హతవిధి.. పాక్‌ ప్రధానికి ఘోర పరాభవం! | SCO 2025: Great Insult to Pak PM Shehbaz Sharif Social Media Trollings Viral | Sakshi
Sakshi News home page

హతవిధి.. పాక్‌ ప్రధానికి ఘోర పరాభవం!

Sep 1 2025 4:51 PM | Updated on Sep 1 2025 5:02 PM

SCO 2025: Great Insult to Pak PM Shehbaz Sharif Social Media Trollings Viral

2025లో చైనా తియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు గురించి ప్రపంచమంతా ఇప్పుడు చర్చించుకుంటోంది. ట్రంప్‌ టారిఫ్‌ వార్‌, ఉక్రెయిన్‌ శాంతి చర్చల అంశాలతో పాటు పహల్గాం దాడి విషయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా.. భారత దేశానికి మద్దతుగా సదస్సులో పాల్గొన్న దేశాలు తీర్మానం సైతం చేయడం ప్రధానంగా నిలిచాయి. అయితే.. 

ఈ సదస్సు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చిందన్న చర్చ జోరుగా నడుస్తోంది. అందుకు ఈ సమ్మిట్‌లో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు కారణంగా కాగా.. వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌ చేస్తూ పాక్‌ ప్రధానిని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు.  

షరీఫ్ అంతర్జాతీయంగా అవమానానికి గురయ్యారన్నది ఆ పోస్టుల సారాంశం. అందుకు కారణం లేకపోలేదు.. వేదికపై ఆతిథ్య దేశాధినేత సహా మిగతా ప్రపంచాధినేతలెవరూ ఆయన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కాదు కాదు.. అసలు పట్టన్నట్లు వ్యవహరించడమే పెద్దగా హైలైట్‌ అయ్యింది. అవి ఒక్కొక్కటిగా పరిశీలిస్తే.. 

భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్‌ ప్రధాని షరీఫ్‌ను అసలు పట్టించుకోలేదు. మోదీ-పుతిన్‌ ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా.. షరీఫ్‌ బిక్కముఖం వేసుకుని పలకరించలేదే అన్నట్లు చూస్తూ ఉండిపోయారు. పైగా మోదీ తన ప్రసంగంలో పహల్గాం దాడి గురించి మాట్లాడిన ఆయన.. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయంటూ పాక్‌నే ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగం సాగినంత సేపు అక్కడే ఉన్న షరీఫ్‌ ముఖంలో నెత్తురు చుక్క కనిపించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది!. 

ఇక.. పుతిన్‌ను కలవాలన్న షరీఫ్‌ ఉత్సాహం.. అవమానాన్నే మిగిల్చింది. సదస్సు ముగిశాక.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కరచలనం చేయడానికి షరీఫ్‌ కంగారుగా పరిగెత్తుతూ కనిపించారు. పుతిన్‌ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడంతో షరీఫ్‌ మురిసిపోయారు. ఆ సమయంలో పక్కనే ఉన్న చైనా అధ్యక్షుడు  జిన్‌పింగ్.. షరీఫ్‌ను చూసి పూర్తిగా పట్టన్నట్లు ప్రవర్తించారు. అయితే కాసేపటికే పుతిన్‌ మరోసారి ఆయన్ని పలకరించారు.

 

 ఇక సదస్సు ముగిసిన తర్వాత..  గ్రూప్‌ ఫొటో సమయంలోనూ షరీఫ్‌కూ పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. మోదీకి ఎక్కడో ఎనిమిది మంది దేశాధినేతల అవతల నిలబెట్టారు. అంతెందుకు.. చైనా, పాకిస్తాన్‌కు దశాబ్దాలుగా మిత్ర దేశం అయినప్పటికీ.. ఈ సదస్సులో షరీఫ్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కొసమెరుపు. దీంతో.. షాంగై సదస్సు ఏమోగానీ పాక్‌ ప్రధాని పరిస్థితి దయనీయంగా, దౌర్భాగ్యంగా కనిపించిందని కొందరు నెటిజన్స్‌ అభివర్ణించారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకువేసి.. పుతిన్‌-మోదీ-జిన్‌పింగ్‌ భేటీ అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి, ఇటు పాక్‌ షరీఫ్‌కు పీడకలను మిగిల్చే అవకాశం ఉందంటూ జోకులు పేలుస్తున్నారు. 

ట్విటర్‌, రెడ్డిట్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌ లాంటి ఫేమస్‌ ఫ్లాట్‌ఫారమ్‌లలో మీమ్స్‌, ట్రోలింగ్ ముంచెత్తాయి. మిత్ర హస్తం అవతలి వాళ్లు అందించాలే తప్ప.. అడుక్కోకూడదు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. పుతిన్‌తో కరచలనం కోసం ఓ బిచ్చగాడిలా ప్రవర్తించారంటూ పాక్‌ ప్రజలే ఆయన్ని దెప్పి పొడుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాక్‌కు, ఆ దేశ ప్రధానికి ఉన్న ప్రాధాన్యం ఇదేనా? అనే చర్చా జోరుగా నడుస్తోంది. అదే సమయంలో పాక్‌ మీడియా షరీఫ్‌ను గ్లోబల్‌ పవర్‌హౌజ్‌ అంటూ కితాబిస్తూ ప్రచారం చేస్తుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement