వాషింగ్టన్: రష్యా , ఉత్తర కొరియాలతో పాటు పాకిస్తాన్, చైనాలు కూడా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరువైపులా అణ్వాయుధ ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నందున ఇది భారతదేశానికి ఆందోళన కలిగించే విషయమని ‘సీబీఎస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. అలాగే తాను అమెరికా దళాలకు అణ్వాయుధాలను పరీక్షించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సమర్థించుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘సీబీఎస్’కు 60 నిమిషాలపాటు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. 33  ఏళ్ల నిషేధం తర్వాత అమెరికన్ దళాలకు అణ్వాయుధాలను పరీక్షించాలంటూ తాను ఆదేశాలు జారీ చేశానన్నారు.  చైనా, పాకిస్తాన్ ఇప్పటికే రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని అన్నారు. అయితే ఆ దేశాలు ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించలేదని, తాము అందుకు భిన్నమని అన్నారు. ఉత్తర కొరియా, పాకిస్తాన్ పరీక్షలు చేస్తున్నాయనే సమాచారం తమవద్ద ఉందన్నారు. భారత్, పాక్‌లు గత మే నెలలో అణు యుద్ధం అంచునకు చేరాయని, అయితే తాను వాణిజ్యం, సుంకాలతో దానిని అడ్డుకున్నానని అన్నారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోకపోతే లక్షలాది మంది చనిపోయేవారని ట్రంప్ పేర్కొన్నారు.
ఆ అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు భూగర్భంలో పరీక్షలు నిర్వహిస్తాయి. ఈ పరీక్షలతో ఏమి జరుగుతుందో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. అయితే  కంపనం అనుభూతి మాత్రం కలుగుతుంది. గ్లోబల్ మానిటరింగ్ స్టేషన్లు భూగర్భ అణు పేలుళ్ల వల్ల కలిగే భూకంపం లాంటి కంపనాలను గుర్తిస్తాయి. అటువంటి పరీక్షలను రహస్యంగా నిర్వహించవచ్చని, వాటిని గుర్తించలేమని ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ చైనా, పాకిస్తాన్‌లు అణ్వాయుధాలను పరీక్షిస్తుంటే, అది భారతదేశాన్ని మరింత అస్థిరంగా మారుస్తుందని ట్రంప్ పరోక్షంగా పేర్కొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
