8 నిమిషాలు లైవ్ స్ట్రీమ్
హాకర్ల పనా, సిబ్బంది పొరపాటా?
తేల్చే పనిలో పడ్డ వైట్ హౌస్
వాషింగ్టన్: వైట్ హౌస్.జిఒవి/లైవ్. అత్యంత పటిష్టమైన సెక్యురిటీ వాల్స్ ఉండే, అత్యంత సురక్షితమైన అమెరికా ప్రభుత్వ సైట్. అందులో సాధారణంగా అధ్యక్షుని ప్రసంగాల లైవ్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంటుంది. అంతటి ముఖ్యమైన సైట్ కాస్తా గురువారం రాత్రి పొద్దు ఉన్నట్టుండి పెట్టుబడి పాఠాలు బోధించడం మొదలుపెట్టింది. అలా ఏకంగా 8 నిమిషాల పాటు సాగింది.
తీరా చూస్తే అది మాట్ ఫార్లే అనే ఓ కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్‌లో చెప్తున్న ఇన్వెస్టిమెంట్ సంబంధిత చిట్కాల తాలూకు లైవ్ స్ట్రీమింగ్. దాంతో అసలిదెలా జరిగిందో తెలియక విస్తుపోవడం వైట్ హౌస్ సిబ్బంది పనయింది. ఇది హ్యాకర్ల పనా, లేక తమవాళ్లే పొరపాటున స్ట్రీమ్ చేశారా అన్నది తేల్చడంలో వాళ్లిప్పుడు తలమునకలుగా ఉన్నారు. ’దీన్ని సీరియస్‌గానే తీసుకున్నాం. విచారణ జరుపుతున్నాం’ అంటూ వైట్ హౌస్ శుక్రవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దాంతో, దీనితో తనకు ఏ సంబంధమూ లేదని యూట్యూబర్ ఫార్లే చెప్పుకొచ్చాడు. మనవాడు అక్కడితో ఆగలేదు.
‘నా స్ట్రీమ్ అంత పెద్ద సైట్‌లో అంతమందికి రీచ్ అవుతుందని ముందే తెలిస్తే బాగుండేది! ఇంకాస్త బాగా తయారై కనిపించేవాడిని. ఇంకొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్లు కాస్త నాటకీయ జోడించి మరీ చెప్పేవాడిని‘ అంటూ హాస్యమాడాడు! గత జనవరిలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ప్రభుత సైట్లు డిజిటల్ సెక్యూరిటీ బ్రీచ్ బారిన పడుతున్న ఉదంతాలు తరచూ జరుగుతున్నాయి. గత మే లో పలువురు అధికారులు, ప్రఖ్యాత వ్యాపార దిగ్గజాలకు అధ్యక్షుని చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫోన్ నుంచి తనకు తెలియకుండానే మెసేజీకు, కాల్స్ వెళ్లి పెద్ద కలకలమే రేపాయి. ఇక గత ఏడాది ట్రంప్ ఎన్ని ప్రచార వేళ ఇరాన్ హ్యాకర్లు ఏకంగా ఆయన ప్రచార సైట్లలోకి చొరబడ్డారు.


