
విశ్లేషణ
భారతదేశంపై సుంకాలను అమెరికా అధ్యక్షుడు 50 శాతానికి పెంచిన ఐదు రోజులకు జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశాల నుంచి దేశానికి అన్నీ మంచి శకునాలే లభించాయి. చైనా, రష్యాలతో సంబంధాలు మరింత బలో పేతమయ్యాయి.
ఈ కొత్త స్థితి వెంటనే అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్, ఆయన వాణిజ్య సలహాదారు పీటర్ నవారోలు,ఇండియాపై చేసిన అనుచితమైన వ్యాఖ్య లలో ప్రతిఫలించింది. ప్రధాని మోదీ తమపై కొంత అలిగినా తిరిగి వైఖరి మార్చుకోగలరని వారు చివరి వరకూ ఆశించారు. ఆయనకు తాము తప్ప గత్యంతరం లేదనుకున్నారు. కానీ, మోదీ వైఖరి మరింత దృఢంగా మారినట్లు తియాన్‌జిన్‌లో అడుగడుగునా కనిపించింది.
అర్థాలు–అంతరార్థాలు
ఈ సందర్భంగా మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్న మాటలేమిటో యథాతథంగా చూడటం అవసరం. జిన్‌పింగ్‌తో సమావేశం అనంతరం మోదీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ, రెండు దేశాలూ అభివృద్ధిలో భాగస్వా ములే తప్ప ప్రత్యర్థులు కాదనీ, భిన్నాభిప్రాయాలు వివాదాలుగా మారరాదనీ భావించినట్లు పేర్కొన్నది. పరస్పర గౌరవం, ఉభయుల ప్రయోజనాలు, ఇరువురి సున్నితమైన మనోభావాల గుర్తింపు అవసర మన్నది.
ఇటువంటి అవగాహనలు 21వ శతాబ్దపు ధోరణులకు అను గుణంగా బహుళ ధ్రువ ప్రపంచంతోపాటు బహుళ ధ్రువ ఆసియా రూపు తీసుకునేందుకు ఆవశ్యకమని పేర్కొన్నది. చైనాతో సంబంధాల మెరుగుదల నిరుటి కజాన్–బ్రిక్స్ సమావేశాల నుంచే మొద లైందని పలుమార్లు గుర్తు చేస్తున్న మోదీ, ఇపుడు రెండు దేశాల మధ్య ‘శాంతి, సుస్థిరతల వాతావరణం ఏర్పడింద’న్నారు.
జిన్‌పింగ్ మాటలను కూడా కొంత చెప్పుకొన్న తర్వాత ఇరువురి అభిప్రాయాల అర్థాలు, అంతరార్థాలు చూద్దాము: రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 80 సంవత్సరాల తర్వాత కూడా ప్రచ్ఛన్న యుద్ధ కాలపు మనస్తత్వం, ఆధిపత్య ధోరణి, ప్రొటెక్షనిజం కొనసాగుతున్నాయి. కొద్ది దేశాల అంతర్గత విధానాలను ఇతరులపై రుద్దకూడదు.
అంతర్జాతీయ నియమ నిబంధనలన్నవి పరీక్షాత్మక దశకు చేరుకున్నాయి. సమ్మిళితమైన ఆర్థిక ప్రపంచీకరణ అవసరం. భారతదేశం, చైనాలు పరస్పర విశ్వాసాన్ని బలపరచుకుని, పరస్పర అభివృద్ధికి అవకాశాలను పెంచుకోవాలి. వ్యూహాత్మకమైన, దీర్ఘ కాలిక దృక్కోణంతో వ్యవహరించాలి.
నాయకులిద్దరూ చెప్పినవి ఇంకా ఉన్నాయిగానీ, అన్నీ ఈ ప్రధా నమైన మాటల చుట్టూ తిరిగేవే. సరిహద్దు వివాదాన్ని, పాకిస్తాన్ అంశాన్ని ప్రధానంగా ముందుకు తెచ్చుకుని అభివృద్ధి సహకార అవకాశాలను విస్మరించవద్దన్నది మొదటి అంతరార్థం. ఇరువురి సున్నిత మనోభావాలన్నది ఇందుకు సంబంధించినదే గాక, ఆసియాతో పాటు ప్రపంచంలోనూ ఒక శక్తిగా ఎదగజూస్తున్న ఇండి యాకు ఆటంకాలు కల్పించరాదనే అర్థం వస్తుంది.
ఇక్కడ, బహుళ ధ్రువ ప్రపంచం అన్నమాటతో పాటు, బహుళ ధ్రువ ఆసియా అనే మాటను కొత్తగా ఉపయోగంలోకి తేవటం గమనించదగ్గది. అనగా, చైనాయేగాక ఇండియా కూడా ఒక ధ్రువమనేది గుర్తించటమన్న మాట. 21వ శతాబ్దపు ధోరణులలోకి అది కూడా వస్తుంది.
సుంకాలకు ముందు నుంచే...
చైనాతో సంబంధాల మెరుగుదల కజాన్ నుంచే మొదలైన మాట నిజమే అయినా ఆ విషయాన్ని మోదీ పదేపదే ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు? కేవలం ట్రంప్ సుంకాలు అందుకు కారణమని అమెరికాలో, బయటా జరుగుతున్న ప్రచారం నిజం కాదనీ, భారత దేశం తన ప్రయోజనాల కోసం స్వతంత్ర నిర్ణయాలు గతం నుంచే తీసుకుంటున్నదనీ ప్రకటించేందుకు!
చైనా అధ్యక్షుని ఉద్దేశం... రెండు దేశాల మధ్య సరిహద్దుల వంటి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, అందుకు పరిష్కార ప్రయ త్నాలు జరుగుతున్నందున, అందుకు బందీ కాకుండా, పరస్పర అభివృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టాలని! అందుకు అనుగుణంగా తాము భారతదేశంతో కలిసి పనిచేయగలమనటం! ఆయన ఉప యోగించిన డ్రాగన్, ఏనుగు కలిసి నాట్యం చేయటమనే మాటలో ఈ అంతరార్థాలన్నీ కనిపిస్తాయి.
మారుతున్న పరిస్థితులు, అందు వల్ల రెండు దేశాలకు కలుగుతున్న సమస్యలు, వాటి నుంచి బయట పడేందుకుగానీ, భవిష్యత్తులో అభివృద్ధి కోసం గానీ అవసరమైన వేమిటో రెండు దేశాల నాయకులకు స్పష్టమైన అవగాహన ఏర్పడి నట్లు కనిపిస్తున్నది. రెండు దేశాల మధ్య చాలా కాలంగా నిలిచి పోయిన ఒప్పందాలు ఒక్కటొక్కటిగా ఇప్పటికే జరుగుతుండటం తెలిసిందే.
స్పష్టమైన సందేశం
రష్యా విషయానికి వస్తే, ప్రధాని మోదీ రష్యా అధ్యక్షునితో జరిపిన సమావేశం, అనూహ్యంగా ఆయన కారులో ప్రయాణించటం, హోటల్‌కు చేరిన తర్వాత కూడా కారులోనే ఉండి ముప్పావు గంట సేపు చర్చించి ఆ ఫొటోను పోస్ట్ చేయటం, బయట కూడా పుతిన్‌తో కలిసి వెళ్లి జిన్‌పింగ్‌తో చేసిన సంభాషణల వంటివన్నీ ఇటు భారతీయులకు, ప్రపంచ దేశాలకు, అటు అమెరికా శిబిరానికి పంపవలసిన సందేశాలనే పంపాయి.
దేశ ప్రయోజనాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగటమే గాక, ఉభయుల మధ్యగల చిరకాలపు సాన్నిహిత్యం ఇంకా బలపడగలదని, సుంకా లకు వెరవబోమనే సంకేతాలను భారత ప్రధాని అమెరికా శిబిరానికి 50 శాతం నాటి ముందుకన్నా బలంగా పంపటం విశేషం. ఇప్పటి కైనా వివేకం కలిగితే ఆ శిబిరం చేయవలసింది తమ తీరును అన్ని విధాలా మార్చుకుని, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వ్యవహరించటం!
షాంఘై సంస్థ నిజానికి రక్షణ, తీవ్రవాదం అంశాలకు సంబంధించినది. కానీ, మొదటిసారిగా తియాన్‌జిన్‌లో ఆర్థిక, రాజకీయ, భౌగోళిక వ్యూహాల గురించి చర్చించటం మారుతున్న పరిస్థితులకు, పాశ్చాత్య ప్రపంచానికి బయటి దేశాల ఆందోళనలు, అవసరాలకు అద్దం పడుతున్నది. ఈ విధంగా ‘బ్రిక్స్’కు అదనంగా మరొక సంస్థ క్రమంగా బలపడుతున్నది.
కజాన్‌లో వలెనే తియాన్‌జిన్‌లోనూ పాశ్చాత్య ఆధిపత్య వ్యతిరేకత, బహుళ ధ్రువ ప్రపంచ నిర్మాణం, డాలర్‌ను క్రమంగా బలహీనపరచటం, ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థలు, ప్రస్తుతం గల అంతర్జాతీయ వ్యవస్థలపై అమెరికా కూటమి నియంత్రణ స్థానే సంస్కరణలతో ప్రజాస్వామికీకరణ, వర్ధమాన దేశాల మధ్య అవగాహనలను, మైత్రీ సహకారాలను బలపరచుకోవటం ప్రధానాంశాలయ్యాయి.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు