15 వరకే డెడ్‌లైన్‌ | Employee unions ultimatum to Chandrababu Naidus government | Sakshi
Sakshi News home page

15 వరకే డెడ్‌లైన్‌

Aug 9 2026 5:22 AM | Updated on Aug 9 2026 5:22 AM

Employee unions ultimatum to Chandrababu Naidus government

మాట్లాడుతున్న ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, చిత్రంలో ఉద్యోగ సంఘాల నేతలు

చంద్రబాబు సర్కార్‌కు ఉద్యోగ సంఘాల అల్టిమేటం

ఆ తర్వాత ఉద్యమమేనని స్పష్టీకరణ 

ఉద్యోగుల హామీలపై సానుకూల నిర్ణయాలు ప్రకటించాలి 

పీఆర్సీ, డీఏ, ఐఆర్‌పై ప్రభుత్వం ఎందుకు మౌనం? 

చంద్రబాబు శ్వేతపత్రంలోవన్నీ తప్పుడు లెక్కలే.. 

జీతాల ఖర్చు 37% అయితే.. 98% అంటూ దుష్ప్రచారం

మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిగి 17 రోజులైనా నిర్ణయాల్లేవ్‌ 

ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు

సాక్షి, అమరావతి: ‘‘ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయా­లనే మేం కోరుతున్నాం. గొంతెమ్మ కోర్కెలేమీ కోర­డం లే­దు. హామీల అమలుపై స్పందించకుండా.. మేం ఉద్య­మాని­కి సిద్ధమవుతుంటే బూటకపు లెక్కలతో ప్రజ­ల్లో మాపై తప్పు­డు సంకేతాలిస్తారా? గతనెల 22న మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపినా నేటికీ నిర్ణయాలు ప్రకటించనే లేదు. ఆగస్టు 15 వరకే ప్రభుత్వానికి డెడ్‌లైన్‌. ఆలోపు సానుకూల నిర్ణయాలు ప్రకటించకపోతే ఏ క్షణ­మైనా ఉద్యమంలోకి వెళ్తాం.’’ అని చంద్రబాబు ప్రభుత్వా­ని­కి ఏపీ అమరావతి జేఏసీ అల్టిమే టం జారీ చేసింది. 

ఏటా ఉద్యోగుల జీతాల ఖర్చు తగ్గుతుంటే మా కోసమే రాష్ట్ర ఆదాయమంతా సరిపోతోందని సీఎం  ఆర్థిక శ్వేతపత్రంలో తప్పుడు లెక్కలు వల్లె వేశా­రని జేఏసీ నాయకులు నిప్పులు చెరిగారు. శనివారం విజ­యవాడలోని రెవెన్యూ భవన్‌లో ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ వైఖరిపై ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యా­చ­రణ కమిటీ సమావేశమైంది. అనంతరం చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర రావు, ఉద్యమ కమిటీ చైర్మన్‌ ఫణి పేర్రాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. 

జీతాల ఖర్చు తగ్గుతోంది.. కొత్త నియామకాల్లేవ్‌.. 
ఈ నెల నాలుగో తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక శ్వేత పత్రంలో ఉద్యోగులకు సంబంధించిన అంశాలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారని, గొంతెమ్మ కోర్కెలేమీ కోరడం లేదన్నారు.  ఉద్యోగులకే అంతా ఖర్చయిపోతోందని ఎలా ప్రకటిస్తార­ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 2025–26లో ప్రభుత్వం రూ.2.26 లక్షల కోట్లు ఖర్చు చేస్తే అందులో ఉద్యోగులు, పెన్షనర్‌ల కోసం చేసిన ఖర్చు 37.41 శాతం మాత్రమేనని తెలిపారు. 

ప్రభుత్వానికి వస్తున్న పన్నుల రాబడిలో ఉద్యోగుల కోసం చేస్తున్న ఖర్చు 59 శాతం ఉందన్నారు. పన్నులతో పాటు, ఇతర రాబడి మొత్తంలో తమ ఖర్చు 47 శాతమే అన్నారు. అయితే ఉద్యోగులు, పెన్షనర్‌ల కోసం 94 శాతం నుంచి 98 శాతం ఖర్చు చేస్తున్నట్టు శ్వేత పత్రంలో ఎలా ప్రకటించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రానున్న రోజుల్లో ఉద్యోగులు, పెన్షనర్లపై ఖర్చులు భారీ­గా తగ్గనున్నాయని తెలిపారు. 2024 నుంచి 2026లో ఇప్ప­టికే 41,321 మంది ఉద్యోగులు రిటైర్‌ అయ్యారన్నా­రు. 

వచ్చే ఐదేళ్లలో 1,51,755 మంది రిటైర్మెంట్‌కు సిద్ధంగా ఉన్నారన్నారు. రిటైర్‌ అవుతున్న ఉద్యోగుల స్థానంలో అవసరాలకు తగ్గట్టుగా కొత్త నియా­మకాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతాల ఖర్చు సగానికిపైగా తగ్గి­­పోతోందన్నారు. అయితే ఉద్యోగులపై చేస్తున్న ఖర్చు పెరిగిపోతోందని సీఎం ఎలా అంటారని నిలదీశారు. ప్ర­భు­త్వం శ్వేత పత్రంలో ప్రకటించిన ఉద్యోగులు, పెన్షనర్‌­ల ఖర్చుల లెక్కలన్నీ బూటకమేనన్నారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెల్లిస్తోందో లెక్కలు చెప్పాలని డి­మాండ్‌ చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నా­రు.

15వ తేదీ తర్వాత ఉద్యమ కార్యాచరణ 
ఐఏఎస్‌లు, ప్రజాప్రతినిధుల వైద్య సేవలకు ఒక్క రూపా­యి ఖర్చయినా సరే ఆగమేఘాల మీద రీయింబర్స్‌మెంట్‌ వచ్చేస్తోందని బొప్పరాజు అన్నారు. అదే ఉద్యోగులు, పెన్ష­న­ర్‌లు వైద్యం కోసం రూ. లక్షల్లో ఖర్చు చేసుకున్నా రీయింబర్స్‌మెంట్‌ రాదన్నారు. ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్‌ఎస్‌) సమస్యలను పట్టించుకోరని మండిపడ్డారు. ఉద్యోగులు, పెన్షనర్‌ల పట్ల ఇంత వివక్ష ఎందుకని నిలదీశారు. పీఆర్‌సీ, డీఏ, ఐఆర్‌లపై ఉలుకు పలుకు లేదన్నా­రు. సీపీఎస్, జీపీఎస్‌ను పునఃసమీక్ష చేసి ఆమోద యోగ్యమైన విధానం తెస్తామన్నారని గుర్తు చేశారు.

అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు ఇస్తామన్నారని, వీటి గురించి పట్టించుకోవడం లేదన్నారు. సమస్య­ల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో గత నెల 22న మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘ చర్చలు జరిపిందన్నారు. అయితే ఇప్పటి వరకూ ఒక్క నిర్ణయాన్ని కూడా ప్రకటించలేదన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రానిపక్షంలో ఇప్పటికే ప్రకటించిన విధంగా ఆగస్టు 15వ తేదీ తదుపరి ఐక్య కార్యాచరణతో ఏ క్షణమైనా ఉద్యమానికి దిగుతామన్నారు.   

సంపద సృష్టిస్తామని హామీలిచ్చి.. ఇప్పుడు ఖర్చు తగ్గిస్తామంటారా?
ఉద్యోగుల ఇబ్బందులు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయని బొప్పరాజు పేర్కొన్నారు. వీటిని పరిష్కరించాలని మేం కోరుతుంటే ఉద్యోగ సంఘాలు తప్పు చేస్తున్నట్టుగా ప్రభుత్వం చిత్రీకరిస్తోందని పలిశెట్టి దామోదర్‌ పేర్కొన్నారు. సంపద సృష్టిస్తామని హామీలిచ్చి ఇప్పు­డేమో ఉద్యోగుల కోసం చేసే ఖర్చును తగ్గిస్తామంటారా? అని నిలదీశారు. గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.50 లక్షల ఉద్యోగులను నియమించింద­న్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినట్టు గుర్తు చేశారు. 

వైద్య రంగంలో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన, జాబ్‌ క్యాలెండర్‌ హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం చేసిందేంటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక 40 వేల మందికిపైగా రిటైర్‌ అయ్యారన్నారు. ఇప్పుడు సీఎం చెబుతున్న మాటలు వింటుంటే ప్రభుత్వం భవిష్యత్‌లో శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేయబోదనే సంకేతాలు వెలువడుతున్నాయన్నారు. ఉద్యోగుల కోసం చేస్తున్న ఖర్చులపై పూర్తిగా తప్పుడు లెక్కలు వల్లె వేస్తున్నారన్నారు.  ఉద్యమ కమిటీ చైర్మన్‌ ఫణి పేర్రాజు, మహిళా విభాగం చైర్‌పర్సన్‌ లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెట్టకుండా ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలపై సానుకూల నిర్ణయాలు ప్రకటించాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement