ఇరాన్‌పై బాంబుల వర్షం | Drone Attack Near Dubai Airport | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై బాంబుల వర్షం

Mar 17 2026 4:54 AM | Updated on Mar 17 2026 4:59 AM

Drone Attack Near Dubai Airport

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు వద్ద కమ్ముకున్న పొగ

డ్రోన్‌ ఫ్యాక్టరీలే లక్ష్యంగా దాడులు: ట్రంప్‌ 

దెబ్బతిన్న ఇరాన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ క్లినిక్‌ 

తీవ్రస్థాయిలో ఇరాన్‌ ప్రతీకార దాడులు 

అధునాతన సెజ్జిల్‌ క్షిపణుల ప్రయోగం 

దుబాయ్‌ విమానాశ్రయం వద్ద డ్రోన్‌ పేలుడు... పేలిన ట్యాంక్, సర్వీసులకు అంతరాయం 

యూఏఈలో పారిశ్రామిక జోన్‌పై దాడి

దుబాయ్‌/జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధ కల్లోలం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్‌–అమెరికా సోమవారం కూడా ఇరాన్‌పై భారీగా దాడులు కొనసాగించాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు ఇస్ఫహాన్‌ తదితర నగరాలపై ఎడతెరిపి లేకుండా క్షిపణులు, బాంబుల వర్షం కురిపించాయి. వందలాది లక్ష్యాలపై ముమ్మరంగా దాడులు చేశాయి. ఇస్ఫహాన్, నతాంజ్‌లోని అణు కేంద్రాలపైనా దాడులు జరిగాయి. ఇరాన్‌వ్యాప్తంగా డ్రోన్‌ తయారీ ఫ్యాక్టరీలు, సదుపాయాలనే ప్రధానంగా లక్ష్యం చేసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు.

క్షిపణి, డ్రోన్‌ తయారీ కేంద్రాలు నేలమట్టమై ఇరాన్‌ యుద్ధపాటవం ఇప్పటికే విపరీతంగా క్షీణించినట్టు చెప్పారు. దాడుల్లో టెహ్రాన్‌లో రెడ్‌క్రాస్‌ సొసైటీ క్లినిక్‌ బాగా దెబ్బ తిన్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఇరాన్‌ క్షిపణి లాంచర్లలో 70 శాతానికి పైగా తమ దాడుల్లో ఇప్పటికే కుప్పకూలినట్టు ఇజ్రాయెల్‌ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ నడావ్‌ షొహానీ తెలిపారు. ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు 85 శాతం దాకా తుడిచిపెట్టుకుని పోయాయన్నారు.

ఇజ్రాయెల్‌ ఒక్కటే ఇరాన్‌లో ఇప్పటిదాకా ఏకంగా 7,600పై చిలుకు లక్ష్యాలను నేలమట్టం చేసినట్టు చెప్పారు. ఇంకా వేలాది లక్ష్యాలను సర్వనాశనం చేయనున్నట్టు వెల్లడించారు. యుద్ధం, హార్మూజ్‌ జలసంధి మూత తదితర పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు నానాటికీ ఎగబాకుతూ గుబులు రేపుతూనే ఉన్నాయి. చమురు బ్యారెల్‌ ధర సోమవారం కూడా 100 డాలర్లకు పై స్థాయిలోనే కొనసాగింది.  

గల్ఫ్‌ దేశాలపైనా...
ఇరాన్‌ డ్రోన్‌ దాడులు దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరోసారి వణికించాయి. ఒక డ్రోన్‌ పేలుడుతో చమురు ట్యాంక్‌కు మంటలంటుకుని భారీ పేలుళ్లు సంభవించాయి. వాటిని ఆర్పేందుకు చాలాసేపటిదాకా శ్రమించాల్సి వచ్చింది. దాంతో విమానాశ్రయంలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు. పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. యూఏఈలోని ఫుజైరా పారిశ్రామిక జోన్‌పైనా డ్రోన్‌ దాడులు జరిగాయి. అక్కడ పలుచోట్ల మంటలు చెలరేగాయి.

తమ దేశ తూర్పు ప్రాంతంలోని చమురు క్షేత్రాలే లక్ష్యంగా సోమవారం ఇరాన్‌ ప్రయోగించిన 35 డ్రోన్లను అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా, ఆరు క్షిపణులు, 21 డ్రోన్లను కూలి్చనట్టు యూఏఈ వెల్లడించాయి. తమ దేశంపై నాలుగు క్షిపణులు, మూడు డ్రోన్లు పడ్డట్టు బహ్రెయిన్‌ తెలిపింది. అబుదాబిపై జరిగిన క్షిపణి దాడిలో ఒక పాలస్తీనా పౌరుడు మరణించినట్టు ఆ దేశ మీడియా పేర్కొంది.

అటు ఇజ్రాయెల్‌పైనా ఇరాన్‌ పెద్దపెట్టున దాడులు కొనసాగించింది. దాంతో జెరూసలేం, టెల్‌ అవీవ్‌ సహా పలు నగరాల్లో ప్రజలు బంకర్లకేసి పరుగులు తీశారు. చాలా క్షిపణులను, డ్రోన్లను అడ్డుకుని కూల్చేసినట్టు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. క్షిపణి తాలూకు కూల్చేసిన భాగాలు పడి జెరూసలేం పాత నగరంలో ఓ ప్రార్థనాలయం దెబ్బ తిన్నట్టు తెలిపింది. ఖర్గ్‌ దీవిపై దాడుల కోసం పలు గల్ఫ్‌ దేశాల్లోని పోర్టులు, డాక్‌లను అమెరికా వాడుకున్నట్టు ఇరాన్‌ తాజాగా ఆరోపించింది. 

లెబనాన్‌లోకి పదాతి దళాలు 
లెబనాన్‌పై దాడుల తీవ్రతను సోమవారం ఇజ్రాయెల్‌ మరింత పెంచింది. రాజధాని బీరూట్‌తో పాటు పలు ప్రాంతాలు క్షిపణి, బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. దక్షిణాది ప్రాంతంలో జరిగిన వైమానిక దాడులకు ఫార్‌ సర్‌ గ్రామంలో ఏడుగురు బలైనట్టు ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. వారిలో ఇద్దరు వైద్య సిబ్బందని వెల్లడించింది. అంతేగాక పలు హెజ్బొల్లా స్థావరాలను దెబ్బ తీసేందుకు లెబనాన్‌లోకి అదనపు పదాతి దళాలను పంపినట్టు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. లెబనాన్‌లో ఐరాస శాంతి పరిరక్షక దళాలపై హెజ్బొల్లా కాల్పులను ప్రుభుత్వం తీవ్రంగా ఖండించింది. 

భారత్‌కు ఇరాన్‌ షరతులు! 
హార్మూజ్‌ గుండా భారత నౌకలను సురక్షితంగా సాగనిచ్చేందుకు ఇరాన్‌ తాజాగా షరతులు విధించినట్టు రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. గత ఫిబ్రవరిలో జప్తు చేసిన మూడు ఇరాన్‌ నౌకలను విడుదల చేయాలని, అత్యవసరంగా ఔషధాలు, ఔషధ పరికరాలు సరఫరా చేయాలని ఆ దేశం కోరినట్టు తెలిపింది. తప్పుడు గుర్తింపుతో ప్రయాణిస్తున్నందుకు ఆ నౌకలను నిర్బంధించాల్సి వచి్చందని భారత్‌ పేర్కొంది. అంతేగాక అవి సముద్ర మధ్యంలో అక్రమంగా సరుకుల బదిలీకి పాల్పడ్డట్టు తెలిపింది. 

చమురుకు కొత్త మార్గం: ఇరాక్‌ 
పశ్చిమాసియా నుంచి చమురు రవాణాకు మరో కొత్త మార్గాన్ని వారంలో అందుబాటులోకి తేనున్నట్టు ఇరాక్‌ పేర్కొంది. ఉత్తరాది నగరమైన కిర్కుక్‌ నుంచి తుర్కియేకు పైప్‌లైన్‌ను ప్రారంభిస్తామని ప్రకటించింది. దాని సామర్థ్యం రోజుకు 2.5 లక్షల బ్యారెళ్లని ఇరాక్‌ చమురు శాఖ మంత్రి హయాన్‌ అబ్దుల్‌ గనీ తెలిపారు. యుద్ధానికి ముందువరకు బస్రా రేవు నుంచి ఇరాక్‌ రోజుకు 34 లక్షల బ్యారెళ్ల చమురు ఎగుమతి చేసేది. 

చికిత్స కోసం రష్యాకు మొజ్తబా! 
ఇరాన్‌ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీని శస్త్రచికిత్స నిమిత్తం రహస్యంగా రష్యాకు తరలించినట్టు వార్తలొస్తున్నాయి. ఫిబ్రవరి 28న యుద్ధం తొలి రోజు ఇజ్రాయెల్‌ దాడుల్లో తండ్రి ఖమేనీతో పాటు ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డట్టు వార్తలు రావడం తెలిసిందే. అందుకు తగ్గట్టే నేటిటిదాకా మొజ్తబా బయటి ప్రపంచానికి కనిపించలేదు. దాడుల్లో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలైనట్టు చెబుతున్నారు. ‘‘దాంతో మొజ్తబాకు వైద్య సాయానికి మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ముందుకొచ్చారు. రష్యా సైనిక విమానంలో మొజ్తబాను మాస్కో తరలించారు’’అంటూ పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.

ఖమేనీ విమానం ధ్వంసం
ఇరాన్‌ దివంగత సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ విమానాన్ని ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్‌ విమానాశ్రయంపై జరిపిన దాడుల్లో అది పూర్తిగా ధ్వంసమైందని తెలిపింది. ఖమేనీతో పాటు అత్యున్నత పౌర, సైనికాధికారులు దేశీయ, విదేశీ ప్రయాణాలకు ఆ విమానాన్ని తరచూ వాడేవారని ఒక ప్రకటనలో ఇజ్రాయెల్‌ వివరించింది. 

ఎల్పీజీ నౌక వచ్చేసింది
46,000 మెట్రిక్‌ టన్నుల ఎల్పీజీ నిల్వలతో కూడిన భారత నౌక శివాలిక్‌ సోమవారం గుజరాత్‌ చేరింది. 20 వేల టన్నులను అక్కడి ముంద్రా రేవులో దించిన అనంతరం కర్నాటకలోని మంగళూరుకేసి బయల్దేరింది. దక్షిణాది అవసరాలను తీర్చే నిమిత్తం మిగతా 26 వేల టన్నుల ఎల్పీజీని అక్కడ అన్‌ లోడ్‌ చేయనున్నారు. మరో 45 వేల టన్నుల ఎల్పిజీతో మరో చమురు నౌక నందాదేవి కూడా మంగళవారం భారత్‌ చేరుకోనుంది. దీంతో దేశం ఎదుర్కొంటున్న ఎల్పీజీ కొరత కాస్త తగ్గనుంది. అలాగే 80 వేల టన్నుల చమురుతో కూడిన జగ్‌ లాడ్కీ నౌక కూడా మంగళవారం భారత తీరానికి చేరనుంది. మరోవైపు, సోమవారం ఒక పాక్‌ చమురు నౌక కూడా హార్మూజ్‌ను దాటింది.

నెతన్యాహు కాఫీ వీడియో ఫేక్‌!
క్షేమంపై మరిన్ని అనుమానాలు 
ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు బతికే ఉన్నారా, లేదా అన్న అనుమానాలు నానాటికీ మరింతగా పెరుగుతున్నాయి. ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా శుక్రవారం విడుదల చేసిన వీడియో ఫేక్‌ అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. అందులో నెతన్యాహు కుడిచేతికి ఆరు వేళ్లున్నట్టు కన్పించడం మరింత కలకలం రేపింది. ‘‘అది ఫేక్‌ వీడియో. ఇరాన్‌ దాడుల్లో నెతన్యాహు మరణించారు. ఆ వాస్తవాన్ని దాచిపెట్టేందుకు ఇజ్రాయెల్‌ ఫేక్‌ ఏఐ వీడియో రూపొందించి విడుదల చేసింది’’అంటూ కామెంట్లతో ఇంటర్నెట్‌ హోరెత్తిపోయింది.

దానికి స్పందనగా నెతన్యాహు పేరిట ఆదివారం మరో వీడియో విడుదలైంది. అందులో ఆయన ఒక కఫేలో ఉల్లాసంగా కాఫీ సేవిస్తూ కన్పించారు. తన మృతి వార్తలపై వ్యంగ్యంగా స్పందించారు కూడా. కానీ అది కూడా ఫేక్‌ వీడియోనేనని ప్రముఖ ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ తాజాగా తేల్చడం కలకలం రేపుతోంది! దానితో పలువురు ఎక్స్‌ యూజర్లు కూడా గళం కలిపారు. నెతన్యాహు చేతిలోని కప్పులో కాఫీ పరిమాణం ఆయన సిప్‌ చేసిన తర్వాత కూడా అలాగే ఉండటాన్ని వారు ఎత్తిచూపుతున్నారు. అంతేగాక ఆ వీడియోలో నెతన్యాహు ముఖం తీరుతెన్నులు చాలా తేడాగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. 

హార్మూజ్‌పై ఆచితూచి..
ట్రంప్‌ పిలుపుకు స్పందించని దేశాలు 
మరింత స్పష్టత కావాలి: ఈయూ 
ముందు యుద్ధం ఆపాలన్న చైనా 
యుద్ధ విస్తరణలో భాగం కాలేం: బ్రిటన్‌

వాషింగ్టన్‌/బ్రసెల్స్‌/లండన్‌/బీజింగ్‌: హార్మూ జ్‌ జలసంధిని తెరిపించే ప్రయత్నాల్లో కలిసి రావాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన పిలుపుకు ప్రపంచ దేశాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. హార్మూజ్‌ వద్దకు తక్షణం యుద్ధ నౌకలను పంపాల్సిందిగా చైనా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా సహా ఏడు దేశాలకు ఆయన విజ్ఞప్తి చేయడం తెలిసిందే. దీనిపై చర్చించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ విదేశాంగ మంత్రులు బ్రసెల్స్‌లో భేటీ కానున్నారు. హార్మూజ్‌ను తెరిపించే విషయంలో రెండు రకాల చర్యలు తమ దృష్టిలో ఉన్నట్టు ఈయూ విదేశీ విధాన సారథి కజా కలాస్‌ తెలిపారు. అంతకుముందు పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్‌ వ్యూహాల గురించి ఈయూ దేశాలు మరింత సమాచారం కోరుతున్నాయి.

అమెరికా తెర తీసిన ఈ యుద్ధం మరింత విస్తరించేందుకు తాము కారణం కావాలని కోరుకోవడం లేదని అవి కుండబద్దలు కొడుతున్నాయి. బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. ట్రంప్‌ కోరినట్టు యుద్ధ నౌకలు పంపేందుకు ఆయన అయిష్టత వ్యక్తం చేశారు. హార్మూజ్‌ను తెరిపించేందుకు మాత్రం యూరప్‌ దేశాలతో కలిసి ఇప్పటికే పలు మార్గాలను అన్వేíÙస్తున్నట్టు చెప్పారు. పశ్చిమాసియాలో పోరుకు తక్షణం తెర పడాలని ఆకాంక్షించారు. ఇరాన్‌పై దాడులకు స్వస్తి పలికితేనే హార్మూజ్‌ను తెరిపించే విషయంలో ముందుకొస్తానని చైనా సంకేతాలిచ్చింది.

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్‌ జియాన్‌ ఈ మేరకు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్‌కు చైనా వెంటనే యుద్ధ నౌకలు పంపకపోతే తన చైనా పర్యటనను వాయిదా వేసుకోవడానికి వెనకాడబోనని కూడా ట్రంప్‌ పేర్కొనడం తెలిసిందే. తన పిలుపుకు స్పందించని దేశాలను గుర్తు పెట్టుకుంటానంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు! అయితే అధ్యక్షుని వ్యాఖ్యల ఉద్దేశం హార్మూజ్‌ విషయమై చైనాపై ఒత్తిడి పెంచడం కాదని అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్‌ బెసెంట్‌ చెప్పుకొచ్చారు.

యూఎస్‌తో చర్చించలేదు: భారత్‌ 
హార్మూజ్‌ను తెరిపించే ప్రయత్నాలను గురించి అమెరికాతో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలూ జరపలేదని భారత్‌ స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌«దీర్‌ జైస్వాల్‌ ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement