బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు నానాటీకీ పెరిగిపోతున్నాయి. భారత వ్యతిరేక నాయకుడు ఉస్మాన్ హాదీ మరణం నేపథ్యంలో అక్కడి అల్లరి మూకలు రెచ్చిపోయాయు. గురువారం రాత్రి మైమెన్ సింగ్ అనే జిల్లాలో దైవదూషణ చేశాడనే ఆరోపణలతో ఒక హిందూ యువకుడిని అక్కడి అల్లరిమూకలు తీవ్రంగా కొట్టి చంపారు.
బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి, హింస తీవ్రస్థాయికి చేరుకుంది. భారత వ్యతిరేఖ భావజాలం గల నేత షరీప్ ఉస్మాన్ హాదిని డిసెంబర్ 12న గుర్తు తెలియని వ్యక్తులు తలపై కాల్చారు. దీంతో అతనిని చికిత్స నిమిత్తం సింగపూర్ తరలించారు. కాగా షరీప్ ఉస్మాన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బంగ్లాలో మరోసారి హింస చేలరేగింది. ప్రభుత్వ వైఫల్యంతోనే ఉస్మాన్ మృతిచెందారని ఆరోపిస్తూ ఆందోళనకారులు ఢాకాలో పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఓ హిందూ యువకుడిని కొట్టిచంపారు.
ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ "ఒక అల్లరిమూకల సమూహం గురువారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఒక వ్యక్తిని పట్టుకొని కొట్టి చంపారు. అనంతరం అతనిని కాల్చివేశారు. మంటలలో వేసే ముందు నిరసన కారులు అతని శరీరాన్ని చెట్టుకు పట్టుకొని వ్రేలాడదీశారు." అని అధికారి అన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని అల్లరి మూకలను చెదరగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.
అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం మైమెన్ మెడికల్ కాలేజ్‌కి తరలించామని తెలిపారు. ఈ ఘటన భాలుకా ఉప జిల్లా స్క్వేర్ మాస్టర్ బారిలో జరిగిందని తెలిపారు. బాధితుడు స్థానికంగా ఓ వస్త్రకర్మాగారంలో పనిచేస్తున్నారని అతని పేరు దీపు చంద్రదాస్ అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మృతుడి బంధువులకోసం వెతుకుతున్నామన్నారు. కాగా ఈ ఘటనపై ఇప్పటివరకూ ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. మృతుడి బంధువులు వచ్చి కేసు నమోదు చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. బంగ్లాదేశ్‌లో ఇటువంటి హింసకు తావులేదని పేర్కొంది. కాగా బంగ్లాలో ఇటీవల మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి-జూన్ ప్రాంతంలో ఆ దేశంలో మైనార్టీలపై దాడుల ఘటనలు 258 జరిగాయి. ఈ దాడులలో 27 మంది మృతిచెందగా, 20 పైగా మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 59 దేవాలయాలపై దాడులు జరిగాయి.


