
‘‘మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం’’ అంటూ పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ చేసిన పిచ్చి ప్రేలాపనలపై భారత్ స్పందించింది. మునీర్ వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యమైనవిగా మండిపడింది. ఇలాంటి అణు బెదిరింపులకు భయపడేది లేదని.. జాతీయ భద్రత కోసం అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘‘మునీర్ వ్యాఖ్యలు అత్యంత బాధ్యాతారాహిత్యంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు కేవలం ప్రాంతీయ భద్రతను మాత్రమే కాదు.. అంతర్జాతీయ భద్రతలను పాక్ ఎలా ప్రమాదంలోకి నెట్టేస్తుందో తెలియజేస్తోంది. పాకిస్థాన్ ఆర్మీకి అమెరికా మద్దతు ఇచ్చినప్పుడల్లా.. వారి నిజస్వరూపం బయటపెడుతున్నారు’’ అని విమర్శలు గుప్పించింది.
అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ సైన్యాధిపతి అసీమ్ మునీర్.. అక్కడి నుంచే భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తమది అణ్వాయుధ దేశమని.. అవసరమైతే అణు యుద్ధానికి దిగుతామని బహిరంగంగా బెదిరింపులకు దిగారు. తాము నాశనమైతే.. తమతో పాటు సగం ప్రపంచాన్ని పతనం వైపునకు తీసుకెళ్తామంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వ వర్గాలు సోమవారం స్పందించాయి. అసీమ్ మునీర్ చేసిన అణు బెదిరింపులను తీవ్రంగా ఖండించాయి. ‘‘పాకిస్తాన్ అణు ఆయుధాలు కలిగి ఉండటం పట్ల ప్రజలు ఆందోళన చెందడం సహజం, ఇది పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం లేకపోవడం, సైన్యం దేశాన్ని నియంత్రిస్తున్నదానికి సంకేతం. అయితే పాక్‌లోని అణు ఆయుధాలు ప్రభుత్వేతర శక్తుల(ఉగ్రవాదుల) చేతుల్లోకి వెళ్లే ప్రమాదం నిజంగా ఉంది’’ అని భారత్ పేర్కొంది.
ఫ్లోరిడాలోని టాంపాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మునీర్.. అక్కడి పాక్ పౌరులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘సింధూ నది (Indus River)పై భారత్ డ్యామ్‌లు నిర్మించే వరకు మేం ఎదురుచూస్తాం. మా వద్ద క్షిపణులకు లోటు లేదు. వారు కట్టే ఆనకట్టలను 10 క్షిపణులతో పేల్చేస్తాం. మాది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశం. ఒకవేళ భవిష్యత్తులో న్యూఢిల్లీ నుంచి మా అస్థిత్వానికి ముప్పు ఎదురైతే.. మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం’’ అంటూ వ్యాఖ్యలు చేశారాయన.
ఇదిలా ఉంటే.. అసీమ్ మునీర్ అమెరికా వెళ్లడం రెండు నెలల్లో ఇది రెండోసారి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన విందులో పాక్ ఆర్మీ చీఫ్ పాల్గొన్నారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడికి నోబెల్ బహుమతి ఇవ్వాలని అధికారికంగా ప్రతిపాదించారు. భారత్‌పై ట్రంప్ సుంకాల భారం మోపుతున్న వేళ మునీర్ అమెరికాలో పర్యటిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ సంతతికి చెందిన పౌరులతో పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. మరోవైపు, పాక్ తదుపరి అధ్యక్ష పదవి రేసులో మునీర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అమెరికా గడ్డ నుంచి ఓ దేశంపై మరో దేశం ఇలా అణు బెదిరింపులకు పాల్పడటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.