రైతన్నకు కోపం వచ్చింది.. రాజధాని తగలబడింది! | Thousands of farmers protest in Brussels over EU agricultural policy | Sakshi
Sakshi News home page

European Union: రైతన్నకు కోపం వచ్చింది.. రాజధాని తగలబడింది!

Dec 19 2025 3:27 PM | Updated on Dec 19 2025 4:07 PM

Thousands of farmers protest in Brussels over EU agricultural policy

బ్రస్సెల్స్: యూరప్‌ రాజధాని బ్రస్సెల్స్‌ రైతుల ఆందోళనలతో అట్టుడికి పోతుంది. యూరోపియన్ యూనియన్ కొత్త ప్రతిపాదనలు తమ జీవనోపాదిని దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులు పదివేలకు పైగా ట్రాక్టర్లతో నిరసనలు చేపట్టారు. ఆ నిరసన తారా స్థాయికి చేరుకున్నాయి.

ఇటీవల యురేపియన్‌ యూనియన్‌  బ్రెజిల్, దక్షిణ అమెరికా దేశాలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం తమ జీవనోపాధిని దెబ్బతీస్తోందని ఆందోళన చేస్తున్న రైతులు ట్రాక్టర్లతో యూరోపియన్ పార్లమెంట్ భవనం వెలుపల, యూరోపియన్ యూనియన్ నాయకుల సమావేశం జరుగుతున్న ప్రాంతంలో మొహరించారు.  

కొత్త ప్రతిపాదనలు తమ జీవనోపాధిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతాయోనని తెలిపేలా.. రైతులు టైర్లు కాల్చి, రహదారులను బ్లాక్ చేసి, బంగాళాదుంపలు, గుడ్లు,సాసేజ్‌లు విసిరారు. ట్రాక్టర్లతో రాజధాని బ్రస్సెల్స్‌ను అష్టదిగ్భందనం చేశారు. అయితే, రైతుల ఆందోళనల్ని నిలువరించేందుకు పోలీసు దళాలు వారిపై టియర్ గ్యాస్, వాటర్ కానన్లను ప్రయోగించారు. రైతుల సమూహాన్ని చెదరగొట్టారు. ఎక్కడికక్కడే అరెస్టులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.   

రైతుల తిరుగుబాటుకు కారణం
యురేపియన్‌ యూనియన్‌ బ్రెజిల్, దక్షిణ అమెరికా దేశాలతో వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంతో ఇరు దేశాల నుంచి చౌకగా మాంసం, పంటలు దిగుమతి అవుతాయని.. ఇది స్థానిక మార్కెట్లను దెబ్బతీస్తుందని రైతులు భయపడుతున్నారు. దీనికి తోడు సబ్సిడీలను తగ్గించడమే కాకుండా కఠినమైన పర్యావరణ నియమాలను అమలు చేస్తాయి. తద్వారా యూరోపియన్ రైతులను ప్రపంచ మార్కెట్లో పోటీ చేయలేని స్థితి నెలకొంటుందని ఆరోపిస్తున్నారు.

 

రణరంగంగా గ్రీస్‌
మరోవైపు, ఆగ్నేయ ఐరోపా దేశమైన గ్రీస్‌ రణరంగంగా మారింది. డిసెంబర్ 16–17న గ్రీక్ పార్లమెంట్ 2026 బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్‌పై ప్రజలు ఆందోళనకు దిగారు. కార్మిక సంఘాలు 24 గంటల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఉద్యోగులు మున్సిపాలిటీ కార్యాలయాల్ని మూసివేశారు. ఉపాధ్యాయులు అథెన్స్‌లో కొనసాగుతున్న నిరసనల్లో పాల్గొన్నారు. ఈ నిరసనలకు రైతులు సైతం మద్దతు తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారి బారికేడ్లను ఏర్పాటు చేశారు. 

తక్కువ వేతనాలు, పెరుగుతున్న ఆహారం ధరలు, ఇంటి వ్యయంపై ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. రైతులు, ప్రజా రంగ కార్మికులు కలిసి నిరసన చేయడం వల్ల ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు, గ్రీస్ 2025లో 23.5 బిలియన్ రికార్డు స్థాయి పర్యాటక ఆదాయాన్ని గడించింది.  ప్రపంచంలోని టాప్ 10 పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిచింది. పర్యాటక రంగం బలంగా ఉన్నప్పటికీ సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయంటూ అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement