భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సుదీర్ఘమైన, క్లిష్టమైన చర్చల అనంతరం ఒక కొలిక్కి వచ్చినది మాత్రమే కాదు; మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్న తీరుకు అది ప్రతీకగా నిలుస్తోంది. పైగా ఇచ్చిపుచ్చుకోవడంలో పరస్పర ప్రయోజనాలున్న రెండు పెద్ద ఆర్థిక వ్యవ స్థలను అది కలుపుతోంది. ఈ రెండింటి వాటా ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో నాల్గవ వంతుగా ఉంది. భవిష్యత్తులో కూడా ఆర్థిక బంధం స్థిరంగా కొనసాగేందుకు అది పునాది వేసింది.
ఇది తాత్కాలిక బేరసారాల ప్రయోజనాల చుట్టూ అల్లుకున్నది కాకపోవడం వల్లనే ‘అన్ని భాగస్వామ్యాలకు మాతృక’ లాంటిది అనే పేరు తెచ్చుకుంది. ఇది దీర్ఘకాలిక ఆశయంతో సమగ్రంగా రూపుదిద్దుకున్న ఒప్పందం. వస్తు వాణిజ్యం, సేవలతోపాటు ఇన్వెస్ట్ మెంట్, డిజిటల్ ట్రేడ్, సతత వికాసం, రాకపోకలు, సాంకేతిక పరి జ్ఞాన సహకారాన్ని కూడా జోడించుకోవడం వల్ల ఇదేదో కేవలంసుంకాలలో వెసులుబాటు కల్పించుకున్నదిగా కాక, రెండు పక్షాలకు ప్రయోజనదాయకమైన ఆర్థిక చట్రాన్ని రూపొందించుకోగలిగింది.
భారతీయ పారిశ్రామిక రంగానికి ఇది చాలా అవసరం. ఎందుకంటే, పోటీ సామర్థ్యం ప్రస్తుతం మార్కెట్ల సౌలభ్యానికి మాత్రమే పరిమితమైనదిగా లేదు. దానికి ఒక స్థిరమైన, నమ్మకమైన, స్థితి స్థాపక సామర్థ్యమున్న వాతావరణం అవసరమవుతోంది.
స్థిరమైన మార్కెట్
ఐరోపా వంటి విస్తృత, నియమ–ఆధారిత మార్కెట్ వల్ల ఒక లాభం ఉంది. వివిధ సంస్థలు స్వల్పకాలిక లాభాలకు అతీతంగా, పెట్టుబడులు, ఎగుమతులు, ఉత్పాదక సామర్థ్యం, భాగస్వామ్యా లపై దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుంది. వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు వస్తువులు, పాదరక్షలు, ఎలక్ట్రికల్ యంత్ర పరికరాలు, రసాయనాలు, మోటారు వాహనాల విడి భాగాల వంటి ఎక్కువ మంది శ్రమ అవసరమైన రంగాలకు అది మరీ అవసరం. ఎక్కువ మందికి ఉపాధి కల్పించగల శక్తి కూడా ఆ రంగాలకు ఉంది.
ఆయా రంగాలకు యూరోపియన్ మార్కెట్లు మునుపటికన్నా మెరుగ్గా అందుబాటులోకి వస్తే గణనీయమైన లాభం చేకూరుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలతో సహా భారతీయ సంస్థలకు మరో మహత్తర అవకాశం లభిస్తోంది. అవి కేవలం ధర విషయంలో పోటీపడటం కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా మరింత మన్నికైన, విలువ ఆధారిత వస్తువుల ఉత్పత్తికి, విక్రయానికి యూరోపియన్ సంస్థలతో భాగ స్వామ్యం కుదుర్చుకోవడం తేలికవుతుంది.
కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడటం వల్ల రిస్కులుంటాయి. వాటిని తగ్గించుకునేందుకు, ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకునేందుకు భారత్–యూరప్ కంపెనీలు రెండూ సప్లై చైన్లను చురుకుగా విస్తరించుకుంటున్నాయి. స్థాయి, సమరశీల సంస్కరణల అజెండా, మెరుగుపడిన పారిశ్రామిక మౌలిక వసతులతో యూరప్‌కుఇండియా నమ్మదగిన ఉత్పత్తి కేంద్రంగా, నవీకరణ భాగస్వామిగా ఆవిర్భవించగల స్థితిలో ఉంది.
ఆ రకమైన మార్పునకు చాలా వరకు టెక్నాలజీ సహకారం పునాదిని అందిస్తుంది. కాలుష్య రహిత టెక్నాలజీలు, డిజిటల్ మౌలిక వసతులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, అగ్రికల్చర్ టెక్నాలజీ, అడ్వాన్డ్స్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో బలమైన సహకారాన్ని పాదుకొల్పుకునేందుకు తగిన పరిస్థితులను ఈ ఒప్పందం సృష్టిస్తోంది. నవీకరణలో ఐరోపాకున్న బలం, భారీ స్థాయిలో ఉత్పత్తి చేపట్టగల భారత్ సామర్థ్యం ఈ విషయంలో సహజసిద్ధమైన పరస్పర ప్రయోజనదాయకమైన అంశాలుగా పరిణ మిస్తాయి.
అధునాతన టెక్నాలజీలను అనుసరించడంలోనేకాదు, వాటి సహ అభివృద్ధిలో, స్థానికీకరణలో, నియోగించడంలో పాలు పంచుకునే అవకాశం భారత్ పరిశ్రమలకు లభిస్తుంది. ఫలితంగా, హెచ్చు విలువ కలిగిన వస్తూత్పత్తి, టెక్నాలజీ సునిశిత రంగాల్లోకి భారత్ పయనం వేగవంతమవుతుంది.
పరస్పర తోడ్పాటు
సేవలు, మానవ మూలధనంపై ఈ ఒప్పందం చూపగల ప్రభావం కూడా తక్కువదేమీ కాదు. జనాభా వర్గాలలో భారత దేశానికి ఉన్న సానుకూలాంశం వ్యూహాత్మక ఆస్తిగా పరిణమిస్తుంది. ప్రపంచంలోని పెద్ద యువ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఇండియా, టెక్నాలజీ, ఇంజినీరింగ్, పరిశోధన, ఆరోగ్య రక్షణ, వ్యాపార సేవలు వంటి వివిధ విభాగాల్లోకి వృత్తినిపుణులను తీసుకురాగలదు.
యూరప్‌లో వయసు మీదపడుతున్నవారి సంఖ్య పెరుగుతూ ఉండ వచ్చు. కానీ, వాటి ఆర్థిక వ్యవస్థలు నవీకరణతో నడుస్తున్నాయి. వాటికి సేవలను, మొబిలిటీని అందుబాటులోకి తెచ్చేందుకు యూరప్‌తో సంబంధాలు నెరపడంలో భారత నిపుణులకున్న సామ ర్థ్యాన్ని ఈ ఒప్పందం మెరుగుపరుస్తుంది.
భద్రత–రక్షణ రంగాల్లో కూడా ఉభయ పక్షాల ప్రయోజనాలు సమ్మిళితం కావడం ఈ ఒప్పందంలో మరో ముఖ>్యంశం. అధునా తన రక్షణ పరికరాలు, ద్వంద్వ వినియోగ టెక్నాలజీ ఆవరణ వ్యవస్థ లలో తోడ్పాటుకు భారతీయ పరిశ్రమలకు ఈ ఒప్పందం ద్వారాలు తెరుస్తోంది. క్రమేపీ సమస్యాత్మకంగా మారుతున్న ప్రపంచ వాతా వరణంలో బలహీనతలను తగ్గించుకుంటూ, దేశీయ పారిశ్రామిక సామర్థ్యాలను పటిష్టపరచుకునేందుకు కూడా వీలుంది.
మరో రకంగా కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గణనీయమై నదే. సమ్మిళితం ద్వారా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని భారతదేశం పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఈఒప్పందం ఎంతగానో అవసరమవుతుంది. దేశీయ ఉత్పాదక సామ ర్థ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా నిష్ఠగా ఈ ఒప్పందాన్ని అమలు జరిపితే, భారతదేశపు పారిశ్రామిక పథం రూపురేఖలు కొన్ని దశాబ్దాలపాటు కొత్త అంచులను తాకుతూ ముందుకు సాగుతాయి. ప్రపంచ వాణిజ్యంలో భారత పారిశ్రామిక రంగ స్థితి ఎక్కడో అంచుల లోకాక, కేంద్ర స్థానాన్ని సుస్థిరంగా ఆక్రమించుకోగలుగుతుంది.
-వ్యాసకర్త భారతీయ పరిశ్రమల సంఘాల సమాఖ్య (సీఐఐ) డైరెక్టర్ జనరల్ (‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
- చంద్రజిత్ బెనర్జీ


