యుద్ధక్షేత్రంలో మా బలగాలు దూసుకెళ్తున్నాయి
ఏడాది చివరికల్లా వ్యూహాత్మకంగా మరిన్ని విజయాలు
వార్షిక మీడియా భేటీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడి
మాస్కో: ఉక్రెయిన్‌లో ఆశించిన సైనిక లక్ష్యాలను సాధిస్తామన్న నమ్మకం తనకు ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రష్యా బలగాలు యుద్ధక్షేత్రంలో ముందుకు సాగుతున్నాయని ఆయన ప్రకటించారు. ఇప్పటికే వ్యూహాత్మకంగా పైచేయి సాధించాయని, ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని ప్రాంతాలను కైవసం చేసుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పైకి దండెత్తి దాదాపు నాలుగేళ్లవుతున్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం ఆయన వార్షిక మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌కు సైతం నేరుగా లైవ్‌లో సమాధానాలిచ్చారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధానికి ముగింపు పలికేలా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న వేళ పుతిన్ ఏం మాట్లాడుతారా అని పరిశీలకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2022 ఆరంభంలో పెద్ద ఎత్తున దండెత్తి వచ్చిన రష్యా బలగాలను చాలా చిన్నదైన ఉక్రెయిన్ ఆర్మీ సమర్ధంగా తిప్పికొట్టగలిగినప్పటికీ, రాన్రానూ అత్యంత భారీ రష్యా ఆర్మీ, అధునాతన ఆయుధ సంపత్తి ముందు తలొంచక తప్పలేదు. రష్యా బలగాలు యుద్ధ క్షేత్రంలో మెరుపు వేగంతో చొచ్చుకుపోలేకున్నా, క్రమంగా పైచేయి సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి.
దీనిపై పుతిన్ మాట్లాడుతూ.. ‘మా బలగాలు యుద్ధక్షేత్రమంతటా ముందుకు వెళ్తున్నాయి. ఒక్కో చోట వేగంగా, మరోచోట నెమ్మదిగా వెళ్తున్నాయి. మొత్తమ్మీద శత్రువు వెనక్కి మరలుతున్నాడు’అని పేర్కొన్నారు. ఈ సంక్షోభానికి మూల కారణాలను పరిష్కరించేందుకు శాంతియుతమైన ఒప్పందం కోసం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల్ని విక్రయించి, ఆ సొమ్మును ఉక్రెయిన్‌కు సాయంగా ఇవ్వాలంటూ పశ్చిమదేశాలు చేస్తున్న ప్రయత్నాలను పుతిన్ తప్పుబట్టారు. దీనిని పశ్చిమ దేశాలు సాగిస్తున్న దోపిడీగా అభివర్ణించారు. యూరోజోన్‌పై వ్యాపార, పారిశ్రామికవేత్తలపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు.
ఉక్రెయిన్‌కు 90 బిలియన్ యూరోల సాయం
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక అవసరాల కోసం వడ్డీలేని రుణాన్ని అందించడానికి యురోపియన్ యూనియన్ (ఈయూ) నాయకులు అంగీకరించారు. 2026–27 సంవత్సరానికి ఉక్రెయిన్‌కు 90 బిలియన్ యూరోల సాయం చేసేందుకు ఈయూ కట్టుబడి ఉందని కౌన్సిల్ అధ్మయక్షుడు ఆంటోనియో కోస్టా తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో వెల్లడించారు. ఈ ఒప్పందానికి రావడానికి ఈయూ నాయకులు తీవ్రంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ఈయూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశం ముందున్న బడ్జెట్ లోటును ఇది పూడుస్తుందని, తమ దేశ రక్షణను బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.


