
టారిఫ్‌ల బెదిరింపులతో భారత్‌ను తమ దారికి తెచ్చుకునేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోందా?.. అయితే అది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదని.. అలాంటి అల్టిమేటంలు ఎన్ని ఇచ్చినా భారత్ తలవంచబోదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ అభిప్రాయపడ్డారు.
భారత్, చైనాలు ప్రాచీన నాగరికతలు ఉన్న దేశాలని, అలాంటి దేశాలపై అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు, ఒత్తిడులు ఏమాత్రం పని చెయ్యబోవని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అంటున్నారు. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయడం ఆపాలని చేస్తున్న ఒత్తిళ్లు.. ఆ దేశాలను అమెరికాకు మరింత దూరం చేస్తాయే తప్ప ప్రయోజనం ఉండబోదని ‘ది గ్రేట్ గేమ్’ అనే టీవీ కార్యక్రమంలో లావ్రోవ్ వ్యాఖ్యానించారు.
రష్యా నుంచి చమురు, ఆయుధాల కొనుగోలు ద్వారా.. ఉక్రెయిన్‌పై యుద్ధానికి భారత్ పరోక్షంగా ఫండింగ్ చేస్తోందని అమెరికా ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే 25 శాతం పెనాల్టీ సుంకాలను ట్రంప్ విధించారు(మొత్తం 50 శాతం). రష్యాతో వాణిజ్యం ఆపకపోతే మరిన్ని ఆంక్షలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. అయితే భారత్ ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది. ఈ పరిణామాలపై సెర్గీ స్పందించారు.
‘‘నాకు నచ్చనిది వెంటనే ఆపండి. లేకుంటే మరిన్ని సుంకాలు విధిస్తా’’ అనే భాష ఆ దేశాలపై ప్రయోగించడం ఏమాత్రం సరికాదు. అలాంటి బెదిరింపులు ప్రాచీన నాగరికత ఉన్న ఆ దేశాలపై పని చేయవు కూడా అని అన్నారాయన. పైగా..
ఈ తరహా విధానం ఆ దేశాల ఆర్థిక స్థితిని దెబ్బతీయడమే కాకుండా, వారికి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. కొత్త మార్కెట్లు, కొత్త ఇంధన వనరులు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాక, ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుంది. అయితే, దీని కంటే కూడా ముఖ్యమైన విషయం ఏమిటంటే—ఈ విధానానికి నైతికంగా, రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది అని పేర్కొన్నారాయన.
ఇక రష్యాపై కొత్త ఆంక్షల విధింపు బెదిరింపులపైనా ఆయన స్పందించారు. ‘‘నిజం చెప్పాలంటే.. కొత్త ఆంక్షల వల్ల ఎలాంటి సమస్య కనిపించడం లేదు. ట్రంప్ మొదటి పదవీకాలంలోనే ఎన్నో ఆంక్షలు విధించబడ్డాయి. బైడెన్ పదవీకాలంలో ఆంక్షలకు బదులు దౌత్యపరమైన చర్చలు తెరమీదకు వచ్చాయి. కానీ, అమెరికాతో రాజీ కోసం ఎలాంటి ప్రయత్నం జరగలేదు’’ అని ఆయన కుండబద్దలు కొట్టారు.
ఇదిలా ఉంటే.. రష్యాతో చమురు, ఆయుధ కొనుగోళ్ల అంశంతో భారత్‌పై ట్రంప్ సుంకాలు విధించారు. అయితే చైనా విషయంలో మాత్రం కేవలం బెదిరింపులకే పరిమితం అయ్యారు. అలాగే రష్యాపైనా కఠిన ఆంక్షలు ఉంటాయంటూ ప్రకటనలు చేస్తున్నా.. ఆచరణలోకి మాత్రం తీసుకురావడం లేదు. ఇదిలా ఉండగానే అమెరికా-భారత్ వాణిజ్య చర్చల్లో పురోగతి చోటు చేసుకోవడం.. సుంకాలపై అమెరికా వెనక్కి తగ్గవచ్చనే సంకేతాలను అందిస్తోంది.