రాష్ట్ర బడ్జెట్‌లో అధిక శాతం జీతాలకే సరిపోతుందనడం దారుణం
ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు నయాపైసా ప్రయోజనం జరగలేదు
అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలి
ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ధ్వజం
పీఆర్‌సీని నియమించాలి.. బకాయిలు చెల్లించాలని డిమాండ్
నెల్లూరు (అర్బన్): ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలతో వంచిస్తోందని.. రాష్ట్ర బడ్జెట్ మొత్తం జీతాలకే సరిపోతుందని చెప్పడం దారుణమని ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(ఏపీ ఎన్‌జీజీవో) రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ దుయ్యబట్టారు. శనివారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు నయాపైసా ప్రయోజనం జరగలేదన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో 95 శాతం ఉద్యోగుల జీతాలకే సరిపోతుందని శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొనడం దుర్మార్గమన్నారు. బడ్జెట్‌లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కలిపి 30 నుంచి 33 శాతమేనని తెలిపారు.
ప్రభుత్వం ఇప్పటికైనా అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలు, బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, పీఆర్‌సీ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు. జైళ్ల శాఖలో వార్డెర్లకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 26లోపు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.


