Sakshi News home page

డేంజరస్‌ చైనాతో.. దోస్తీయా?

Sep 6 2025 1:36 AM | Updated on Sep 6 2025 1:36 AM

Donald Trump comments on India and Russia and China

భారత్, రష్యాపై ట్రంప్‌ రుసరుసలు

డ్రాగన్‌ దుష్ట కౌగిలికి దాసోహం అయ్యాయంటూ భగ్గు 

కొత్త పొత్తులు ఎంతకాలమో చూద్దామంటూ సవాళ్లు 

ఎస్‌సీఓ ఫొటో షేర్‌చేస్తూ నిషూ్టరాలు 

ట్రంప్‌నకు దీటుగా బదులిస్తున్న రష్యా, చైనా 

విక్టరీ పరేడ్‌ వేదికగా చైనా బలప్రదర్శన 

ఉక్రెయిన్‌లోకి వచ్చే ఏ దేశమైనా మా శత్రువే: పుతిన్‌

చైనాకు రష్యా, భారత్‌ సన్నిహితం కావటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భగ్గుమంటున్నారు. దుష్ట చైనాతో చేతులు కలుపుతారా? అంటూ రుసరుసలాడుతున్నారు. చైనా అంధకారంలోకి మీరూ పడిపోతున్నారంటూ శాపనార్ధాలు పెడుతున్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశంలో మోదీ, పుతిన్, జిన్‌పింగ్‌ కలిసి ఉన్న ఫొటోను సోషల్‌మీడియాలో షేర్‌చేస్తూ అక్కసు వెళ్లగక్కారు. మరోవైపు అమెరికాకు దీటుగా చైనా తన సైనిక, ఆయుధ శక్తిని ప్రదర్శిస్తుంటే.. ఉక్రెయిన్‌లోకి ఏ ఇతర దేశం బలగాలు వచ్చినా దాడి చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించారు.

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరింపులు.. ధీటుగా చైనా, రష్యా సవాళ్లతో ప్రపంచం ఉద్రి­క్తంగా మారుతోంది. మధ్యేమార్గం అనేది మా­యమై.. ప్రపంచం రెండు ముక్కలుగా చీలుతోంది. అమెరికా బెదిరింపులకు గురైనవారిని తాను కాపాడుతాను అన్నట్లుగా చైనా తన సైనిక బలాన్ని ప్రదర్శించటంతో రెండు ప్రపంచ మహాశక్తులు యుద్ధానికి ఎదురెదురుగా నిలబడినట్లయ్యింది.

ఈ అసాధారణ పరిణామానికి ఈసారి భారత్‌ కేంద్ర బింధువుగా, బాధితురాలిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల చైనాలో నిర్వహించిన షాంఘై సహకార సమాఖ్య (ఎస్‌సీఓ) సమావేశంలో కనిపించిన ఒకే ఒక్క దృశ్యం ఇప్పుడు ప్రపంచ దృక్పథాన్ని మార్చివేస్తోంది. 

ట్రంప్‌ నిష్టూరాలు 
ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యాను లొంగదీసుకునేందుకు భారత్‌ను వాడుకోవాలని భంగపడి.. సుంకాల పేరుతో బెదిరింపులకు దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఎస్‌సీఓ సమావేశంపై భయపడుతూనే నిషూ్టరాలు ఆడారు. ఆ సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటోను తన సొంత సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌ సోషల్‌లో షేర్‌ చేస్తూ భారత్, రష్యాను తాము కోల్పోయామని రాసుకొచ్చారు.

‘చూడబోతే మేము అంధకార అగాధమైన చైనాకు భారత్, రష్యాలను కోల్పోయినట్లు కనిపిస్తోంది. వారి భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’అని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. దుష్ట చైనాతో చేతులు కలిపితే అంధకారంలోకి వెళ్లినట్లేనని భావాత్మకంగా చెప్పారు. అదే సమయంలో తన దారికి తెచ్చుకోవాలనుకున్న రష్యా, భారత్‌లు తన ప్రత్యర్థి అయిన చైనా వైపు వెళ్లిపోయాయన్న భయం కూడా ఆయన మాటల్లో కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు.  

యుద్ధమా? శాంతా? 
ప్రపంచంపై అమెరికా ఆధిపత్యానికి ముగింపు పలికే సుముహూర్తం ఇదేనని చైనా భావిస్తోంది. ఈ నెల 3న ఆ దేశం విక్టరీ పరేడ్‌లో చేసిన బలప్రదర్శన ప్రపంచానికి ఈ అంశంలో స్పష్టమైన సందేశం ఇచ్చింది. అమెరికా పేరు ప్రస్తావించకుండానే ‘శాంతియా? యుద్ధమా?’తేల్చుకోవాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ స్పష్టమైన హెచ్చరిక జారీచేశారు. ఆ సమావేశానికి అమెరికా ఆగర్భ శత్రువులైన ఉత్తరకొరియా, ఇరాన్‌ దేశాల అధినేతలు కూడా హాజరయ్యారు. అమెరికా బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, కాపాడేందుకు తాను ఉన్నానన్న భావన జిన్‌పింగ్‌ ప్రకటనలో కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు.

జిన్‌పింగ్‌ ప్రకటనకు కొనసాగింపు అన్నట్లు­గా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా అలాంటి ప్రకటనే చేశారు. ఉక్రెయిన్‌తో ఏ దేశం తన బలగాలను మోహరించినా వాటిపై దాడులు చేస్తామని శుక్రవారం హెచ్చరిక జారీచేశారు. ఉక్రెయి­న్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గురువారం యూరోపియన్‌ దేశాధినేతలతో సమావేశమై సైనిక మద్దతు కోరిన నేపథ్యంలో పుతిన్‌ ప్రకటన సంచలనంగా మారింది.

ఎందు­కంటే అమెరికాతోపాటు దాదాపు యూరప్‌ దేశాల­న్నీ నాటోలో భాగస్వాములుగా ఉన్నాయి. ఒకవేళ నా­టో బలగాలు ఉక్రెయిన్‌లోని అడుగుపెడితే.. వాటి­తో ముఖాముఖి యుద్ధానికి సిద్ధమని పుతి­న్‌ తేల్చి చెప్పారు. దీంతో ప్రాంతీయ ఘర్షణలన్నీ కలిసి నిర్ణయాత్మక ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? అన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.  

భారతే కీలకం 
దశాబ్దాలుగా మధ్యేవాద విధానంతో ప్రపంచ ప్రధాన శక్తులన్నింటితో సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తున్న భారత్‌.. ప్రస్తుతం ఎటో ఒకవైపు మొగ్గాల్సిన సంకట స్థితిలో పడింది. తన ప్రమేయం లేకుండానే అమెరికా– చైనా శక్తుల మధ్య కేంద్ర బింధువుగా, బాధితురాలిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. భారత్‌ జోక్యం చేసుకుంటేనే రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదేపదే వాదిస్తున్నారు. అందుకు భారత్‌ స్పందించకపోవటంతో భారత వస్తువులపై 50 శాతం ప్రతీకార సుంకాలు విధించారు. దీంతో అనివార్యంగానే మనదేశం.. చైనా, రష్యాకు మరింత దగ్గర కావాల్సి వ­స్తోం­దనే అంచనాలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు అమెరికాను దెబ్బకొట్టాలంటే చైనా, రష్యాలకు కూడా భారతే కీలకంగా మా­­రింది. ఎస్‌సీఓ సమావేశానికి 10 సభ్య దేశాధినేతలు, మరికొన్ని ఆహా్వనిత దేశాల నేతలు విచ్చేసినా.. అందరి దృష్టి భారత ప్రధాని నరేంద్రమోదీపైనే కేంద్రీకృతమైంది. ఈ సమావేశం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై సొంత దేశంలో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. భారత్‌ను అనవసరంగా దూరం చేసుకున్నామన్న బాధ ఆ విమర్శల్లో కనిపిస్తోంది.

అయి­తే, చైనాతో భారత సంబంధాలు తక్షణం గొప్పస్థాయికి వెళ్తాయన్న నమ్మకం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సరిహద్దు సమస్యే భారత్‌–చైనా దైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రధాన అడ్డంకి అన్న చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ మాటలను గుర్తుచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement