రష్యా దాడుల్లో 17 మంది మృతి | Russian drone strike kills 17 in Dnipro | Sakshi
Sakshi News home page

రష్యా దాడుల్లో 17 మంది మృతి

Feb 2 2026 4:39 AM | Updated on Feb 2 2026 4:39 AM

Russian drone strike kills 17 in Dnipro

కీవ్‌: ఉక్రెయిన్‌లోని వేర్వేరు ప్రాంతాలపై రష్యా చేపట్టిన డ్రోన్‌ దాడుల్లో 17 మంది చనిపోగా, 15 మంది గాయపడ్డారు. నీప్రో నగరంపై ఆదివారం రష్యా జరిపిన డ్రోన్‌ దాడిలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాడి కారణంగా బస్సులో చెలరేగిన మంటలను వెంటనే అదుపులోకి తెచ్చామని ఉక్రెయిన్‌ ఎమర్జెన్సీ విభాగం తెలిపింది. బాధితులందరూ గని కార్మికులని పేర్కొంది. 

నీప్రోపెట్రోవిస్క్‌ ప్రాంతంలోని గనిలో విధులు ముగించుకుని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని, ఇది రష్యా జరిపిన ఉగ్రదాడి అని ఆరోపించింది. అదేవిధంగా, జపొరిఝియా నగరంపై రష్యా జరిపిన మరో డ్రోన్‌ దాడిలో ఓ ప్రసూతి వైద్యశాల దెబ్బతిందని అధికారులు తెలిపారు. ఘటలో ఆరుగురు మహిళలు గాయపడ్డారని, చెలరేగిన మంటలను అదుపు చేశామని చెప్పారు. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కోరిన మేరకు ఆదివారం వరకు దాడులను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం రష్యా ప్రకటించడం తెల్సిందే. అయితే, తాజా దాడులకు దారి తీసిన కారణాలను రష్యా వెల్లడించలేదు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు రష్యా 90 డ్రోన్లను ప్రయోగించగా, చాలా వరకు కూల్చివేశామని ఉక్రెయిన్‌ ఆర్మీ తెలిపింది. తొమ్మిది ప్రాంతాల్లో పడిన 14 డ్రోన్లు విధ్వంసం సృష్టించాయంది. శనివారం రాత్రి నీప్రో ప్రాంతంలో జరిగిన డ్రోన్‌ దాడిలో ఇద్దరు చనిపోయారని స్థానిక అధికారి తెలిపారు. ఖెర్సన్‌లో ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారని యంత్రాంగం పేర్కొంది.

 

Advertisement
 
Advertisement
Advertisement