మీడియాతో మాట్లాడుతుండగా ఉద్యమకారుడిపై దాడి | Activist Seeking Ban On DJ Music And Loudspeakers Assaulted | Sakshi
Sakshi News home page

మీడియాతో మాట్లాడుతుండగా ఉద్యమకారుడిపై దాడి

Sep 3 2026 8:20 PM | Updated on Sep 3 2026 9:03 PM

Activist Seeking Ban On DJ Music And Loudspeakers Assaulted

పుణే: పండుగల సమయంలో అధిక శబ్దంతో కూడిన డీజే సిస్టమ్స్‌, లౌడ్‌స్పీకర్ల వినియోగాన్ని వ్యతిరేకిస్తున్న నగరానికి చెందిన ఉద్యమకారుడు విద్యానంద్ బాపట్‌పై గురువారం ఉదయం ఓ వ్యక్తి దాడి చేశాడు. తిలక్ రోడ్ ప్రాంతంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న సమయంలో బాపట్‌పై దాడి జరిగింది. రోడ్డుపై విలేకరులకు తన అభిప్రాయాన్ని చెబుతున్న సమయంలో ఓ వ్యక్తి బాపట్‌ను చెంపపై కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఘటన అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని బాపట్‌ను పోలీసు వ్యాన్‌లో అక్కడి నుంచి తీసుకెళ్లారు. “దాడి చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. బాపట్ భద్రత దృష్ట్యా ఆయనను వ్యాన్‌లో తీసుకెళ్లాం” అని ఓ పోలీసు అధికారి తెలిపారు. దాడి చేసిన వ్యక్తి గుర్తింపు, దాడికి గల కారణం సహా మరిన్ని వివరాలు తెలియరాలేదు.

లౌడ్‌స్పీకర్లు, అధిక శబ్దంతో కూడిన డీజే వ్యవస్థలలను బాపట్ వ్యతిరేకిస్తుండడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయనకు పెరుగుతున్న ప్రజా మద్దతు ఒక వ్యవస్థీకృత పౌర ఉద్యమంగా రూపుదిద్దుకుంటోంది. పండుగల సమయంలో పెద్ద శబ్దంతో సంగీతం, డీజేలకు వ్యతిరేకంగా బాపట్ ప్రచారం చేస్తున్నారు. అధిక శబ్దం వల్ల స్థానికులకు ఇబ్బందులు కలగడంతో పాటు వారి ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రభావం పడుతుందని ఆయన వాదిస్తున్నారు.

రాబోయే గణేశ్ ఉత్సవాల కోసం పుణే మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన ఇటీవల సన్నాహక సమావేశానికి హాజరైన తర్వాత బాపట్ వెలుగులోకి వచ్చారు. ఆ సమావేశంలో యాంప్లిఫైడ్ డీజే సంగీతం, అధిక శబ్దంతో కూడిన స్పీకర్లపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని ఆయన కోరారు. ఆయన డిమాండ్‌పై స్థానికంగా ఉన్న పలు గణేశ్ మండళ్ల ప్రతినిధులతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనలు, నినాదాల మధ్య పోలీసులు చివరకు ఆయనను భవనం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆ ఘర్షణకు సంబంధించిన వీడియోలు త్వరలోనే వైరల్ కావడంతో బాపట్ పేరు విస్తృతంగా చర్చలోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement