152 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి సహకరించండి.. గ్రావిటీ నీటి మళ్లింపునకు అనుమతించండి
మహారాష్ట్ర జల వనరుల అధికారులకు తెలంగాణ అధికారుల బృందం వినతి
మూడు వారాల అనంతరం మరోమారు సమావేశం కావాలని నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు నీళ్లిచ్చేందుకు ప్రాణహిత జలాలే ప్రాణాధారమని, వాటిని గరిష్ట స్థాయిలో గ్రావిటీ పద్ధతిన వినియోగించుకునేందుకు 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మించుకునేందుకు సహకరించాలని మహారాష్ట్రను తెలంగాణ మరోమారు కోరింది. తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణ అనుమతుల అంశమై మంగళవారం కేంద్ర జల సంఘం చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి తెలంగాణ నుంచి శాఖ కార్యదర్శి శ్రీధర్, సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్‌సీ రమేశ్‌బాబు, సీఈ విజయ్‌లతోపాటు అంతర్రాష్ట్ర విభాగ అధికారులు హాజరయ్యారు.
మహారాష్ట్ర తరఫున సీఈ సోనాలి చావ్‌డేతో పాటు ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇంజనీర్లు గోదావరి అవార్డు మొదలు, నీటి లభ్యత, కేటాయింపులు, హక్కులు, తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి గతంలో చేసిన ప్రతిపాదనలు, మహారాష్ట్రతో ఒప్పందాలు, ప్రస్తుతం బరాజ్ నిర్మాణ అవసరం, ముంపు సమస్యలు, వాటికి అందించే పరిహారం వంటి అంశాలపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
పునరావాస, పరిహార పూర్తి బాధ్యత మాదే..
తుమ్మిడిహెట్టి బరాజ్‌ను 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవల్)తో నిర్మించి, 160 టీఎంసీల నీటిని మళ్లించడం ద్వారా 16.40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రాజెక్టును డిజైన్ చేశామని, అయితే రాష్ట్రాల మధ్య కుదరని ఏకాభిప్రాయంతో దీనిని 148 మీటర్లకు తగ్గిస్తూ గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు జరిగిన విషయాన్ని ఇంజనీర్లు ప్రస్తావించారు. అయితే 148 మీటర్లతో ప్రస్తుతం బరాజ్ నిర్మిస్తే తమ అవసరాలకు ఆ నీరు ఏమాత్రం సరిపోదని, 80 నుంచి 100 టీఎంసీల నీటి అవసరాలు ఉన్న దృష్ట్యా 152 మీటర్లకు బరాజ్‌ను నిర్మించే అవకాశాలను పరిశీలించాలని కోరారు.
152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే మహారాష్ట్రలో ముంపు 5,247 హెక్టార్లు మాత్రమేనని, ఇందులో నదీగర్భంలోనే ముంపు ఎక్కువగా ఉందని, వ్యవసాయా««ధారిత భూమి 2వేల హెక్టార్లు కంటే తక్కువనే ఉంటుందని వివరించారు. దీనికి సంబంధించిన పూర్తి పరిహారాన్ని మహారాష్ట్ర కోరిన మేరకు నిర్వాసితులకు అందిస్తామని వివరించా రు. బరాజ్ సాధారణ నిర్వహణ సమయంలో నీటిముంపునకు గురయ్యే భూమిని, బరాజ్ వల్ల ఏర్పడే ముంపు ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ ప్రభు త్వం భూమిని సేకరిస్తుందని, అవసరమైతే ప్రభావిత ప్రాంతాలను రక్షించేందుకు ఫ్లడ్ బ్యాంకులు నిర్మిస్తామని వెల్లడించింది. బరాజ్ నిర్మాణంతో మహారాష్ట్రకు నీటి హక్కులకు ఎలాంటి విఘాతం కలగదని తెలిపింది.
గత నివేదికలు అందిస్తే అధ్యయనం చేస్తామన్న మహారాష్ట్ర
రాష్ట్ర అభిప్రాయాలను విన్న మహారాష్ట్ర ఇంజనీర్లు.. తెలంగాణ నుంచి పలు అంశాలపై అదనపు సమాచారం కోరినట్టు తెలిసింది. బరాజ్ నిర్మాణ ప్రాంతంలో నీటి లభ్యత, 152 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో మహారాష్ట్ర ప్రాంతంలో ఉండే ముప్పు, దీనిపై సీడబ్ల్యూపీఆర్‌ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) గతంలో ఇచ్చిన నివేదికలు, రెండు రాష్ట్రాల అధికారులతో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర బోర్డుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలను తమకు అందించాలని కోరారు. ఇవన్నీ సమర్పిస్తే మూడు వారాల్లో మరోమారు భేటీ అవుదామని నిర్ణయించినట్టు తెలిసింది. భేటీ అనంతరం మహారాష్ట్ర కోరిన వివరాలు, రాష్ట్ర ప్రజెంటేషన్ వివరాలను తెలంగాణ ఇంజనీర్లు ఢిల్లీలోనే ఉన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వివరించారు.


