అమెరికాలో వలస నియంత్రణ కోసం పని చేస్తున్న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) దాడులు మళ్లీ తీవ్రతరమయ్యాయి. ఈ క్రమంలో మిన్నెసోటా స్టేట్‌లో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికన్లలో ఆందోళన పెరిగిపోతుండగా.. ఐస్ వ్యతిరేక నిరసనలు ఒకసారిగా ఉధృతం అయ్యాయి. మరోవైపు.. ట్రంప్ సర్కార్ మానవ హక్కులను కాలరాస్తోందనే రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇమ్మిగ్రేషన్ అధికారులు నిరుడు జరిపిన దాడుల్లో.. 32 మంది మరణించారు. ఈ ఏడాదిలో మొన్నమధ్యే మిన్నెసోటా రాష్ట్రంలో ఐస్ అధికారులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఇది రాజకీయంగా పెను దుమారం రేపింది. జనాల ప్రాణాల్ని తీస్తున్న ట్రంప్ సర్కార్ అంటూ డెమోక్రటిక్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రిపబ్లికన్ పార్టీ మాత్రం ఈ దాడుల్ని సమర్థించుకుంటున్నారు. అదే సమయంలో పరిస్థితిని భూతద్దంలో చూపిస్తూ అమెరికన్లలో లేనిపోని భయాలను డెమోక్రాట్లే సృష్టిస్తున్నారని తిట్టిపోస్తోంది. ఇటు.. ప్రజాభిప్రాయ సర్వేలు మాత్రం అమెరికన్లలో మెజారిటీ ఐస్ దాడుల పద్ధతులను వ్యతిరేకిస్తున్నారు.
వైట్ హౌస్ స్పందన
మిన్నెసోటా ఘటనపై వైట్ హౌస్ స్పందించింది. అమెరికా వీధుల్ని నెత్తరోడ్చడం అధ్యక్షుడు ట్రంప్ ఉద్దేశం ఎంతమాత్రమూ కాదని పేర్కొంది. వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోనీన్ లెవిట్ మాట్లాడుతూ.. జనాల్ని గాయపర్చడమో.. చంపడమో ట్రంప్ ఉద్దేశం కాదని అన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారామె. ఈ పరిస్థితికి డెమోక్రటిక్ నాయకులే కారణమని ఆరోపించారామె. ఫెడరల్ అధికారులపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్, మేయర్ జాకబ్ ఫ్రేలపై ఆమె మండిపడ్డారు.
ఇలాంటివి అవసరమా?
న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మామ్దానీ ICE దాడులను “క్రూరమైనవి, మానవత్వరహితమైనవి” అభివర్ణించారు. ఆయన ఈ సంస్థను పూర్తిగా రద్దు చేయాలని పిలుపునిచ్చారు. ఏబీసీ ది వ్యూ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇలాంటి సంస్థకు అమెరికాలో స్థానం లేదన్నారు. అలాంటి దాడులు న్యూయార్క్ నగరం దాకా రానివ్వబోనని సవాల్ చేశారు.
2026 మధ్యంతర ఎన్నికల్లో ఐస్ వ్యవహారం కీలకంగా మారే అవకాశం ఉందనే విశ్లేషణ నడుస్తోంది. అమెరికాలో ఈ ఏడాది నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 435 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సీట్లు, 35 సెనేట్ సీట్లు, అలాగే 39 రాష్ట్రాల్లో గవర్నర్ ఎన్నికలు జరుగుతాయి. ఇవి అమెరికా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఎన్నికలుగా భావిస్తున్నారు. కాబట్టి రెండో దఫా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌నకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమనే చెప్పొచ్చు. హౌస్ లేదంటే సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ ఆధిక్యం కోల్పోతే.. ఆయనపై ఇంపీచ్‌మెంట్ అవకాశాలు పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.


