
ఢిల్లీ: మోదీ సర్కార్ 15 ఏళ్ల ప్రణాళికను ఆవిష్కరించింది. సైనిక దళాల ఆధునికీకరణకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ మెగా డిఫెన్స్ ప్లాన్ రూపొందించింది. న్యూక్లియర్ వార్ షిప్స్, హైపర్ సోనిక్ మిస్సైల్స్, లేజర్, రోబోటిక్స్, ఏఐ ఆయుధాలతో భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. నౌక దళం కోసం సరికొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం మోదీ ప్రభుత్వం అతిపెద్ద రక్షణ అభివృద్ధి ప్రణాళికను ప్రకటించింది. దీని ద్వారా భారత సాయుధ దళాలను బిలియన్ల డాలర్ల పెట్టుబడితో అత్యాధునిక సాంకేతికతతో ఆధునీకరించనున్నారు. ఈ రోడ్ మ్యాప్ ప్రకారం, భారత్ తన ఆయుధాగారంలోకి అణుశక్తితో నడిచే యుద్ధ నౌకలు, నెక్ట్స్ జనరేషన్ యుద్ధ ట్యాంకులు, హైపర్‌సోనిక్ క్షిపణులు, స్టెల్త్ బాంబర్ డ్రోన్లు, AI- ఆధారిత ఆయుధాలు, అంతరిక్ష ఆధారిత యుద్ధ సాంకేతికతను చేర్చనుంది.
భారత సైన్యం.. టి-72 యుద్ధ ట్యాంకులకు బదులుగా దాదాపు 1,800 అత్యాధునిక ట్యాంకులను, పర్వత ప్రాంత యుద్ధం కోసం 400 తేలికపాటి ట్యాంకులను, 50,000 ట్యాంకులకు అమర్చే యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులను, 700 రోబోటిక్ కౌంటర్-IED వ్యవస్థలను చేర్చుకోనుంది.
నౌకా దళం ఒక కొత్త విమాన వాహక నౌక, 10 అధునాతన యుద్ధ నౌకలు, 7 ఆధునిక కార్వెట్‌లు, 4 ల్యాండింగ్ డాక్ ప్లాట్‌ఫారమ్‌లను పొందనుంది. యుద్ధ నౌకల కోసం అణు చోదక వ్యవస్థ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్‌లకు కూడా ఆమోదం లభించింది.