
తిరస్కరించిన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
పహల్గాం దాడి, ఉగ్రవాదంపై భారత్ ప్రస్తావన లేని ముసాయిదా
జాయింట్ డాక్యుమెంట్ లేకుండానే ముగిసిన ఎస్సీఓ సదస్సు
ఖింగ్‌డావో: ఆనవాయితీకి భిన్నంగా ఉమ్మడి ప్రకటన జారీ చేయకుండానే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు గురువారం ముగిసింది. 26 మంది పర్యాటకులను బలితీసుకున్న పహల్గాం ఉగ్రవాద దాడితోపాటు భారత్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న సీమాంతర ఉగ్రవాదం, ముష్కరుల దాడుల పట్ల భారత్ ఆందోళన గురించి ఈ ప్రకటన ముసాయిదాలో మాటమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం గమనార్హం.
పైగా పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో స్థానిక వేర్పాటువాద ఉద్యమకారులకు, సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణల వెనుక భారత్ హస్తం ఉండొచ్చనే వాదనను ఈ జాయింట్ డాక్యుమెంట్ ముసాయిదాలో పొందుపర్చడం వివాదాస్పదంగా మారింది. దీనిపై సంతకం చేసేందుకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిరాకరించారు.
ఫలితంగా ఏకాభిప్రాయం కుదరలేదన్న కారణంతో ఉమ్మడి ప్రకటన జారీ చేయకుండానే ఎస్సీఓ సదస్సును ముగించాలని నిర్ణయించారు. చైనాలోని తీరప్రాంత నగరం ఖింగ్‌డావోలో ఎస్సీఓ దేశాల రక్షణ శాఖ మంత్రుల సదస్సు బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. చైనా ఆతిథ్యం ఇచి్చన ఈ సదస్సులో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు చేపట్టిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.
🚨Breaking News:
Rajnath Singh refused to sign the SCO joint statement.
Why? Pakistan and China tried to weaken the conversation on terrorism. India stood firm on Pulwama
And Rajnath Singh maintained a strong anti-terror stance#scosummit #RajnathSingh pic.twitter.com/ujsP9JiO9I— Priyanshi Bhargava (@PriyanshiBharg7) June 26, 2025
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్, చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఇండియాలో అశాంతి సృష్టించాలన్న లక్ష్యంతో సీమాంతర పొరుగుదేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని పరోక్షంగా పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ ఆర్థికంగా అండగా నిలస్తోందని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధానంగా మార్చుకుందని దుయ్యబట్టారు. ఉగ్రవాదులను ఏరిపారేసే విషయంలో ద్వంద్వ ప్రమాణాల పాటించొద్దని హితవు పలికారు. ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశాలపై కఠినంగా వ్యవహరించేందుకు ఏమాత్రం వెనుకాడొద్దని షాంఘై సహకార సంస్థకు సూచించారు. ఉగ్రవాదులను, వారి పోషకులను చట్టం ముందు నిలబెట్టి, శిక్షించాల్సిందేనని తేల్చిచెప్పారు.