
పరస్పరం విశ్వాసంతో విభేదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయం
ప్రధాని మోదీ, మంత్రి జై శంకర్‌లతో కెనడా మంత్రి అనితా ఆనంద్ సమావేశం
న్యూఢిల్లీ: వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, ఇంధన రంగాల్లో సహకారం బలోపేతానికి భారత్, కెనడాలు రోడ్ మ్యాప్ ఖరారు చేసుకున్నాయి. సోమవారం కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌లతో చర్చలు జరిపారు. 2023లో సిక్కు ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యానంతరం రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడమే లక్ష్యంగా ఆమె భారత్‌కు రావడం తెల్సిందే.
రెండు దేశాల వ్యూహాత్మక ప్రాముఖ్యతలు, ప్రపంచ ఆర్థిక పరిణామాల ఆధారంగా వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సాధ్యమైనంత త్వరగా మంత్రుల స్థాయి చర్చలు ప్రారంభించాలని జై శంకర్, అనితా ఆనంద్ నిర్ణయించారు. ఈ సందర్భంగా కెనడా గడ్డపై ఖలిస్తానీ వేర్పాటు వాదులు సాగిస్తున్న కార్యకలాపాలపై జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు పక్షాలు పరస్పర ఆందోళనలు, సున్నితమైన అంశాలపై నిర్మాణాత్మక, సమతుల్య భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
‘భారత్, కెనడా ప్రధాన మంత్రులు నాలుగు నెలల క్రితం రెండు దేశాల సంబంధాల్లో కొత్త ఊపును తెచ్చేందుకు ప్రాధాన్యతలను నిర్దేశించారు. వాటికి అనుగుణంగా, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకుంటూ పరస్పర గౌరవం ఆధారంగా కొత్త రోడ్‌మ్యాప్‌పై ఏకాభిప్రాయానికి చేరుకున్నాం’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కెనడా యురేనియం సరఫరాదారులతో భారత అణు ఇంధన సంస్థ అధికారులు జరుపుతున్న చర్చలను ఇద్దరు నేతలు స్వాగతించారు. అంతకు ముందు, అనితా ఆనంద్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్యం, టెక్నాలజీ, ఇంధనం, వ్యవసాయం, ప్రజల మధ్య సహకారం పెంచుకునే అంశాలను మంత్రి అనితా ఆనంద్‌తో చర్చించినట్లు మోదీ ఎక్స్‌లో తెలిపారు. కెనడా ప్రధాని కార్నీతో చర్చలకు ఆసక్తితో ఎదురు చూస్తున్నానన్నారు.