విజయవాడలో కదంతొక్కిన గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు
ప్రభుత్వ తీరును నిరసిస్తూ మహాధర్నా
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన ఉద్యోగులు
సర్కారు తీవ్ర పనిభారం పెంచిందని ఆవేదన
పండగపబ్బం, పగలూరాత్రీ లేకుండా పనిచేయిస్తున్నారంటూ మండిపాటు
సామాన్య ఉద్యోగులపై కక్ష సాధింపు ఎందుకంటూ నిలదీత
డిమాండ్లు పరిష్కరించకుంటే అక్టోబర్ 2న మహోద్యమానికి సిద్ధమని అల్టిమేటం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారుపై గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు నిప్పులుచెరిగారు. విజయవాడ వేదికగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం నాలుగు గంటలపాటు మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన ఉద్యోగులు కదంతొక్కడంతో బెజవాడ ధర్నా చౌక్ దద్దరిల్లింది. సర్కారు వ్యతిరేక నినాదాలతో మిన్నంటింది. బాబు సర్కారు పనిభారం తీవ్రంగా పెంచేసిందని ఉద్యోగ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన లేకుండా పగలూరాత్రీ వెట్టిచాకిరీ చేయిస్తున్నారని మండిపడ్డారు. చిరునవ్వుతో ప్రజల ఇంటి గడప వద్దకు వెళ్లి ప్రభుత్వ సేవలందించే గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల జీవితాల్లో ప్రభుత్వం చిరునవ్వే లేకుండా చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని, న్యాయమైన 22 డిమాండ్లు పరిష్కరించకుంటే అక్టోబర్ 2న మహోద్యమానికి శ్రీకారంచుడతామని సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. తమ గోడు ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పుకున్నా సర్కారులో చలనం లేకపోవడంతో తప్పక చివరకు ఆత్మగౌరవం కోసం రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి వచ్చిందంటూ పేర్కొన్నారు. జాబ్‌చార్ట్‌ను అమలు చేయడం లేదని, పండగపబ్బం లేకుండా సెలవు రోజుల్లోనూ ఏదోపని అప్పగిస్తూ చిత్రహింసలు పెడుతున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వం నుంచి సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన ఆటోమెటిక్ అడ్వాన్స్ స్కీం(ఏఏఎస్), నోçషనల్ ఇంక్రిమెంట్లు ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు.
సచివాలయ ఉద్యోగులకు పని లేదు అనే వాళ్లు ఓ మూడు రోజులు మా ఉద్యోగులందరికీ మాస్ లీవ్‌కి అనుమతిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖ పేరును స్వర్ణ శాఖగా మార్చి, ఉద్యోగుల జీవితాల్లో మాత్రం స్వర్ణమే లేకుండా చేసిందంటూ తూర్పారబట్టారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలో పారదర్శకత అన్నదే లేకుండా ఎమ్మెల్యే సిఫార్సులు ఉంటే బదిలీ అన్నట్టు మార్చేసిందని దుయ్యబట్టారు.
మహిళా ఉద్యోగులకూ సాయంత్రం ఆరు తర్వాత పనులు
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులలో 63 శాతం మంది మహిళలే ఉన్నారని, వీరిపైనా ప్రభుత్వం కనికరం చూపడం లేదని, సాయంత్రం ఆరు తర్వాత కూడా పనులు అప్పగిస్తోందని ఉద్యోగులు ధ్వజమెత్తారు. ఇళ్లకు కరపత్రాలు అంటించే బాధ్యతా అప్పగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేలపై సర్వేలతో విసుగుతెప్పిస్తోందని, వివరాల కోసం పదేపదే ఇళ్లకు వెళ్లి ఓటీపీలు అడుగుతుంటే ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కోవాల్సి వస్తోందని గోడువెళ్లబోసుకున్నారు. ప్రజలు తమను దొంగల్లా చూస్తున్నారని పేర్కొన్నారు. రేషనలైజేషన్ పేరిట ఒక్కో గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించి మిగులు ఉద్యోగులను ఇతర శాఖలకు డిప్యూటేషన్‌పై పంపి పనిభారం తీవ్రంగా పెంచేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
22 డిమాండ్లు తేలకుంటే భారీస్థాయిలో ఆత్మగౌరవ పోరాటం
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్ణీత జాబ్‌చార్ట్ అమలు చేయాలని, ఉద్యోగులకు సముచిత స్థాయి పదోన్నతులు కల్పించాలని, పని ఒత్తిడి తగ్గించాలని, ఉద్యోగులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నోషనల్ ఇంక్రిమెంటు, ఆటోమెటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీం అమలు, ఉద్యోగుల బదిలీలలో పారదర్శకత తదితర 22 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామని, వాటిని పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
తమ డిమాండ్లు కార్యరూపం దాల్చకుంటే అక్టోబరు 2న సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీస్థాయిలో ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాధర్నాకు ప్రతినిధులు వెస్లీ, ప్రభాకర్, ప్రగతి, సుప్రియ తదితరులు నేతృత్వం వహించారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘ ప్రతినిధులతోపాటు ఏఐటీయూసీ నేతలు మద్దతు తెలిపారు.


